Sangareddy: పోలీసుల గంజాయి దందా?
ABN, Publish Date - Nov 02 , 2024 | 03:41 AM
గంజాయి ముఠాలు పట్టుబడితే ఆ పోలీసులకు పండగే! పట్టుబడ్డ సరుకులోంచి కొంత దారి మళ్లించి సొమ్ము చేసుకుంటారు. కొన్ని నెలలుగా వారిది ఇదే పని! ఓ కేసులో పట్టుబడ్డ నిందితులను విచారించిన సమయంలో ఈ దందా బయటపడింది.
పట్టుకున్న సరుకు పెద్దమొత్తంలో దారిమళ్లింపు
ఇద్దరు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
నిందితుల సమాచారం.. సంగారెడ్డిలో ఘటన
హైదరాబాద్, సంగారెడ్డి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గంజాయి ముఠాలు పట్టుబడితే ఆ పోలీసులకు పండగే! పట్టుబడ్డ సరుకులోంచి కొంత దారి మళ్లించి సొమ్ము చేసుకుంటారు. కొన్ని నెలలుగా వారిది ఇదే పని! ఓ కేసులో పట్టుబడ్డ నిందితులను విచారించిన సమయంలో ఈ దందా బయటపడింది. సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించి ఇద్దరు ఎస్సైలు, హెచ్‌సీ, పీసీ సస్పెండయ్యారు. జిల్లాలోని భానూర్ పోలీసులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న మల్లుగొండ, మల్లేశ్ నాయక్, లకా్‌సను పట్టుకున్నారు. నిందితులను ప్రశ్నించగా తాము గతంలోనూ గంజాయి రవాణా చేసినట్లు అంగీకరించారు.
విచారణలో భాగంగా గతంలో మానూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేసి ప్రస్తుతం పటాన్‌చెరువు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న అంబారియా, గతంలో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసి ఇటీవల వీఆర్‌పై సంగారెడ్డికి బదిలీ అయిన వినయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్, ఏఆర్‌పీసీ మధుకు గంజాయి రవాణా చేసే ముఠాలతో సంబంధాలున్నట్లు తేలింది.. మే 31న ఎస్సై అంబారియా బృందం గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారంతో సనత్పూర్‌లో వాహనాన్ని అడ్డుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారి వాహనం నుంచి 120 కిలోల గంజాయి తీసుకుని నిందితులను వదిలేసినట్లు విచారణలో తేలింది. అంతేకాదు మరో కేసులో 400 ప్యాకెట్ల గంజాయి తీసుకుని ముఠాను వదిలేసినట్లు తేలింది. ప్రాథమిక చర్యల్లో భాగంగా ఇద్దరు ఎస్సైలు, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. న్యాయనిపుణులతో సంప్రదింపుల అనంతరం వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదు చేయనున్నామని వెల్లడించారు. అయితే వీరు గంజాయిని ఏం చేశారు? ఎవరికి.. ఎంతకు విక్రయించారు? అనే విషయాలను పోలీసులు తేల్చే పనిలో పడ్డారు.
కలకలం సృష్టించిన కానిస్టేబుల్ ఆత్మహత్య
దసరా రోజు కొత్తగూడెం జిల్లా బుర్గంపాటు పోలీ్‌సస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన సాగర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం శాఖలో తీవ్ర కలకలం సృష్టించింది. సాగర్‌ను గంజాయి కేసులో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బుర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఆయా కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి మాయం కావడం వెనక ఇద్దరు ఎస్సైల ప్రమేయం ఉందని సాగర్ సెల్ఫీ వీడియో తీశారు. ఈ విషయంలోనూ ఉన్నతాధికారలు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Updated Date - Nov 02 , 2024 | 03:41 AM