Phone Tapping Case: ఆ 2 ఫోన్ నంబర్లు ఎందుకు పంపారు?
ABN, Publish Date - Nov 15 , 2024 | 03:48 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడ్ని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీస్ అధికారుల్ని అరెస్ట్ చేయగా, పెద్ద సంఖ్యలో సాక్షుల్ని విచారించారు.
తిరుపతన్న, భుజంగరావుతో ఉన్న పరిచయమేంటి?
ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే లింగయ్యను ప్రశ్నించిన అధికారులు
2 గంటల పాటు విచారణ.. వాంగ్మూలం నమోదు
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడ్ని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీస్ అధికారుల్ని అరెస్ట్ చేయగా, పెద్ద సంఖ్యలో సాక్షుల్ని విచారించారు. ట్యాపింగ్ కేసులో విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును భారత్‌కు తిరిగి రప్పించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు ట్యాపింగ్ కేసుతో ఉన్న సంబంధంపై దర్యాప్తు అధికారులకు సాంకేతిక ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట లింగయ్య విచారణకు హాజరయ్యారు. సుమారు 2 గంటల పాట ఆయన్ను ప్రశ్నించి, వాంగ్మూలం నమోదు చేశారు. విచారణ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో లింగయ్య రెండు ఫోన్ నంబర్లను తిరుపతన్నకు మెసేజ్ చేశారు.
అప్పుడు లింగయ్య పంపిన నంబర్లు ప్రస్తుత నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులుగా ఉన్న మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్‌కు సంబంధించినవి కావడం గమనార్హం. ప్రైవేటు వ్యక్తుల నంబర్లు ఎందుకు పంపారని అధికారులు ప్రశ్నించగా.. ఏవో అవసరాల నిమిత్తం వారు అడిగి ఉండొచ్చని, అందుకే తన అనుచరుల నుంచి తీసుకుని పంపించినట్లు లింగయ్య సమాధానం చెప్పారు. మునుగోడు ఎన్నిక సమయంలో తిరుపతన్నతో ఫోన్‌లో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఏం మాట్లాడారన్న ప్రశ్నలకు.. కేవలం ఎన్నికల పరిస్థితి ఎలా ఉందనే అంశంపైనే మాట్లాడినట్లు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన భుజంగరావు, తిరుపతన్నలతో ఉన్న పరిచయంపైనా పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేయగా.. పోలీసులు, నాయకుల మధ్య ఉండే పరిచయమేనని, స్థానిక ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చే అభ్యంతరాల మేరకు అవసరాన్ని బట్టి వారితో మాట్లాడినట్లు జవాబు ఇచ్చారు. పోలీస్ బదిలీలు, పోస్టింగ్‌లపైనా మాట్లాడినట్లు చెప్పారని తెలిసింది. కీలక అంశాలపై ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పి లింగయ్యను పంపించారు.
కాల్ లిస్ట్ ఆధారంగా ప్రశ్నించారు :లింగయ్య
విచారణ ముగిసిన తర్వాత తిరిగి వెళ్తూ లింగయ్య మీడియాతో మాట్లాడారు. తిరుపతన్నతో తాను మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగా విచారించారని చెప్పారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. మునుగోడు ఎన్నిక సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని తిరుపతన్న తనను అడిగేవాడని, బాగానే జరుగుతోందని చెప్పానని వివరించారు. వేముల వీరేశం అనుచరుల ఫోన్‌లు ట్యాప్ చేశారనడం అవాస్తవమన్నారు. ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని లింగయ్య స్పష్టం చేశారు.
ఇక వరసగా నోటీసులు
లింగయ్యను విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన దర్యాప్తు అధికారులు ఈ కేసులో మిగతా రాజకీయ నాయకులకూ నోటీసులిచ్చి, ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ కీలక నేతతోపాటు మరికొందరికి నోటీసులు ఇచ్చి, స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మరో ప్రధాన బీఆర్‌ఎస్ నేతకూ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు అధికారుల కోణంలో కొనసాగిన విచారణ ఫోరెన్సిక్ నివేదికలో బట్టబయలైన ఆధారాలతో రాజకీయ నాయకుల వైపు మళ్లింది.
భుజంగరావు మధ్యంతర బెయిల్ 18 వరకు పొడిగింపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో నిందితుడిగా భుజంగరావుకు ఇప్పటికే లభించిన మధ్యంతర బెయిల్‌ను 18 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యం రీత్యా మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.సుజన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భుజంగరావు ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, ఆయనకు స్టెంట్ కూడా వేశారని తెలిపారు. ఈ పిటిషన్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. పిటిషనర్ రెగ్యులర్ బెయిల్ తిరస్కరణకు గురైందని, గురువారం లొంగిపోవాల్సి ఉందని చెప్పారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 18 వరకు మధ్యంతర బెయిల్‌ను పొడిగించింది. ఇదే కేసులో ఐదో నిందితుడు రాధాకిషన్‌రావు రెగ్యులర్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది.
Updated Date - Nov 15 , 2024 | 03:48 AM