Musi River: మూసీలో పరామర్శల వరద..
ABN, Publish Date - Sep 30 , 2024 | 03:13 AM
ఏ క్షణం ఏం జరుగుతుందోనని మూసీ పరివాహకంలోని నిర్వాసితులు బిక్కుబిక్కుమంటుంటే.. ఇదే అవకాశంగా రాజకీయ పార్టీల నాయకులు పరామర్శలు చేస్తున్నారు.
పరివాహక ప్రాంతాల్లో పోటాపోటీగా నేతల పర్యటనలు.. బుల్డోజర్లు నన్ను దాటుకుని రావాలి: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
సీఎంతో మాట్లాడతా.. ధైర్యంగా ఉండండి: మఽధు యాష్కీ
బీజేపీ ఆధ్వర్యంలో వంటావార్పు
దిల్‌సుఖ్‌నగర్, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఏ క్షణం ఏం జరుగుతుందోనని మూసీ పరివాహకంలోని నిర్వాసితులు బిక్కుబిక్కుమంటుంటే.. ఇదే అవకాశంగా రాజకీయ పార్టీల నాయకులు పరామర్శలు చేస్తున్నారు. స్థానికులకు మద్దతుగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆకర్షించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, సర్వే, మార్కింగ్ పనులను నిలిపివేసినప్పటికీ ప్రజల్లో ఆందోళన తగ్గలేదు. ప్రక్రియ మొదలైనప్పుడు గోడు వినని నేతలు.. ఇప్పుడు అండగా ఉంటామంటూ రావడం విడ్డూరమని స్థానికులు నిట్టూరుస్తున్నారు. నదీ గర్భం(రివర్ బెడ్)లో ఉన్నాయంటూ న్యూ మారుతీనగర్ కాలనీలో మార్కింగ్ చేసిన నివాసాలకు చెందిన మహిళలు ఆదివారం ధర్నా చేపట్టారు.
కూల్చివేతలు వద్దంటూ బ్యానర్‌లు ఏర్పాటు చేశారు. కాగా, కోర్టును ఆశ్రయించిన చైతన్యపురి డివిజన్ వెంకట సాయినగర్‌లోని నిర్వాసితులు.. ‘హైకోర్టులో పిటిషన్ వేశాం. మా ఇల్లు కోర్టు రక్షణలో ఉందంటూ’ ప్రహరీపై రాయడమే కాక ఫ్లెక్సీలు కూడా పెట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్వాసితులతో కలిసి చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. ఆదివారం న్యూ మారుతీనగర్‌లో రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. నర్సింహగుప్తా, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి స్వయంగా వంట చేశారు. కాగా, శుక్రవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్‌లు రోడ్డుపై బైఠాయించి మార్కింగ్‌ను అడ్డుకోవగడంతో అధికారులు వెనుదిగారు.
ఎన్ని మార్కింగ్‌లు వేసినా నష్టం జరగనివ్వం
ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీ, వెంకటసాయినగర్ కాలనీల్లో పర్యటించారు. ‘బుల్డోజర్లు మీ ఇళ్ల జోలికొచ్చే ముందు నన్ను దాటుకుని పోవాల్సి ఉంటుందంటూ’ నిర్వాసితుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. మార్కింగ్‌లు వేసినా నష్టం జరగనివ్వనన్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని, అన్ని పార్టీలను కలుపుకొని ఆందోళన చేస్తామని తెలిపారు.
విదేశాల నుంచి యాష్కీ ఫోన్
కొన్ని రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ నుంచి గత ఏడాది పోటీ చేసిన మధుయాష్కీ గౌడ్ ఆదివారం చైతన్యపురి డివిజన్ నిర్వాసిత మహిళలతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలు దిగులు చెందుతున్నారంటూ సీనియర్ నాయకుడు కె.శశిధర్‌రెడ్డి ప్రస్తావించగా.. అన్యాయంగా ఏ ఒక్క ఇంటినీ కూల్చడం జరగదని, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని మధుయాష్కీ భరోసా ఇచ్చారు.
Updated Date - Sep 30 , 2024 | 03:13 AM