TGRTC: బస్సులోనే గర్భిణికి పురుడు పోసిన మహిళా కండక్టర్..
ABN, Publish Date - Jul 06 , 2024 | 03:17 AM
టీజీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సులో శుక్రవారం ఓ గర్భిణి ప్రసవించింది. ఆ బస్సులో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ ఆమెకు పురుడుపోయగా ఆడపిల్ల జన్మించింది.
అదే బస్సులో ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్‌లో ఘటన కండక్టర్, డ్రైవర్‌కు మంత్రి పొన్నం అభినందన
బర్కత్‌పుర, జూలై 5 (ఆంధ్రజ్యోతి): టీజీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సులో శుక్రవారం ఓ గర్భిణి ప్రసవించింది. ఆ బస్సులో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ ఆమెకు పురుడుపోయగా ఆడపిల్ల జన్మించింది. అనంతరం బస్సు డ్రైవర్ ఆ తల్లీబిడ్డలను అదే బస్సులో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ మానవత్వం చాటుకున్న ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే జరిగింది. ముషీరాబాద్ డిపోకు చెందిన 1జెడ్ రూట్ సిటీ బస్సు శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో ఆరాంఘర్ నుంచి సికింద్రాబాద్ బయలుదేరింది. ఆరాంఘర్‌కు చెందిన శ్వేతరత్నం అనే గర్భిణి ఈ బస్సు ఎక్కారు. బస్సు బహదూర్‌పూర చేరుకునే సరికి శ్వేతరత్నంకు పురిటి నొప్పులు అధికమవ్వడంతో డ్రైవర్ ఎం.అలీ వావాహన్ని రోడ్డు పక్కన ఆపారు.
మహిళా కండక్టర్ బి. సరోజ ప్రయాణికులందరినీ కిందకు దింపి కొందరు మహిళలతో కలిసి శ్వేతరత్నంకు పురుడుపోయగా అమ్మాయి పుట్టింది. అనంతరం తల్లీబిడ్డలను అదే బస్సులో తీసుకెళ్లి జజ్జీఖానా ఆస్పత్రిలో చేర్చించారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ సిటీ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వరప్రసాద్ ఇతర అధికారులు డ్రైవర్ అలీ, కండక్టర్ సరోజను సత్కరించారు. అలాగే, డ్రైవర్ అలీ, కండక్డర్ సరోజకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలియజేశారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు సేవాస్ఫూర్తి చాటుతున్న ఆర్టీసీ సిబ్బంది సేవలు ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు.
Updated Date - Jul 06 , 2024 | 03:17 AM