Kancha ilaiah: గద్దర్ జయంతి రోజు గద్దర్ అవార్డులు ఇవ్వాలి
ABN, Publish Date - Dec 27 , 2024 | 04:03 AM
ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి రోజు గద్దర్ అవార్డులు ఇవ్వాలని, కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ కోరారు.
కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో
చాకలి ఐలమ్మ విగ్రహానికి స్థలమివ్వాలి: కంచ ఐలయ్య
పంజాగుట్ట, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి రోజు గద్దర్ అవార్డులు ఇవ్వాలని, కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని, వాటిని తాము స్వాగతిస్తున్నామన్నారు. కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో ఆమె విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వైస్ చాన్స్‌లర్‌కు రాసిన లేఖను ఆయన ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సాంస్కృతిక, విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం సినీపరిశ్రమకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటించడం, కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు, వరంగల్ విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు, కేంద్ర ప్రభుత్వం ములుగులో సమ్మక్క సారలమ్మ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పైన ప్రతిష్టించాలని, కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో స్థలం కేటాయిస్తే తామే ఆరడుగుల కాంస్య విగ్రహాన్ని యూనివర్సిటీకి అందజేస్తామని తెలిపారు. గద్దర్ జయంతి రోజైన జనవరి 31న ఆయన పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలన్నారు.
Updated Date - Dec 27 , 2024 | 04:03 AM