Rahul Gandhi: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా
ABN, Publish Date - Nov 06 , 2024 | 03:11 AM
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న కులగణన.. దేశానికే ఒక నమూనా కానుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇక్కడ చేపట్టే కులగణనలో ఏమైనా లోటుపాట్లు జరిగితే.. దేశ వ్యాప్తంగా కులగణన నిర్వహించేటప్పుడు వాటిని సరి చేసుకుంటామని చెప్పారు.
భవిష్యత్తులో దేశవ్యాప్తంగా చేపడతాం.. కులగణన కేవలం కులాల గణన కాదు
కుల వివక్ష, అసమానతను
ఎదుర్కొంటున్నవారి అభివృద్ధికి సాధనం
ఈ వివరాలతో రాబోయే తరాల భవిష్యత్తుకు,
పాలనా విధానానికి రూపకల్పన చేస్తాం
దేశంలో తీవ్ర స్థాయిలో కుల వివక్ష ఉంది
అనేక మంది జీవితాలను నాశనం చేస్తోంది
దీనిపై సవాల్‌కు మోదీ ముందుకు రావట్లేదేం?
కులగణనపై సంప్రదింపుల సదస్సులో రాహుల్
బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు అందిస్తాం
కులగణన మా ప్రభుత్వ బాధ్యత: సీఎం రేవంత్ఙ్
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న కులగణన.. దేశానికే ఒక నమూనా కానుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇక్కడ చేపట్టే కులగణనలో ఏమైనా లోటుపాట్లు జరిగితే.. దేశ వ్యాప్తంగా కులగణన నిర్వహించేటప్పుడు వాటిని సరి చేసుకుంటామని చెప్పారు. ఈ కులగణన ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంభాషణలాగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన కార్యక్రమం చేపట్టడం పట్ల తాను గర్వపడుతున్నానని, రాష్ట్ర నాయకత్వాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. మంగళవారం టీపీసీసీ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణనపై నిర్వహించిన సంప్రదింపుల సదస్సుకు రాహుల్‌గాంధీ హాజరయ్యారు. వివిధ సంఘాలు, వర్గాల నుంచి కులగణనపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం సదస్సునుద్దేశించి రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో కులవివక్ష చాలా తీవ్రంగా, లోతుగా ఉందన్నారు. రాజకీయ, న్యాయ, కార్పొరేట్ వ్యవస్థలు సహా అన్ని చోట్లా ఈ వివక్ష ఉందని, దానిని ఎదుర్కొంటున్నవారికి మాత్రమే ఆ బాధ తెలుస్తుందని అన్నారు. అనేక మంది జీవితాలను, ఆత్మవిశ్వాసాన్ని ఇది నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కుల వ్యవస్థ, కుల వివక్ష ఉందన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తారని, అయితే అది ఏ స్థాయిలో ఉందో లెక్కించి దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాను ఈ విషయాన్ని అడిగితే.. దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానంటూ ప్రధాని మోదీ, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిజం మాట్లాడితే దేశాన్ని విభజించినట్లా? అని ప్రశ్నించారు.
వాస్తవం బహిర్గతం కావాలి..
దేశంలోని అన్ని మతాలు ప్రాథమికంగా చెప్పేది సత్యం, అహింస అని, అందుకే దేశంలో కుల వివక్ష ఉందన్న సత్యం బహిర్గతం కావాలని రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలు, ఇతరులు ఎంత మంది ఉన్నారో లెక్కించడంతో పాటు ఆయా వర్గాలకు దేశ సంపద ఏ మేరకు పంపిణీ జరిగిందన్నదీ తెలుసుకోవాలంటున్నామని పేర్కొన్నారు. అలాగే కార్పొరేట్, న్యాయ వ్యవస్థల్లో, ఆర్మీలో ఆయా వర్గాలవారు ఏ మేరకు ఉన్నారు, జనరల్ కేటగిరీలో పేదలు ఎంత మంది ఉన్నారన్నదీ వెలికి తీయాలంటున్నామని తెలిపారు. కులగణన.. ఎక్స్‌రే లాంటిదని పేర్కొన్నారు. కుల వివక్ష ద్వారా ప్రయోజనం పొందుతున్నవారే.. కుల వివక్ష ఏ మేరకు ఉందన్న సత్యాన్ని ప్రజలు తెలుసుకోకూడదని భావిస్తున్నారని ఆరోపించారు. కుల వివక్షపై సవాల్ చేయడానికి ప్రధాని మోదీ ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు. కార్పొరేట్ న్యాయవ్యవస్థ, మీడియా రంగంలో దళితులు, ఆదివాసీలు, బీసీలు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి ప్రధాని ఎందుకు వెనకాడుతున్నారని నిలదీశారు. తాము జాతీయ స్థాయిలో కులగణన చేపడతామని, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని బద్దలు కొడతామని పార్లమెంటు సాక్షిగా చెప్పానని గుర్తు చేశారు.
కులగణనలో ప్రశ్నలను ప్రజలే నిర్ణయించాలి
కులగణనలో అడిగే ప్రశ్నలను అధికారులు కూర్చుని నిర్ణయించడానికి తాను వ్యతిరేకమని రాహుల్‌గాంధీ తెలిపారు. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలన్నది ప్రజలే నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు. కులగణన కేవలం కులాల గణన మాత్రమే కాదని, వివక్ష, అసమానతలు ఎదుర్కొంటున్నవారి సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి ఇది సాధనంగా మారుతుందని అన్నారు. ఈ కులగణన వివరాలతో పాలనా విధానం, రాబోయే తరాల భవిష్యత్తు రూపకల్పన జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో వివక్ష ఉందన్నది సత్యమని, దేశం ఆర్థికంగా, సంతోషంలో శక్తివంతమైన దేశంగా మారాలంటే కుల వివక్ష ఎంత మేరకు ఉందో, దాని స్వభావమేంటో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ సత్యం తెలియకుండా ప్రజలకు జవాబుదారీ అయిన రాజకీయ నాయకుడు వారి వద్దకు పోకూడదని రాహుల్ అభిప్రాయపడ్డారు.
కులగణన మా ప్రభుత్వ బాధ్యత: రేవంత్
సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వేను తమ ప్రభుత్వం బాధ్యతగా భావించిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పౌర సమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్‌గాంధీ ఇక్కడికి రావడం గొప్ప విషయమని, ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలని అన్నారు. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలను మాటల్లో కాకుండా చేతల్లో చూపాలన్నదే రాహుల్ ఆలోచన అని పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించేందుకు అడుగు ముందుకు వేశారని, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడమే తమ కర్తవ్యమని చెప్పారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో 31,383 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారని, ఇందులో ఓసీలు 3076 మంది (9.8ు), ఈడబ్ల్యూఎస్ వారు 2774 మంది (8.8ు) ఉంటే.. ఓబీసీలు 17,921 మంది (57.11ు), ఎస్సీలు 4828 (15.3ు) మంది, ఎస్టీలు-2783 (8.8ు) మంది ఉన్నారని సీఎం వివరించారు. ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ‘‘మనది రైజింగ్ తెలంగాణ. దేశానికి రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడమే మన కర్తవ్యం. కులగణన పూర్తిచేసి.. బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తాం’’ అని రేవంత్ అన్నారు.
మాట నిలబెట్టుకున్న రాహుల్‌గాంధీ..
రాహుల్‌గాంధీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కుల గణన చేపడుతుందని ప్రకటించారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క గుర్తు చేశారు. రాహుల్ చెప్పినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపడుతోందని అన్నారు. ఇచ్చినమాటను ఆయన నిలబెట్టుకున్నారని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ ఏ విషయంలోనైనా మాట ఇచ్చారంటే అమలు చేసి తీరతారని అన్నారు. కులగణనతో అది మరోసారి నిరూపితమైందని కొనియాడారు. కులగణన చేపట్టడం ద్వారా దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కాగా, కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించారు. సదస్సులో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా 500 నుంచి 600 మంది దాకా కాంగ్రెస్ ప్రముఖులు పాల్గొ పాల్గొన్నారు. సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. సదస్సులో పాల్గొన్న అనంతరం రాహుల్ ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్లి పోయారు.
కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
బోయిన్‌పల్లి: కులగణనపై సంప్రదింపుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు పాస్‌లు లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి భారీ జనసమీకరణ చేశారు. ముఖ్యంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధ్వర్యంలో సుమారు 5వేల మందిని సమీకరించారు. దారిలో కటౌట్లు ప్లెక్సీలు ఏర్పాటుచేసి రాహుల్‌కు స్వాగతం పలికారు. అయితే పాస్‌లు లేనివారిని పోలీసులు అనుమతించలేదు. ఇదిలా ఉండగా.. రాహుల్ కాన్వాయ్ వెళ్లే రహదారిలో పలు చోట్ల బీఆర్‌ఎస్ నాయకులు.. పారిశ్రామికవేత్త అదానీతో సీఎం రేవంత్ కలిసి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం తెల్లవారుజామున వాటిని తొలగించారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కొందరు బీఆర్‌ఎస్ నేతలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి.. రాహూల్ సమావేశం ముగిసిన తర్వాత విడిచిపెట్టారు.
Updated Date - Nov 06 , 2024 | 03:11 AM