Train Services: రైళ్ల పునరుద్ధరణ..
ABN, Publish Date - Sep 05 , 2024 | 03:41 AM
ఇంటికన్నె-కేసముద్రం, మహబూబాబాద్-తాళ్లపూసలపల్లి స్టేషన్ల మధ్య కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కొలిక్కి వచ్చాయి.
ఇంటికన్నె, తాళ్లపూసపల్లి, వద్ద మరమ్మతులు పూర్తి
గూడ్స్ రైలు, సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లతో ట్రయల్ రన్
ఆ తర్వాత ప్రయాణికులతో వెళ్లిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ సిటీ/కేసముద్రం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఇంటికన్నె-కేసముద్రం, మహబూబాబాద్-తాళ్లపూసలపల్లి స్టేషన్ల మధ్య కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కొలిక్కి వచ్చాయి. వరద ఉధృతి తగ్గడంతో విజయవాడ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ట్రాక్ (అప్ లైన్) మరమ్మతులను రైల్వే అధికారులు పూర్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచే రైళ్ల రాకపోకలను పాక్షికంగా పునరుద్ధరించారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు (డౌన్ లైన్) మార్గంలో పునరుద్ధరణ పనులను బుధవారం రాత్రికల్లా పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో మూడు రోజులుగా నిలిచిపోయిన వందలాది రైళ్ల రాకపోకలకు మార్గం సుగమమైంది.
ఆదివారం సాయంత్రం నుంచి 12 ఎక్స్‌కవేటర్లు, 11 టిప్పర్లు, 2 క్రేన్లు, ఒక రోడ్డు రోలర్‌తోపాటు 600 మంది కార్మికులు, ఇంజనీరింగ్, ఓహెచ్‌ఈ (ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్), ఎస్‌అండ్‌టీ (సిగ్నల్ అండ్ టెలికాం) సిబ్బంది, ఉన్నతాధికారులు నిరంతరం శ్రమించి ఎట్టకేలకు బుధవారం ఉదయం 10గంటలకు అప్‌లైన్ ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఈ ట్రాక్ మీదుగా తొలుత ఒక గూడ్స్ రైలు, ఆ తర్వాత కేసముద్రం రైల్వేస్టేషన్‌లో నిలిపి ఉంచిన బెంగళూరు-దానాపూర్ సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్(ఖాళీ రైలు)తో ట్రయల్ రన్ చేసి పరీక్షించారు. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌కు ప్రయాణికులతో బయల్దేరిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.30గంటలకు ఆయా స్టేషన్లను ఎటువంటి ఆటంకం లేకుండా దాటి వెళ్లడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తర్వాత తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్, డౌన్ వైపు హౌరా, నాగర్‌సోల్, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లను కాషన్ ఆర్డర్‌తో నెమ్మదిగా నడిపించారు. బుధవారం రాత్రిలోగానే డౌన్ లైన్‌ను కూడా సిద్ధం చేసి గురువారం నుంచి అన్ని రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే వర్గాలు తెలిపాయి. మరమ్మతుల కోసం 30వేల క్యూబిక్ మీటర్ల మట్టి, 5వేల క్యూబిక్ మీటర్ల కంకర, 6వేల క్యూబిక్ మీటర్ల ప్రత్యేక మట్టిని ఉపయోగించారు. ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్ నిలయంలోని విపత్తు నిర్వహణ కార్యాలయం నుంచి ద క్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పర్యవేక్షించారు. పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన అధికారులు, సిబ్బందిని ఆయన ప్రశంసించారు. భారీ వర్షాల కారణంగా రద్దయిన పలు రైళ్లను అధికారులు పునరుద్ధరించినా, దారి మళ్లిచడంతో గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి.
Updated Date - Sep 05 , 2024 | 03:41 AM