TG NEWS: లగచర్ల దాడి కేసులో షాకింగ్ విషయాలు బయటపెట్టిన పట్నం నరేందర్‌రెడ్డి
ABN, Publish Date - Nov 14 , 2024 | 06:12 PM
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో బీఆర్‌ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. లగచర్లలో అధికారులపై దాడి కేసును రేవంత్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
వికారాబాద్: తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన లగచర్లలో ప్రభుత్వాధికారులపై దాడి కేసు కీలక మలుపు చోటు చేసుకుంది. లగచర్లలో ప్రభుత్వాధికారులపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఇవాళ(గురువారం) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బొమరాస్‌పేట్ స్టేషన్‌లో నమోదైన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రిమాండ్ రిపోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. టీఐఐసీ కోసం భూమి కోల్పోయే బాధితులే అధికారులపై దాడి చేశారని చెప్పారు. ఈ విషయాన్ని సరిగా పరిశీలించకుండానే కిందికోర్టు తనను పోలీసు కస్టడీకి పంపిందని అన్నారు. ఈ ఘటనతో తనకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు పోలీసులు సమర్పించలేదని పట్నం నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
రిమాండ్ డైరీలో పేర్కొన్నట్లు అరెస్టును సమర్థించే కారణాలు తెలపలేదని అన్నారు. అరెస్టు అక్రమం, రాజకీయ ప్రేరేపితమన్న విషయాన్ని కిందికోర్టు గ్రహించలేదన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టుకు విన్నవించారు. కాగా సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అలాగే లగచర్ల దాడి కేసు ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని హైకోర్టులో లగచర్ల ప్రజలు పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసు పెట్టారని ఈ కేసులను కొట్టి వేయాలని హైకోర్టులో గ్రామస్తులు పిటిషన్ వేశారు.
పథకం ప్రకారమే లగచర్ల దాడి ..
కాగా.. వికారాబాద్ జిల్లా, కొడంగల్ లగచర్ల దాడి పథకం ప్రకారమే జరిగిందని.. ఒక్కటొక్కటిగా సాక్ష్యాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు. సర్కార్ ఇచ్చిన జాబితాలో.. బీఆర్ఎస్ నేత సురేష్‌కు సంబంధించిన భూమి లేదని ప్రభుత్వం తేల్చింది. సురేష్, సోదరుడు మహేష్‌కు ఎలాంటి భూమి లేదని నివేదిక ఇచ్చింది. 42 మంది నిందితుల్లో 17 మందికి ల్యాండ్ లేదని జిల్లా కలెక్టర్ తేల్చారు. బయట గ్రామం నుంచి వచ్చి దాడులకు పాల్పడినట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. పట్నం నరేందర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఫోన్ ఓపెన్ చేసేందుకు మేజిస్ట్రేట్ అనుమతి కోరారు. సురేష్, నరేందర్‌రెడ్డి నుంచి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డిను కస్టడీకి పోలీసులు కోరారు.
దర్యాప్తు ముమ్మరం..
లగచర్ల ఘటనఫై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తం ఈ కేసులో 20 మందిని అరెస్ట్ చేసి రీమాండ్‌కు తరలించారు. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆయనకు కొండంగల్ కోర్టు ఈ నెల 27 వరకు రీమాండ్ విధించింది. పట్నం నరేందర్ రెడ్డి రీమాండ్ రీపోర్ట్‌లో కేటీఆర్ పేరు చేర్చారు. కేటీఆర్‌తో నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కాల్ డేటాతో పాటు.. ఇద్దరి మధ్య సంభాషణలకు సంబంధించి కాల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులతో పాటు.. ఎంత వరకైనా వెళ్లాలంటూ నరేందర్ రెడ్డిని కేటీఆర్ పురమాయించినట్లుగా ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది.
కేటీఆర్లో పార్క్‌లో నరేందర్‌రెడ్డి అరెస్ట్..
నరేందర్‌రెడ్డి బుధవారం ఉదయం 6 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో ఉండగా.. వికారాబాద్ టాస్క్‌ఫోర్స్, ప్రత్యేక పోలీసు బృందాలు అరెస్టు చేశాయి. అక్కడి నుంచి నేరుగా వికారాబాద్‌లోని పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించాయి. ఉదయం 8.30 నుంచి 1.30 వరకు.. ఐదుగంటల పాటు నరేందర్‌రెడ్డిని డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని దర్యాప్తు బృందం విచారించింది. ఆ తర్వాత తమ వద్ద ఉన్న సాంకేతిక ఆధారాలను ఆయన ముందు పెట్టి.. పలు ప్రశ్నలు సంధించింది. అదే సమయంలో.. జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, ఆ తర్వాత మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ కూడా నరేందర్‌రెడ్డిని విడివిడిగా విచారించారు. ‘‘అధికారులపై దాడికి ముందు బోనగాని సురేశ్‌రాజ్‌తో ఏం మాట్లాడారు? కర్రలు, కారంపొడిని సిద్ధం చేసుకోవాలని గ్రామస్థులను ప్రోత్సహించారా? దాడి జరిగిన తర్వాత సురేశ్ కాల్ చేశాడా? ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు?’’ అని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది.
ముక్తసరి సమాధానాలు..
అయితే.. నరేందర్‌రెడ్డి విచారణకు సహకరించలేదని తెలిసింది. పలు ప్రశ్నలకు ‘‘తెలియదు’’.. ‘‘నాకు సంబంధం లేదు’’.. ‘‘కాదు’’.. అని ముక్తసరి సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ‘‘ఎమ్మెల్యేగా పనిచేశాను. కార్యకర్తలు ఫోన్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరి ఫోన్‌ను ఆన్సర్ చేస్తాను’’ అని పేర్కొన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దర్యాప్తునకు నరేందర్‌రెడ్డి సహకరించకపోవడంతో.. తమ వద్ద ఉన్న సాంకేతిక ఆధారాలను ముందు పెట్టిన పోలీసులు.. నరేందర్‌రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నరేందర్‌రెడ్డిని పరిగి మీదుగా కొడంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాక.. కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అప్పటికే పోలీసులు అక్కడ రిజర్వ్ బలగాలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నరేందర్‌రెడ్డి తరఫున బీఆర్‌ఎస్ లీగల్‌సెల్ న్యాయవాదులు వాదనలను వినిపించారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న జడ్జి.. నరేందర్‌రెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో మంగళవారం 16 మంది రిమాండ్‌కు వెళ్లగా.. బుధవారం నరేందర్‌రెడ్డితోపాటు శివ(ఏ-3), బోగమోని మహేశ్(ఏ-21), బేగరి విశాల్(ఏ-22), నీరటి సాయిలు(ఏ-24), నీరటి రమేశ్(ఏ-27)లను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కాగా.. కొడంగల్ కోర్టు వద్ద పలువురు బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. కుట్రపూరితంగా నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశారని ఆరోపించారు. అటు కొడంగల్ నియోజకవర్గంలో ఇంటర్నెట్ సేవల బంద్ కొనసాగుతోంది. దీంతో.. మంగళవారం కూడా మీసేవా కేంద్రాలు, బ్యాంకులు పనిచేయలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసు.. చిరుమర్తి లింగయ్య కీలక విషయాలు వెల్లడి..
BJP: మిడి మిడి జ్ఞానంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి
Read Latest Telangana News and TELUGU NEWS
Updated Date - Nov 14 , 2024 | 07:31 PM