Hyderabad: రెచ్చిపోతున్న రియల్ మాఫియా.. బతికుండగానే చనిపోయినట్టు సర్టిఫికెట్
ABN, Publish Date - Jan 28 , 2024 | 08:57 AM
హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న భూములకు భారీగా డిమాండ్ ఏర్పడింది. శివారులో భూమి కొనుగోలు చేసిన ఓ వ్యక్తి భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారు. భూమి కబ్జా చేసేందుకు ఏకంగా డెత్ సర్టిఫికెట్ సృష్టించారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సిటీ చుట్టు పక్కల ఉన్న భూములకు భారీగా డిమాండ్ ఏర్పడింది. శివారులో భూములు కొనుగోలు చేసినవారు అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ భూమి కొని, విదేశాలకు వెళ్లిపోయారో ఇక అంతే సంగతులు. ఆ భూమి ఆక్రమణకు గురి కావడం ఖాయం. హైదరాబాద్ (Hyderabad) రియల్ మాఫియా ఆ భూములను ఏంచక్కా ఆక్రమించేస్తాయి. కొందరు అయితే ఏకంగా డెత్ సర్టిఫికెట్ సృష్టిస్తాయి. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి భూమిని కబ్జా చేసేందుకు ఇలా ప్రయత్నించారు.
ఫేక్ డెత్ సర్టిఫికెట్
రాజేంద్రనగర్ బద్వేల్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి భూమి కొనుగోలు చేశారు. అతను అమెరికాలో ఉంటారు. బద్వేల్‌లో ఉన్న ఆ భూమికి డిమాండ్ ఉంది. దీనిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. శ్రీనివాస్ చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ తయారు చేశారు. అతనికి నకిలీ భార్యను సృష్టించారు. భూమి విక్రయించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. డాక్యుమెంట్ చూసిన రిజిస్ట్రార్‌కు సందేహాం కలిగింది.
నోటీసులు పంపడంతో
డాక్యుమెంట్ రూపొందించిన అడ్రస్‌కు సబ్ రిజిస్ట్రార్ నోటీసులు పంపించారు. ఆ నోటీసులు భూమి యజమాని శ్రీనివాస్‌కు చేరాయి. తన భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని వెంటనే హైదరాబాద్ వచ్చారు. సబ్ రిజిస్ట్రార్‌ను శ్రీనివాస్ కలిశారు. తాను భూమి అమ్మడం లేదని ఆయన వివరించారు. తాను చనిపోయినట్టు ఎవరో తప్పుడు పత్రాలు రూపొందించారని సబ్ రిజిస్ట్రార్‌కు తెలిపారు. ఈ ఘటనపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఆ ముఠాను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
ఆక్రమణకు గురికాలే
హైదరాబాద్ వేగంగా డెవలప్ అవుతోంది. ఎక్కడ చిన్న స్థలం ఖాళీ ఉందని తెలిస్తే చాలు ఆక్రమిస్తున్నారు. శ్రీనివాస్ భూమి విషయంలో సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ ఇంటికి పంపించడంతో ఆక్రమణ గురించి తెలిసింది. లేదంటే ఆయన కూడా భూ ఆక్రమణ బాధితుల జాబితాలో చేరి పోయేవారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 28 , 2024 | 08:57 AM