Accident: చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యపు డ్రైవింగ్
ABN, Publish Date - Aug 20 , 2024 | 04:46 AM
ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్.. రెండేళ్లు కూడా నిండని బాలుడి నూరేళ్ల జీవితాన్ని చిదిమేసింది. వరికుప్పల రామకృష్ణ, జ్యోతి దంపతులు మీర్‌పేట్ హస్తినాపురం జడ్పీ రోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. వీరికి ఓ బాబు, పాప ఉన్నారు.
ఆడుకుంటున్న బాలుడిని ఢీకొట్టిన కారు
కిందపడ్డాడని కుటుంబసభ్యులను నమ్మించిన నిందితుడు
మీర్‌పేట్‌లో దారుణం
సరూర్‌నగర్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్.. రెండేళ్లు కూడా నిండని బాలుడి నూరేళ్ల జీవితాన్ని చిదిమేసింది. వరికుప్పల రామకృష్ణ, జ్యోతి దంపతులు మీర్‌పేట్ హస్తినాపురం జడ్పీ రోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. వీరికి ఓ బాబు, పాప ఉన్నారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బాబు దీక్షిత్(22నెలలు) గేటు బయట ఆడుకుంటున్నాడు.
అదే సమయంలో ఇంటి యజమాని కొత్తకాపు దినేశ్‌రెడ్డి తన టాటా హారియర్ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి, ఆడుకుంటున్న దీక్షిత్‌ను ఢీకొట్టాడు. దీంతో కారు రెండు టైర్లు బాబు పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దినేశ్‌రెడ్డి బాబును తీసుకుని జ్యోతివద్దకు వెళ్లి ‘మీ బాబు బయట కిందపడ్డాడు... బాగా గాయాలయ్యాయి’ అని చెప్పాడు.
అనంతరం దినేశ్ తన కారులో బాబును ఆస్పత్రికి తరలించాడు. దీక్షిత్ చికిత్స పొందుతూ అర్థరాత్రి మరణించాడు. కాగా, సోమవారం ఉదయం సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా దినేశే యాక్సిడెంట్ చేసినట్లు తెలిసింది. దీంతో బాలుడి తండ్రి రామకృష్ణ మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం బయట పడడంతో దినేశ్‌రెడ్డి పరారయ్యాడు.
Updated Date - Aug 20 , 2024 | 04:46 AM