Nalgonda: సన్నాలకూ దక్కని మద్దతు ధర!
ABN, Publish Date - Nov 11 , 2024 | 04:04 AM
ప్రభుత్వం బోనస్ ఇవ్వని దొడ్డు ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్న రైస్ మిల్లర్లు.. సన్న ధాన్యానికి కూడా కనీస మద్దతు ధర చెల్లించడంలేదు. ధాన్యం నాణ్యతగా లేదని, తేమ ఎక్కువ ఉందనే కారణాలు చూపుతూ.. ధరను తగ్గించేస్తున్నారు.
క్వింటాలుకు 2200 మాత్రమే పెడతామన్న మిర్యాలగూడ రైస్ మిల్లర్లు.. నాణ్యత, తేమ పేరుతో ధర తగ్గింపు
మిర్యాలగూడకు 3 వేల ధాన్యం ట్రాక్టర్లు
రూ.2200 మాత్రమే ఇస్తామన్న మిల్లర్లు
నాణ్యత, తేమ సాకులతో ధర తగ్గింపు రోజంతా రైతుల ధర్నా, రాస్తారోకో
మిల్లుల వద్ద రైతుల ధర్నా, రాస్తారోకో
3వేలకు పైగా ధాన్యం ట్రాక్టర్ల రాక
రోజంతా ఆందోళనలు చేపట్టిన రైతులు
వేరేదారి లేక మిల్లర్లు ఇచ్చిన ధరకే అమ్మకం
సన్న ధాన్యాన్ని సరైన ధరకు కొనడం లేదు! ధాన్యం ఎక్కువ వస్తే.. ధర తగ్గించేస్తున్నారు! క్వింటా ధర రూ.2,200కే పరిమితం చేస్తున్నారు! మిల్లర్ల తీరును నిరసిస్తూ రైతులు ధర్నాలు కూడా చేస్తున్నారు! ఇక, దొడ్డు ధాన్యం కొనుగోలులోనూ దొడ్డ మనసు చూపడం లేదు! పైగా, ప్రభుత్వం నుంచి జరిమానాలు, కేసుల నుంచి తప్పించుకునేందుకు దొడ్డు దారి పట్టారు! గత సీజన్లలో సర్కారుకు ఇవ్వకుండా టెండర్ పెట్టిన ధాన్యానికి బదులు ఇప్పుడు కొత్త ధాన్యం సేకరించి ఇవ్వాలని పావులు కదుపుతున్నారు! వాటిని కూడా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు! వెరసి, ఇటు సన్న ధాన్యం, అటు దొడ్డు ధాన్యంతో మిల్లర్లు ఇటు సర్కారును, అటు రైతులను మాయ చేస్తున్నారు!! ఇక సీసీఐ కొత్త నిబంధనలు పత్తి రైతుల నెత్తిన పిడుగులా మారాయి. రాష్ట్రంలో కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు కాటన్ అసోసియేషన్ ప్రకటించింది.
నల్లగొండ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం బోనస్ ఇవ్వని దొడ్డు ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్న రైస్ మిల్లర్లు.. సన్న ధాన్యానికి కూడా కనీస మద్దతు ధర చెల్లించడంలేదు. ధాన్యం నాణ్యతగా లేదని, తేమ ఎక్కువ ఉందనే కారణాలు చూపుతూ.. ధరను తగ్గించేస్తున్నారు. ఇందుకు రైతులు అంగీకరించకపోతే ధాన్యం కొనుగోలును నిలిపివేస్తూ.. తాము నిర్ణయించిన ధరకే వారు విక్రయించే పరిస్థితులు కల్పిస్తున్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రైతులకు ఇదే పరిస్థితి ఎదురైంది. క్వింటాలు ధాన్యానికి రూ.2300 కనీస మద్దతు ధరకుతోడు రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో కలిపి సన్న వడ్ల ధర క్వింటాలుకు రూ.2,800 అవుతుంది.
అయితే తేమ శాతం ఎక్కువ ఉందన్న కారణంతో రైతులు మిల్లర్లకు అమ్మేందుకు వెళితే.. వారు క్వింటాల్‌కు రూ.2200కి మించి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. దీంతో రైతులు రోడ్డెక్కారు. ఉన్నట్లుండి ధర తగ్గించడం, కొనుగోళ్లు నిలిపివేయడంతో ఆందోళన చేపట్టారు. పట్టణ శివార్లలో నార్కట్‌పల్లి- అద్దంకి జాతీయ రహదారి వెంబడి, మిర్యాలగూడ- కోదాడ రాష్ట్ర రహదారుల వెంబడి విస్తరించిన రైస్‌మిల్లుల వద్ద ధర్నాలు చేశారు. శనివారం సాయంత్రం నుంచి మిల్లుల వద్ద కాంటాలు నిలిపివేయడంతో ఈ రెండు ప్రాంతాల్లోని మిల్లుల వద్ద ఆదివారం ఉదయం వరకు 3వేల ధాన్యం లోడు ట్రాక్టర్లు నిలిచిపోయాయి. ఉదయం 10 గంటల వరకు కొనుగోళ్లు చేయకపోవడంతోపాటు, ధాన్యం నాణ్యతగా లేదని ధర క్వింటాల్‌కు రూ.2200కి మించి ఇవ్వలేమని మిల్లర్ల గుమాస్తాలు ప్రకటించారు. దీంతో రెండు ప్రాంతాల్లోనూ రైతులు ధర్నాలకు దిగారు. ఈ ఆందోళనతో రెండువైపులా దాదాపు రెండు గంటలకుపైగా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది.
ఎమ్మెల్యే, అధికారులు వచ్చి చెప్పినా..
రైతుల ధర్నా విషయం తెలుసుకున్న వేములపల్లి తహసీల్దార్ కోటేశ్వరి, వేములపల్లి ఎస్‌ఐ వెంకటేశంతో కలిసి నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై ఉన్న మిల్లుల వద్దకు వచ్చి రైతులు, మిల్లర్లతో చర్చలు జరిపారు. ధాన్యాన్ని మిల్లుల్లోకి పంపించి తేమ శాతం(17) ప్రకారం ధర ఇవ్వాలని సూచించారు. మరోవైపు కోదాడ-మిర్యాలగూడ రహదారిపై ధర్నా చేస్తున్న రైతుల వద్దకు మిర్యాలగూడ తహసీల్దార్ హరిబాబు, రూరల్ ఎస్‌ఐ లోకేష్ వెళ్లి ట్రాక్టర్లను మిల్లుల్లోకి పంపించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మద్దతు ధర కల్పించి రైతుల ఽధాన్యం కాంటాలు వేసుకోవాలని సూచించారు. కానీ, మిల్లర్లు మాత్రం ధర కల్పించలేదు. రూ.2200కే పరిమితం చేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సైతం మిల్లర్ల వద్దకు వచ్చి రైతులు, మిల్లర్లతో మాట్లాడారు. ధాన్యానికి కనీస మద్దతు ఇవ్వాలని మిల్లర్లకు సూచించారు. ఎమ్మెల్యే అక్కడున్న కొద్దిసేపు సమారు 10మంది రైతులు తెచ్చిన ధాన్యానికి క్వింటాకు రూ.2400 ధర ఇచ్చారని, ఎమ్మెల్యే వెళ్లిపోయిన వెంటనే మళ్లీ ధాన్యం బాగోలేదంటూ కాంటాలు నిలిపివేసి క్వింటాకు రూ.2,200కి ధర పరిమితం చేశారని రైతులు వాపోయారు.
గతేడాది, ఈ ఏడాది గతవారం వరకు సైతం ఈ మిల్లుల్లోనే సన్న ధాన్యానికి ఎటువంటి పట్టింపుల్లేకుండా క్వింటాకు రూ.2,400కుపైగా ధర ఇచ్చారని, ఈసారి ధాన్యం ఎక్కువగా వస్తుండటంతో ఉద్దేశ్యపూర్వకంగా ధర తగ్గించి తమ నోరు కొడుతున్నారని రైతులు తెలిపారు. తహసీల్దార్లు, ఎస్‌ఐలు వచ్చి తమకే నచ్చజెబుతున్నారు తప్ప.. మిల్లర్లు ధాన్యం కొనాలని, రైతులకు న్యాయం చేయాలని ఆదేశించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మిల్లర్లు చెప్పిన ధరకే ధాన్యం విక్రయించుకుని వెళ్తున్నామని తెలిపారు. మిల్లర్ల సిండికేట్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, మిల్లు పాయింట్ల కొనుగోళ్లపై ప్రభుత్వ నియంత్రణ కరువైందని ఆరోపించారు. ప్రధానంగా శని, ఆదివారాల్లో కనీస పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తుతోందన్నారు. ఇకనుంచైనా మిల్లు పాయింట్ల వద్ద ధరల పర్యవేక్షణకు ప్రభుత్వం సిబ్బందిని నియమించాలని కోరారు.
Updated Date - Nov 11 , 2024 | 04:04 AM