రూ.300 కోట్ల ఘరానా మోసం!
ABN , Publish Date - Mar 19 , 2024 | 04:33 AM
‘‘రండి బాబూ రండి..! రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టండి..! అసలుకు అసలు.. వడ్డీకి వడ్డీ..! పెట్టుబడి సులభంగా రెట్టింపవుతుంది..! మీరు మరికొందరిని ఈ స్కీమ్‌లో చేరిస్తే.. కమీషన్ మీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది..!’’ అంటూ మల్టీ లెవెల్ మార్కెటింగ్(ఎంఎల్‌ఎం) తరహాలో ఊదరగొట్టిన జేవీ బిల్డర్స్ అనే
రియల్‌ఎస్టేట్ ముసుగులో పెట్టుబడుల సేకరణ
అధిక లాభాల పేరుతో గొలుసుకట్టు ఉచ్చు
జేవీ బిల్డర్స్ టోకరా.. ఠాణాకు బాధితులు
ఉప్పల్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ‘‘రండి బాబూ రండి..! రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టండి..! అసలుకు అసలు.. వడ్డీకి వడ్డీ..! పెట్టుబడి సులభంగా రెట్టింపవుతుంది..! మీరు మరికొందరిని ఈ స్కీమ్‌లో చేరిస్తే.. కమీషన్ మీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది..!’’ అంటూ మల్టీ లెవెల్ మార్కెటింగ్(ఎంఎల్‌ఎం) తరహాలో ఊదరగొట్టిన జేవీ బిల్డర్స్ అనే సంస్థ అమాయకుల పుట్టి ముంచింది. ఈ సంస్థ మోసం రూ.300 కోట్లకు పైగానే ఉంటుందని ప్రాథమిక అంచనా. సోమవారం రాత్రి భారీ సంఖ్యలో బాధితులు ఉప్పల్ పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌కు చెందిన వేలూరి జ్యోతి, వేలూరి లక్ష్మీనారాయణ.. ఉప్పల్‌లో మూడేళ్ల క్రితం జేవీ బిల్డర్స్ పేరుతో రియల్‌ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. జనగామ, వడ్లకొండ ప్రాంతాల్లో వెంచర్లు వేశామని, పెట్టుబడులు పెడితే.. నెలనెలా వడ్డీ ఇస్తామని, అసలు మొత్తం కూడా వెనక్కి వచ్చేస్తుందని నమ్మబలికారు. ఉప్పల్ గణేశ్ నగర్‌కు చెందిన గంధె రాజు అప్పట్లో రూ.4లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆయన పేరుతో ఒక గుంట భూమిని రిజిస్ట్రేషన్ చేయించి, నెలకు రూ.7వేల చొప్పున లాభాల పేరిట అతని బ్యాంకు ఖాతాలో జమచేశారు. అలా 50నెలలు వడ్డీ పడడంతో.. గణేశ్ మరో రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టారు. మరికొందరిని చేరిస్తే.. కమీషన్లు ఇస్తామని జ్యోతి, లక్ష్మీనారాయణ నమ్మబలకడంతో.. తన బంధుమిత్రుల నుంచి రూ.2.5కోట్ల మేర పెట్టుబడులు పెట్టించారు. ఈ తతంగం గొలుసుకట్టు స్కీమ్ మాదిరిగా మారిపోయింది. 7వేల మందికి పైగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమిక అంచనా. అయితే, పెట్టుబడి పెట్టిన వారి ఖాతాల్లోకి ఈ నెల నగదు జమ కాకపోవడంతో బాధితులు జేవీ డెవలపర్స్ సంస్థకు వెళ్లారు. వారం రోజులుగా ఆ కార్యాలయానికి తాళం ఉండడం.. నిర్వాహకులు ఫోన్లను స్విచాఫ్ చేయడంతో.. తాము మోసపోయినట్లు గుర్తించారు. వంద మంది దాకా బాధితులు సోమవారం రాత్రి ఉప్పల్ ఠాణాకు చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు.