Electric Buses: జనవరిలో మరో50 ఎలక్ట్రిక్ బస్సులు!
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:40 AM
సంక్రాంతి నాటికి గ్రేటర్‌లో మరో 50 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గ్రేటర్‌లో 190 ఈవీ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.
హయత్‌నగర్ డిపో నుంచి నడిపే ఏర్పాట్లు
6 నెలల్లో 300 ఈవీ బస్సులు తీసుకురావాలని ఆర్టీసీ లక్ష్యం
ఇప్పటికే గ్రేటర్‌లో 190 ఈవీ బస్సులు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి నాటికి గ్రేటర్‌లో మరో 50 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గ్రేటర్‌లో 190 ఈవీ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ రెట్టింపయ్యింది. ఈ నేపథ్యంలో ఆర్డినరీ బస్సులపై ఓవర్ లోడ్ పడుతున్న కారణంగా గ్రేటర్‌లో ఎలక్ర్టిక్ బస్సులు పెంచడంపై టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక దృష్టిసారించింది. డిసెంబరులోనే 50 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు రోడ్లపైకి తీసుకురావాలనుకున్నా పలు కారణాలతో ఆలస్యం అయ్యింది. దాంతో జనవరిలో హయత్‌నగర్ డిపో నుంచి 50 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డ్రైవర్లకు రూట్ మ్యాప్‌లు చూపిస్తూ క్షేత్రస్థాయిలో డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నారు. గ్రేటర్‌జోన్ పరిధిలో రాబోయే 6 నెలల్లో 300 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలనే లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2025 డిసెంబర్ నాటికి గ్రేటర్ పరిధిలో మొత్తం 1500 ఎలక్ర్టిక్ బస్సులు రోడ్లపైకి తెచ్చే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకు వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. ఈవీ బస్సులు పెరుగుతున్న క్రమంలో గ్రేటర్‌జోన్ పరిధిలోని 25 బస్ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది.