Sathya Sai Trust: చిన్నారులకు ‘సంజీవని’.. సత్యసాయి ఆస్పత్రి
ABN, Publish Date - Sep 13 , 2024 | 04:41 AM
దేశ, విదేశాల్లో పేద ప్రజలకు విద్య, వైద్య సేవలు అందిస్తున్న సత్యసాయి సేవ సంస్థ తెలంగాణలో తన సేవలను మరింత విస్తరిస్తోంది.
పుట్టుకతో చిన్నారుల్లో వచ్చే గుండె వ్యాధులకు చికిత్స
సిద్దిపేట జిల్లా కొండపాకలో వంద పడకలతో ఏర్పాటు
ఆస్పత్రిని రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
కొండపాక, సెప్టెంబరు 12: దేశ, విదేశాల్లో పేద ప్రజలకు విద్య, వైద్య సేవలు అందిస్తున్న సత్యసాయి సేవ సంస్థ తెలంగాణలో తన సేవలను మరింత విస్తరిస్తోంది. పేదలకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకుగాను సిద్దిపేట జిల్లా కొండపాక శివారు ఆనంద నిలయం సమీపంలో చిన్న పిల్లల గుండె చికిత్స కోసం ఆస్పత్రిని నిర్మించింది. ఐదెకరాల విస్తీర్ణంలో రూ.60 కోట్ల వ్యయంతో సత్య సాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ పేరిట ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దీనిని శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, సద్గురు మధుసూదనసాయి ప్రారంభించనున్నారు.
సత్యసాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో రాయ్‌పూర్, పల్వర్, ముంబైలలో చిన్న పిల్లల గుండె చికిత్స ఆస్పత్రులున్నాయి. కొండపాక శివారులో ఏర్పాటు చేసిన ఆస్పత్రి దేశంలో నాలుగోది కాగా తెలుగు రాష్ట్రాల్లో మొదటిది. వంద పడకలు ఉండేలా ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తయింది. మరో వంద పడకలకు కూడా ఏర్పాటు చేశారు. ఆస్పత్రి సమీపంలో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రోజుకు 10కి పైగా ఆపరేషన్లు చేసేలా సౌకర్యాలను కల్పించారు.
దేశంలో ఎక్కడి వారైనా ఇక్కడ ఆపరేషన్‌ను ఉచితంగా చేయించుకునే అవకాశం ఉంటుంది. విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించేందుకు కృషి చేస్తు న్న సంస్థ కొండపాక శివారులోని ఆనంద నిలయం ట్రస్ట్ ఆవరణలో ఉన్న సుమారు పన్నెండున్నర ఎకరాల విస్తీర్ణంలో సత్యసాయి విద్య సంస్థను ఏర్పాటు చేసింది. ఇక్కడ బాలికలకు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఇక్కడ సంస్థ సేవలు అందిస్తోంది. ఇదే ప్రాంతంలో ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
15రోజుల్లో ఆపరేషన్లు ప్రారంభం: ట్రస్ట్ ప్రతినిధి జగన్నాథ శర్మ
ఆస్పత్రి ప్రారంభమైన తర్వాత 15 రోజుల్లో ఆపరేషన్లు మొదలవుతాయని ట్రస్ట్ ప్రతినిధి జగన్నాథ శర్మ తెలిపారు. దేశంలోని ఎక్కడివారైనా ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స పొందవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో 15 దేశాల నుంచి వచ్చిన వారు చికిత్స పొందారు. 1970లో సత్యసాయి బాబా ప్రారంభించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
Updated Date - Sep 13 , 2024 | 04:41 AM