ఉత్తుత్తి భద్రత!
ABN, Publish Date - Dec 22 , 2024 | 04:34 AM
శాసన మండలిలో భద్రతా లోపం బహిర్గతమైంది. చైర్మన్, సభ్యులు కొలువుదీరిన పెద్దల సభ వద్ద ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది.
మండలిలో పనిచేయని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్.. అలంకార ప్రాయంగా ఫ్రేమ్ ఏర్పాటు
భద్రత గాలి కొదిలేసి సెల్‌ఫోన్లలో నిమగ్నమైన సిబ్బంది.. ఉదయం నుంచి అదే పరిస్థితి
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): శాసన మండలిలో భద్రతా లోపం బహిర్గతమైంది. చైర్మన్, సభ్యులు కొలువుదీరిన పెద్దల సభ వద్ద ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. శనివారం మండలిలో కీలక బిల్లులపై చర్చ జరిగింది. సభలో మంత్రులు, సభ్యులు ఉన్నారు. ఇంతటి కీలకమైన ప్రాంతంలో ఏ మాత్రం పని చేయని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ఒకటి ఉంచారు. మండలి ప్రధాన ద్వారం వద్ద ఉంచిన డోర్ ఫ్రేమ్ నుంచి లోనికి వెళ్లే వారిని తనిఖీ చేసి పంపిస్తారు. ఆ తర్వాత అధికారులు, ఇతర సిబ్బంది వేళ్లే మార్గంలో ఓ ఫ్రేమ్, మీడియా సభ్యులు వెళ్లేందుకు మరో ఫ్రేమ్‌ను సిటీ సెక్యూరిటీ వింగ్(సీఎ్‌సడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే మీడియా ప్రతినిధులు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ఏ మాత్రం పనిచేయలేదు.
ఊరికే పైపులు బిగించి అలంకార ప్రాయంగా ఫ్రేమ్ ఏర్పాటు చేశారు. బాక్స్‌కు ఎలాంటి విద్యుత్ కనెక్షన్ లేదు. బ్యాటరీ చార్జింగ్ లేకపోవడం, అత్యవసరంగా బ్యాటరీలు అమర్చకపోవడంతో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ పనిచేయడం లేదు. ఈ ఫ్రేమ్ ఏర్పాటు చేసి నలుగురు సిబ్బంది పక్కనే కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఏ మాత్రం సంబంధం లేకుండా భద్రతను గాలికొదిలేసి వచ్చి పోయే వారిని గమనించకుండా పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం, సెల్‌ఫోన్లు చూసుకోవడంలో నిమగ్నమయ్యారు. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ఎందుకు పనిచేయడం లేదని అక్కడే ఉన్న భద్రతా సిబ్బందిని ప్రశ్నించగా చార్జింగ్ లేదని సమాధానం ఇవ్వడం కొసమెరుపు. అయితే ఇది ఏ కొద్ది సమయమో కాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పరిస్థితి కనిపించింది.
Updated Date - Dec 22 , 2024 | 04:34 AM