Seethakka: అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదు
ABN, Publish Date - Dec 15 , 2024 | 04:12 AM
సినీ కథానాయకుడు అల్లు అర్జున్ అరెస్టుతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, ఓ మహిళ మృతి కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు.
అల్లు అర్జున్‌పై సర్కారుకు ఎలాంటి ద్వేషం లేదు
చట్టం తన పని తాను చేసుకుపోతుంది: సీతక్క
అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేతే
ఫార్ములా -ఈ స్కామ్‌లో అక్రమాలు తేలితే.. కేటీఆర్‌పైనా చర్యలు : మహేశ్ కుమార్ గౌడ్
ఖానాపూర్/ఉట్నూర్, హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సినీ కథానాయకుడు అల్లు అర్జున్ అరెస్టుతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, ఓ మహిళ మృతి కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. శనివారం నిర్మల్ జిల్లా కడెం మండలంలో పర్యటించిన సందర్భంగా అల్లు అర్జున్ అరెస్టుపై మాట్లాడారు. అల్లు అర్జున్‌పై తమ ప్రభుత్వానికి ఎటువంటి ద్వేషం లేదని, ఆ మాటకొస్తే అల్లు అర్జున్ మామ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బంధువేనని చెప్పారు. సినీ హీరో చిరంజీవి కూడా కాంగ్రెస్ నేపథ్యం ఉన్న వారేనన్నారు. చట్టపరంగా జరిగే అంశాలపై రాద్ధాంతం తగదన్నారు. ఇక చట్టానికి ఎవరూ అతీతులు కాదని, దాని ముందు అందరూ సమానమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.
సంజయ్‌గాంధీ 44వ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో శనివారం ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం విలేకరులతో ఆయన అల్లు అర్జున్ అరెస్టుపై మాట్లాడారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక సామాన్యురాలు ప్రాణాలు కోల్పోయిందని, ఆమె కుమారుడు చావు, బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడని గుర్తు చేశారు. అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడేనని, సీఎం రేవంత్‌రెడ్డికీ.. అల్లు అర్జున్ కుటుంబంతో బంధుత్వం ఉందన్నారు. అయినా చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. తెలుగు చిత్రసీమకు, కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందన్నారు. కాగా.. ఫార్ములా-ఈ రేసింగ్‌లో నిధుల్లో గోల్‌మాల్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారని, ఇందులో కేటీఆర్ అక్రమాలకు పాల్పడినట్లు తెలితే ఆయనపైనా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పైనా ఎందుకు ధ్యాస పెట్టలేదో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత చెప్పాలన్నారు.
Updated Date - Dec 15 , 2024 | 04:12 AM