Hyderabad : అహో.. హన్!
ABN, Publish Date - Oct 23 , 2024 | 03:32 AM
అది సియోల్! ఆ మెట్రోపాలిటన్ నగరం మధ్య నుంచి పారే హన్ నది! అటు నుంచి ఇటుకు ఏకంగా 75 కిలోమీటర్లు! ఒక నగరం మధ్యలో ఇంత పొడవైన నది ప్రపంచంలో ఇక్కడే ఉంది! దీనినే అటు పర్యాటకానికి, ఇటు ఆర్థికాభివృద్ధికి జీవనాడిగా మార్చుకోవాలని దక్షిణ కొరియా భావించింది!
సియోల్ మధ్యలో 75 కిలోమీటర్ల నది
దానిపై తేలియాడే బార్జెస్, హోటళ్లు, మాల్స్
అత్యద్భుత పార్కులు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు
సియోల్ పర్యాటక, ఆర్థికాభివృద్ధికి జీవనాడి
దాని బాటలోనే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు
పేదలకు న్యాయం చేస్తాం: మంత్రి పొంగులేటి
(సియోల్ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి)
అది సియోల్! ఆ మెట్రోపాలిటన్ నగరం మధ్య నుంచి పారే హన్ నది! అటు నుంచి ఇటుకు ఏకంగా 75 కిలోమీటర్లు! ఒక నగరం మధ్యలో ఇంత పొడవైన నది ప్రపంచంలో ఇక్కడే ఉంది! దీనినే అటు పర్యాటకానికి, ఇటు ఆర్థికాభివృద్ధికి జీవనాడిగా మార్చుకోవాలని దక్షిణ కొరియా భావించింది! హన్ నది అభివృద్ధి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది! నదిపై తేలియాడే బార్జెస్ ఏర్పాటు చేసింది. వాటిపై ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, కన్వెన్షన్ కేంద్రాలు నిర్మించింది. నగర ప్రజల ఆనందం, ఆరోగ్యం కోసం అత్యద్భుత పార్కులు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చేసింది. దీనిని అద్భుతమైన నైట్ లైఫ్‌కు కేంద్రంగా మార్చింది. అంతేనా.. నదికి అటూ ఇటూ 75 కిలోమీటర్ల మేర పెద్ద హైవేను అభివృద్ధి చేశారు.
దీనిపై వెళ్తున్న వాహనదారులు 10 నిమిషాల్లోనే నదీ తీరానికి వచ్చేలా రోడ్డు మార్గాలున్నాయి. తద్వారా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ద్ధి వేగంగా జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును రోజుకు సగటున 1.66 లక్షలమంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఇప్పటికే తొలి దశ ప్రాజెక్టులో కొంత మేర అభివృద్ధి జరిగింది. ఆ దేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ 1.7 ట్రిలియన్ డాలర్లు! భవిష్యత్తులో దీనిని రెట్టింపు చేయడమే లక్ష్యంగా దక్షిణ కొరియా ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది.
సియోల్ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, ముఖ్య కార్యదర్శి దానకిషోర్, ఎంఆర్‌డీసీఎల్ డైరక్టర్ పి.గౌతమి తదితరుల బృందం మంగళవారం హన్ నది అభివృద్ధి ప్రాజెక్టును సందర్శించింది. ఇక్కడి అధికారులతో భేటీ అయి వివరాలు తెలుసుకుంది. మంత్రుల బృందం ఇప్పటికే చంగ్ ఏ చంగ్ ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. మూసీ నది నిజాం రాజుల కాలంలో స్వచ్ఛంగానే ఉండేది. దాని చుట్టూ అనేక గొప్ప కట్టడాల నిర్మాణం జరిగింది. చంగ్ ఏ చంగ్ నది కూడా 600 ఏళ్లపాటు ఇక్కడి హంగ్ రాజుల కాలంలో విరాజిల్లింది. ఈ నేపథ్యంలోనే.. పునరుజ్జీవం విషయంలో చంగ్ ఏ చంగ్.. అభివృద్ధి ప్రణాళికలో హన్ నది బాటలోనే హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఉండనుంది.
ప్రాథమిక ప్రణాళిక నాలుగు నెలల్లోనే
హన్ నది అభివృద్ధి ప్రణాళికకు అయ్యే నిధులను పీపీపీ పద్ధతిలో సమకూరుస్తున్నారు. ఇందుకు 549 బిలియన్ల దక్షిణ కొరియా వన్‌లు (రూ.3500 కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో ప్రైవేటు సంస్థల వాటా 313.5 బిలియన్ వన్‌లు. ప్రభుత్వ వాటా 173 బిలియన్ వన్‌లు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కూడా పీపీపీ పద్ధతిలోనే సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో నది ప్రక్షాళన, అభివృద్ధితోపాటు అటూ ఇటూ పెద్ద రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలున్నాయి.
దశలవారీగా...
హన్ నది అభివృద్ధి ప్రాజెక్టును దశలవారీగా చేపట్టారు. తొలి దశలో ఫ్లోటింగ్ హోటళ్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించారు. మలి దశల్లో 12 హ్యాంగింగ్ పార్కులు, మరిన్ని తేలియాడే అద్భుత నిర్మాణాలను చేపట్టనున్నారు. వీటిలో కొన్నింటిని 2026 నాటికి, మిగతా వాటిని 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూసీ నదిని కూడా రెండు దశల్లోనే చేపట్టనున్నారు. ఇక, ఇక్కడ పరిశీలన పూర్తయిన తర్వాత మంత్రులు, అధికారుల బృందం దీనిపై చర్చించింది. మూసీ ప్రాజెక్టు ప్రాథమిక ప్రణాళికను కూడా నాలుగు నెలల్లోనే ఇచ్చేలా ఆ బాధ్యతలు అప్పగించిన సంస్థను అడగాలని నిర్ణయించింది. ఆ తర్వాత సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక (డీపీఆర్)ను రూపొందిస్తారు. దానినిబట్టి దశలవారీగా పనులు చేపడతారు. డీపీఆర్ వచ్చాక తొలి రెండేళ్లలో ప్రతి రెండు, మూడు కిలోమీటర్లకు ఒకటి చొప్పున వంతెనలు, చెక్‌డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైడ్రలాజికల్ అధ్యయనం, స్థానిక భౌగోళిక పరిస్థితులు ఇందులో కీలకం. ఎందుకంటే.. ఎక్కడ ఏ ఎత్తులో చెక్‌డ్యాంలు కట్టాలి? మూసీ అంతటా ఎల్లప్పుడూ నీరుండేలా ఎలా చేయాలన్నది ఈ అధ్యయనాన్ని బట్టే నిర్ణయిస్తారు. మరోవైపు, డీపీఆర్‌లో భూ వినియోగ ప్రణాళిక చాలా కీలకం. ఎక్కడ భూమి అందుబాటులో ఉంది? దానిని ఎలా ఉపయోగించాలి? ఎక్కడెక్కడ నదీతీరాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలి? తదితర అంశాలన్నీ ఈ భూ వినియోగ ప్రణాళికలోనే ఉంటాయి.
మూసీ ప్రక్షాళన నూటికి నూరు శాతం చేస్తాం: పొంగులేటి
మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవ ప్రాజెక్టును నూటికి నూరు శాతం చేస్తామని, అక్కడున్న పేద వారందరికీ న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. చంగ్ ఏ చంగ్ పునరుజ్జీవ ప్రాజెక్టును సందర్శిస్తే.. పిల్ల కాలువను సందర్శిస్తారా? అని ప్రతిపక్షం విమర్శలు చేసిందని, ఇప్పుడు పెద్ద నది హన్‌ను కూడా సందర్శించి అధ్యయనం చేశామని చెప్పారు. ప్రతిపక్షాలు వీలుంటే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సహకరించాలని, లేదంటే పనికొచ్చే సలహాలు కూడా ఇవ్వొచ్చని, కానీ, బురదజల్లే కార్యక్రమం మాత్రం మానుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఏ ఒక్కరికీ నష్టం కలిగించే పని తమ ప్రభుత్వం చేయబోదని, బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అందరినీ ఒప్పించి, మెప్పించి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తెలిపారు. హన్ నది అభివృద్ధి ప్రణాళిక సియోల్‌కు జీవరేఖగా ఎలా మారుతుందన్నది పరిశీలించామని, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కూడా హైదరాబాద్‌కు అన్నిరకాలుగా ఉపకరిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల వల్ల వచ్చే ఫలితాల పట్ల బీఆర్‌ఎస్ నేతలకు భయం పట్టుకుందన్నారు.
వరద నీరు, డ్రైనేజీ నీటికి వేర్వేరు వ్యవస్థలు
సియోల్ నగరంలో వరద నీటి నిర్వహణ, డ్రైనేజీ నీటి నిర్వహణకు వేర్వేరు పైప్‌లైన్ వ్యవస్థలున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇలాంటి వేర్వేరు వ్యవస్థల ఏర్పాటు కోసం రూ.4 వేల కోట్ల అంచనాతో ప్రణాళికను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపించామని ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు. మరోవైపు, గోదావరి నుంచి తీసుకొచ్చే 15 టీఎంసీల నీటిలో 10 టీఎంసీలను ఘన్‌పూర్ దగ్గర శుద్ధి చేసి పశ్చిమ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తారు. 2.5 టీఎంసీలను జంట జలాశయాల్లో నీరు తక్కువ ఉన్నప్పుడు నింపేందుకు ఉపయోగిస్తారు. మరో 2.5 టీఎంసీలను మూసీ నదిలో అన్ని కాలాల్లోనూ నీరుండేలా చేసేందుకు వినియోగిస్తారు.
Updated Date - Oct 23 , 2024 | 03:32 AM