Sangareddy: సోనియా,రాహుల్ ఇచ్చిన మాట తప్పరు
ABN, Publish Date - Dec 10 , 2024 | 04:48 AM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సోనియా, రాహుల్ ఫొటోలతో కటౌట్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దీనికి నిదర్శనం.. వారిచ్చిన 6 హామీలను సీఎం నెరవేరుస్తున్నారు
సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో జగ్గారెడ్డి
78 కిలోల కేకు కట్‌చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
సంగారెడ్డి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సోనియా, రాహుల్ ఫొటోలతో కటౌట్లు ఏర్పాటు చేశారు. 78 కిలోల భారీ కేకును స్వయంగా జగ్గారెడ్డి కట్ చేశారు. తన చేతులతో అందరికీ కేకు తినిపించారు. సోనియాపై పాటలకు పోచమ్మలోళ్లు, పోతరాజులతో కలిసి జగ్గారెడ్డి చిందులేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడారు. ఎన్నికల సమయంలో సోనియా, రాహుల్, ఖర్గే ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్ నెరవేరుస్తున్నారని చెప్పారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, సబ్సిడీ గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదిలో ఉద్యోగాల భర్తీ వంటి వాటిని చేపట్టారని గుర్తుచేశారు.
సీఎంతోపాటు మంత్రులు, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నేతలు తమదైన పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటలను వెనక్కు తీసుకోరని, అందుకు నిదర్శనమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని జగ్గారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రె్‌సకు నష్టం జరుగుతుందని తెలిసినా ఇచ్చిన మాట కోసం రాష్ర్టాన్ని ఇచ్చారని వివరించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, ఇచ్చిన హామీలన్నింటినీ ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. గతంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కానీ ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని పేర్కొన్నారు. దీనికి కారణమైన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం గర్వంగా ఉందన్నారు.
Updated Date - Dec 10 , 2024 | 04:48 AM