Kishan Reddy: దక్షిణ మధ్య రైల్వేలో రూ.33 వేల కోట్లతో అభివృద్ధి పనులు
ABN, Publish Date - Oct 25 , 2024 | 03:50 AM
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.33 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.83 వేల కోట్లతో చేపట్టనున్న 15 ప్రాజెక్టుల ‘ఫైనల్ లొకేషన్ సర్వే’ జరుగుతోందని చెప్పారు.
అమృత్ భారత్‌లో రూ.2,635 కోట్లతో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం
ఎంపీల భేటీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డ్డి
హైదరాబాద్/అడ్డగుట్ట, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.33 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.83 వేల కోట్లతో చేపట్టనున్న 15 ప్రాజెక్టుల ‘ఫైనల్ లొకేషన్ సర్వే’ జరుగుతోందని చెప్పారు. రూ.430 కోట్లతో అభివృద్ధి చేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.720 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తవుతాయన్నారు. గురువారం రైల్ నిలయంలో రైల్వే ఉన్నతాధికారులు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎంపీలతో జరిగిన సమీక్ష సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో, అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. వరంగల్‌లో రూ.650 కోట్లతో రైలు తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తవుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 40 స్టేషన్లను రూ.2,635 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడగించాలని నిర్ణయించామని, పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండానే వచ్చే రెండేళ్లలో ఎంఎంటీఎ్‌సను యాదాద్రి వరకు పొడగిస్తామన్నారు. దీంతో జంట నగరాల నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ఎంఎంటీస్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.800 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 90 శాతం ట్రాక్ విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయన్నారు. గత ఆర్థిక సంవత్సరం జోన్ పరిధిలో 415 కి.మీ. అదనపు ట్రాక్‌ను జోడించినట్టు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ మాట్లాడుతూ తెలంగాణలో గత పదేళ్లలో 67 కొత్త రైళ్లను ప్రవేశపెట్టామన్నారు. వీటిలో 5 వందే భారత్ ఎక్స్‌ప్రె్‌సలు కూడా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 268 రోడ్ అండర్ బ్రిడ్జిలు (ఆర్‌యూబీలు), 40 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ఆర్వోబీలు) నిర్మించామన్నారు.
రైల్వే పనుల్లో జాప్యంపై పలువురు ఎంపీల అసంతృప్తి
ఈ సమావేశంలో ఎంపీలు తమ నియోజకవర్గాల్లో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ప్రధానంగా కొత్త రైల్వే లైన్లు, బ్రిడ్జిల నిర్మాణం, రైళ్లకు అదనపు స్టాపేజీలతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపర్చాలని సూచించారు. కొల్లూరు ఈదులపల్లి సమీపంలో రైల్వే బ్రిడ్జి నిర్మించాలని 2016 నుంచి కోరుతున్నామని మెదక్ ఎంపీ రఘునందన్ తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్‌ను చర్లపల్లి తరహాలో అభివృద్ధి చేయాలన్నారు.
ఘట్‌కేసర్ రైల్వే బ్రిడ్జి ఇంకా పూర్తి కాలేదని, చాలావరకు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. మహుబుబ్‌నగర్ నియోజకవర్గంలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాజ్యసభ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. హండ్రీ ఎక్స్‌ప్రె్‌సను మళ్లీ నడపాలని కోరారు. లోకల్ రైళ్ల వేళలపై దృష్టి పెట్టాలని, ఏ రైలు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఉందని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంలు పెంచాలని ఎంపీ కడియం కావ్య, గరీబ్ రథ్‌తో పాటు ముఖ్యమైన రైళ్లను ఖమ్మంలో ఆపాలని ఎంపీ రఘురాంరెడ్డి కోరారు.
Updated Date - Oct 25 , 2024 | 03:50 AM