హరిహరులకు విశేష పూజలు
ABN , Publish Date - Jan 23 , 2024 | 12:11 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం హరిహరులకు విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.

యాదగిరిగుట్ట, జనవరి 22: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం హరిహరులకు విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. స్వయంభూ పంచలక్ష్మీనారసింహుడికి శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో, అనుబంధ శివాలయంలో కొలువుదీరిన రామలింగేశ్వరుడికి, స్ఫటిక మూర్తులకు శైవాగమ పద్ధతిలో నిత్యవిధి కైంకర్యాలను నిర్వహించారు. ప్రభాతవేళ సుప్రభాతంతో లక్ష్మీనృసింహుడిని మేల్కొలిపిన పూజారులు గర్భాలయంలోని మూలమూర్తులను సువర్ణ ప్రతిష్టా అలంకారమూర్తులను వేదమంత్ర పఠనాలతో పంచామృతాభిషేకం జరిపి తులసీదళాలతో అర్చించారు. అష్టభుజి ప్రాకార మండపంలో లక్ష్మీనృసింహుడిని దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు విశ్వక్సేనుడికి తొలి పూజలతో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండపైన శివాలయంలో పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరుడిని, ముఖమండపంలోని స్ఫటిక మూర్తులను అర్చకులు వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించారు. శివపార్వతుల సహస్రనామ పఠనాలతో బిల్వపత్రార్చనలు నిర్వహించారు. సాయంత్రం వేళ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల అలంకార వెండి జోడు సేవలు, శివాలయంలో శివపార్వతుల ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి తిరువీధుల్లో సేవోత్సవం నిర్వహించారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.23,96,665 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.