Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ జలకళ
ABN, Publish Date - Oct 15 , 2024 | 04:14 AM
శ్రీశైలం ప్రాజెక్టు మళ్లీ జలకళ సంతరించుకుంది. సోమవారం ఈ ప్రాజెక్టుకు 1,20,848 క్యూసెక్కుల వరద రాగా... జలవిద్యుదుత్పత్తి, పోతిరెడ్డిపాడు ద్వారా తరలింపునకు 77,624 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు.
ప్రాజెక్టులోకి 1.20 లక్షల క్యూసెక్కుల వరద
గరిష్ఠ నీటి మట్టానికి అడుగు దూరంలో ‘సాగర్’
రానున్న 4 రోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): శ్రీశైలం ప్రాజెక్టు మళ్లీ జలకళ సంతరించుకుంది. సోమవారం ఈ ప్రాజెక్టుకు 1,20,848 క్యూసెక్కుల వరద రాగా... జలవిద్యుదుత్పత్తి, పోతిరెడ్డిపాడు ద్వారా తరలింపునకు 77,624 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81టీఎంసీలు కాగా... ప్రస్తుతం 200టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌కు 65వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... రెండువైపులా ఉన్న కాల్వల ద్వారా, ప్రధాన కేంద్రంలో జలవిద్యుదుత్పత్తితో 40 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఈ జలాశయం గరిష్ఠ నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589 అడుగుల మేర నీరు ఉంది. ఇక పులిచింతలకు 31 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 36 వేలను దిగువకు వదిలిపెట్టారు.
గోదావరి బేసిన్ పరిధిలో శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు సోమవారం 9వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 80టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. కృష్ణాతో పాటు గోదావరి బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల వద్ద జలవిద్యుత్ ఉత్పాదన 3362 మిలియన్ యూనిట్లు దాటింది. తెలంగాణలో పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 19 వరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడేం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Updated Date - Oct 15 , 2024 | 04:14 AM