Srisailam: నిండుతున్న శ్రీశైలం!
ABN, Publish Date - Sep 29 , 2024 | 03:32 AM
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా సాగు, జలవిద్యుత్ అవసరాలకు అడ్డదిడ్డంగా నీటిని ఇరు రాష్ట్రాలు తరలించడంతో రిజర్వాయర్‌లో నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి.
84.61 %కి చేరిన నీటి నిల్వ
జూరాలకు 1.33 లక్షల క్యూసెక్కుల రాక
శ్రీపాద ఎల్లంపల్లికి 1.29 లక్షల ఇన్‌ఫ్లో
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా సాగు, జలవిద్యుత్ అవసరాలకు అడ్డదిడ్డంగా నీటిని ఇరు రాష్ట్రాలు తరలించడంతో రిజర్వాయర్‌లో నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. నాలుగు రోజులుగా ఎగువ నుంచి వరద క్రమంగా పెరుగుతుండటంతో జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 182.6 టీఎంసీలకు(84.61 శాతం) చేరింది. శనివారం జలాశయానికి 1.62 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరగా... జల విద్యుదుత్పాదనతో పాటు పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా 44వేల క్యూసెక్కులను వదిలిపెట్టారు.
ఇక, నాగార్జున సాగర్‌కు 43వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... వచ్చింది వ చ్చినట్లే జలవిద్యుత్ చేసి, దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 26వేలను దిగువకు వదిలిపెట్టారు. ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 42వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా...దిగువకు 40వేలను వదిలిపెట్టారు. నారాయణపూర్ జలాశయానికి 43వేల క్యూసెక్కులు వస్తుండగా...ఔట్‌ఫ్లో 42వేలుగా ఉంది. జూరాల జలాశయానికి 1.33లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా... 1.38 లక్షల ఔట్‌ఫ్లో రికార్డయింది. తుంగభద్ర జలాశయానికి 22 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 14వేలను దిగువకు వదిలిపెట్టారు. ఇక, గోదావరి బేసిన్‌లోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1.29లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 1.32లక్షలను దిగువకు వదిలిపెట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 56వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... ఔట్‌ఫ్లో కూడా అంతే ఉంది.
Updated Date - Sep 29 , 2024 | 03:32 AM