ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG: అక్టోబరులో పంచాయతీ ఎన్నికలు..

ABN, Publish Date - Jun 01 , 2024 | 03:51 AM

పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు బీసీ రిజర్వేషన్ల అంశం తేలాకే ఈ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో సర్కారు ఉన్నట్లు తెలిసింది.

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా అప్పుడే.. రుణమాఫీ పూర్తయ్యాకే నిర్వహించే అవకాశం

  • అప్పటికి బీసీ రిజర్వేషన్లూ కొలిక్కి తెచ్చే కసరత్తు

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు బీసీ రిజర్వేషన్ల అంశం తేలాకే ఈ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో సర్కారు ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జూన్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, బీసీ రిజర్వేషన్ల విషయం తేలకపోవడం, కులగణనకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో తర్జన భర్జన పడుతోంది. కులగణన వివరాల ప్రకారం కాకుండా.. కేవలం ఓటరు జాబితాలో పేర్కొన్న కులాల వారీగా రిజర్వేషన్లను లెక్కగట్టి ఎన్నికలకు వెళ్తే.. కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మరోవైపు ఆగష్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రుణమాఫీ పూర్తయితే ప్రజల్లో సానుకూలత పెరుగుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అప్పటిలోగా కులగణనపైనా స్పష్టత వస్తుందని, అక్టోబరులో ఎన్నికలను నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.


రిజర్వేషన్ల ఖరారుపై సమాలోచన

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం ఆయా రాష్ట్రాలు వాటి విచక్షణ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలను జరుపుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీ జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్‌ కొన్నేళ్లుగా ఉంది. అయితే, రిజర్వేషన్లు 50శాతం కంటే మించకూడదని గతంలో సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. దీంతో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధ విధానంలో జనాభా దామాషా ప్రకారం పోగా.. మిగిలింది బీసీలకు కేటాయించాల్సి రావడమే సమస్యగా పరిణమించింది. ఈ విధానం కోసమైతే ఓటరు జాబితాను పరిశీలించి, వివరాలు సేకరిస్తే రిజర్వేషన్లను నిర్ణయించవచ్చు. అయితే, అప్పుడు తమకు రిజర్వేషన్‌ తగ్గిందనే అంశంపై బీసీలు సహా ఎవరైనా కోర్టుకు వెళ్తే మొత్తం ఎన్నికలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గించింది.


ఇదే విధానంలో 2019లో స్థానిక ఎన్నికలను నిర్వహించింది. అప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్లడంతో.. ఆ ప్రభుత్వాన్ని కోర్టు ఈ విధానంలో ఎందుకు వెళ్లారంటూ మందలించింది. ఈ ఒక్కసారికి అనుమతించాలని, తరువాత నిర్వహించబోయే ఎన్నికలకు రిజర్వేషన్లను తేల్చి, దాని ప్రకారమే నిర్వహిస్తామని గత ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. కానీ, ఆతర్వాత ఇందుకు అవసరమైన చర్యలను తీసుకోకపోవడం ప్రస్తుత ప్రభుత్వానికి సమస్యగా మారింది. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖరారు చేయాల్సిన బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన వకుళాభరణం కృష్ణమోహన్‌ నేతృత్వంలోని పూర్తిస్థాయి డెడికేటెడ్‌ కమిషన్‌ (బీసీ కమిషన్‌) కృషి చేస్తోంది. కుల సంఘాలతో పాటు, నిపుణులు, ప్రొఫెసర్లతో వరుస సమావేశాలను జరుపుతోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగియగానే ఇందుకు సంబంధించిన పలు అంశాలను సీఎంతోనూ చర్చించి, ఒక నివేదికను సిద్ధం చేయనున్నట్టు సమాచారం. కాగా, ఆగస్టులో ప్రస్తుత బీసీ కమిషన్‌ పదవీకాలం ముగియనుంది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కమిషన్‌నే కొనసాగిస్తుందా, లేక కొత్త కమిషన్‌ను నియమిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.


ఒకే సారి నిర్వహిస్తే..

సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మూడు దఫాల్లో నిర్వహిస్తే.. మూడుసార్లు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో గత ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక ఎన్నిక జరుగుతుండగా.. నెలలపాటు కోడ్‌ అమల్లో ఉంది. దీంతో ప్రభుత్వ పనులు ఆలస్యమవడంతో పాటు, సామాన్య జనానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకూడదంటే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకే సారి నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మూడు ఎన్నికలకు రిజర్వేషన్ల అంశం ముడిపడి ఉన్నాయని, జూన్‌ నుంచి ఆగస్టు వరకు సమయం ఉంటే ఈ అంశాన్ని తేల్చేసే అవకాశం ఉంటుందని సర్కారు భావిస్తోంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచనలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తే.. సెప్టెంబరు లేదా అక్టోబరులో మూడు ఎన్నికలతో గ్రామీణ ప్రాంతాల్లో తీన్‌ మార్‌ మోగనుంది.

Updated Date - Jun 01 , 2024 | 03:51 AM

Advertising
Advertising