Gulf Workers: గల్ఫ్ కార్మికులకు త్వరలో సంక్షేమ బోర్డు
ABN, Publish Date - Sep 15 , 2024 | 03:52 AM
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి.
హైదరాబాద్‌లో ప్రవాసీ ప్రజావాణి
ప్రతి జిల్లాకు ఓ ప్రవాసీ సెంటర్
మరణించిన గల్ఫ్ కార్మికుల
కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
గల్ఫ్ ప్రభావిత నియోజకవర్గ
ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. గల్ఫ్ ప్రభావిత నియోజక వర్గాల ప్రజాప్రతినిధులు ఈ బోర్డులో భాగస్వాములుగా ఉండనున్నారు. బోర్డు ఏర్పాటు, దాని విధివిధానాలపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై చర్చించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజక వర్గాల ప్రజాప్రతినిధులు, పీసీసీ ఎన్నారై సెల్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ప్రజావాణిలో గల్ఫ్ బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఈ నెల 20 నుంచి ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కార్మికులు, వారి కుటుంబ సంక్షేమం కోసం జిల్లాకొక ప్రవాసీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సెట్విన్, న్యాక్ లాంటి సంస్థలతో వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తామని తెలిపారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో సీట్లు కేటాయిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి (డిసెంబరు 7, 2024) తర్వాత గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామన్నారు. అంతకుముందు మరణించిన వాళ్ల కుటుంబాలకూ మానవతా దృక్పధంతో రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామన్నారు. రైతు బీమా తరహాలో గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బీమా ఉండాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. గల్ఫ్‌లో ఎవరైనా చనిపోతే భౌతిక కాయాన్ని తీసుకురావడానికి వారాల తరబడి సమయం పడుతుందనీ, 48 గంటల్లోగా వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Updated Date - Sep 15 , 2024 | 03:52 AM