Medical Colleges: ఆ 4 వైద్య కాలేజీలకు అనుమతులివ్వండి
ABN, Publish Date - Aug 20 , 2024 | 04:29 AM
వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మరో నాలుగు కొత్త మెడికల్ కాలేజీల అనుమతుల కోసం డీఎంఈ అధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు.
నేడు ఎన్‌ఎంసీని కోరనున్న అధికారులు
అనుమతులు రాకుంటే ఈ ఏడాది వైద్య సీట్ల భర్తీ లేనట్లే!
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మరో నాలుగు కొత్త మెడికల్ కాలేజీల అనుమతుల కోసం డీఎంఈ అధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూలైలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలకు ఏర్పాటు చేసింది. వీటి అనుమతుల కోసం జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ)కి దరఖాస్తుచేయగా.. వాటిలో దేనికి అనుమతులు రాలేదు.
దాంతో లోటుపాట్లను సవరించుకున్నాక నాలుగింటికి అనుమతులొచ్చాయి. కుత్బుల్లాపూర్, మహేశ్వరం, మెదక్, యాదాద్రి భువనగిరి కళాశాలలకు ఎన్‌ఎంసీ నో చెప్పింది. అనుమతులు రాని కాలేజీల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అప్పీల్ చేసుకుంది. ఆ అప్పీల్‌కు రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నెల 21న అప్పీల్‌కు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఎన్‌ఎంసీ నాలుగు రోజుల క్రితం హెల్త్‌సెక్రటరీకి సమాచారం పంపింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం ఎన్‌ఎంసీ అధికారులతో సమావేశం కానున్నారు. అనుమతులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం తర్వాత కూడా ఎన్‌ఎంసీ అనుమతులివ్వకుంటే ఇక ఈ ఏడాదికి ఆ నాలుగు కాలేజీలకు అనుమతులు రానట్లేనని అధికారులు చెబుతున్నారు.
Updated Date - Aug 20 , 2024 | 04:29 AM