శునకాల కళేబరాలు తొలగించారు బతికున్న వాటికి ఆహారం పెట్టారు
ABN, Publish Date - Nov 09 , 2024 | 03:30 AM
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసేందుకు తెచ్చిన వీధి శునకాలు మృత్యువాత పడిన ఘటనపై అధికార యంత్రాంగం కదిలింది. మంచిర్యాల పశు సంరక్షణ కేంద్రంలో చనిపోయిన వీధి శునకాల కళేబరాలను సిబ్బంది శుక్రవారం తొలగించారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదిలిన మంచిర్యాల యంత్రాంగం
ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు
మంచిర్యాల, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసేందుకు తెచ్చిన వీధి శునకాలు మృత్యువాత పడిన ఘటనపై అధికార యంత్రాంగం కదిలింది. మంచిర్యాల పశు సంరక్షణ కేంద్రంలో చనిపోయిన వీధి శునకాల కళేబరాలను సిబ్బంది శుక్రవారం తొలగించారు. అలాగే, ప్రాణాలతో ఉన్న శునకాలకు ఆహారం అందించారు. పది రోజులుగా ఆహారం లేక మంచిర్యాల పశుసంరక్షణ కేంద్రంలో వీధి కుక్కలు మృత్యువాత పడిన ఘటనపై ‘ఈ పాపం ఎవరిది’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పశు సంరక్షణ కేంద్రానికి చేరుకున్న మునిసిపల్ కమిషన్ మారుతీ ప్రసాద్.. డాగ్ క్యాచర్లతో శునకాల కళేబరాలను బయటకు తీయించి ఖననం చేయించారు. అలాగే, ఆ గదిని శుభ్రం చేయించి ప్రాణాలతో ఉన్న శునకాలకు ఆహారం పెట్టించారు. కాగా, వీధి శునకాల మృత్యువాతపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి మాజీ హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. అధికారుల అలసత్వం మూగజీవుల మౌనరోదనకు కారణమైందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Updated Date - Nov 09 , 2024 | 03:30 AM