ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా కోర్టుల వరకూ తెలుగు భాష!

ABN, Publish Date - Nov 25 , 2024 | 03:18 AM

‘‘జిల్లా స్థాయి కోర్టు వరకు తెలుగును వాడుక భాషగా ప్రవేశపెడితే.. మనుగడలోకి వస్తుంది. జాతీయ న్యాయ కళాశాలల్లోని విద్యార్థులకు తెలుగు నేర్చుకోవాలని, జిల్లా కోర్టులో తెలుగులో వాదించాలని చెబుతున్నాం.

  • వాడుక భాషగా ప్రవేశపెడితే మనుగడ

  • తల్లి ప్రేమ.. ఆమె ఉన్నప్పుడు తెలియదు

  • భాషను కోల్పోయినప్పుడూ అంతే..

  • మనకంటే ప్రవాసీల తెలుగు మెరుగు

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నర్సింహ వాడుక భాషగా ప్రవేశపెడితే మనుగడ

హైదరాబాద్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘జిల్లా స్థాయి కోర్టు వరకు తెలుగును వాడుక భాషగా ప్రవేశపెడితే.. మనుగడలోకి వస్తుంది. జాతీయ న్యాయ కళాశాలల్లోని విద్యార్థులకు తెలుగు నేర్చుకోవాలని, జిల్లా కోర్టులో తెలుగులో వాదించాలని చెబుతున్నాం. ఒక్కసారి భాష వాడుకలోకి వస్తే అది మళ్లీ మన జీవితంలోకి ప్రవేశిస్తుంది’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నర్సింహ అన్నారు. భాషను కోల్పోయిన నాడు మనం సర్వం కోల్పోయినట్లేనని.. ఇలాంటి భయం ఉన్నవాళ్లు మళ్లీ దాన్ని జీవన గమనంలోకి తీసుకొస్తారని పేర్కొన్నారు. తాలూకా స్థాయి కోర్టుల్లో ఏర్పాటు చేసిన 31 ఈ-సేవ కేంద్రాలు, న్యాయాధికారులకు నిత్య జీవితంలో ఉపయోగపడే కృత్రిమ మేధ (ఏఐ) టూల్‌ సర్వీసులను ఆదివారం సికింద్రాబాద్‌లోని జ్యుడీషియల్‌ అకాడమీలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధేతో కలిసి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలామంది ప్రవాసు తెలుగువారు మన కంటే మంచి తెలుగు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.


కానీ, మనం మాత్రం చాలా తేలికగా తీసుకుంటూ నిర్లక్ష్యం చేస్తున్నామని అన్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడే తెలుగును సరళత్వం, కచ్చితత్వం వల్ల సులభంగా వాడుకలో ఉంచే అవకాశం ఏర్పడుతుంది. వాడుక లేకనే భాషను కోల్పోతున్నాం. భాష వాడుకను డబ్బు సంపాదనతో ముడిపెడుతున్నాం. తెలుగు నేర్చుకుని చేసేది ఏముంది? వృత్తిలో వచ్చినట్లు డబ్బు రాదు కదా? అనే ఆలోచనలో ఉండడంతో భాష కనుమరుగవుతోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మనం ఏమిటి అనేది మనం మాట్లాడే భాష ద్వారా నిర్ధారణ అవుతుంది. మన సంస్కృతి, ఆలోచనా విధానం, భావ స్వేచ్ఛ, జీవితంలో ముఖ్య లక్షణాలన్నీ భాషతోనే అనుసంధానమై ఉంటాయి. కన్న తల్లి ప్రేమ విలువ ఆమె ఉన్నప్పుడు తెలియదు. భాషను కోల్పోయినప్పుడు కూడా అంతే. భాషను రక్షించుకోవడం అంటే దానిని ఉపయోగించడమే అని తెలుసుకుంటాం’’ జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నర్సింహ తెలిపారు. భాష ఉపయోగాలు నమ్మశక్యం కానివని.. న్యాయ వ్యవస్థలో స్థానిక ప్రజలను అనుసంధానించేది కాబట్టి దానికి ప్రాధాన్యం ఉంటుందని వివరించారు.


  • వచనం.. సారాంశం.. అనువాదం..

కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్‌ ‘శ్రుతి, సారాంశ్‌, పాణిని’లను జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నర్సింహ ప్రారంభించారు. శృతి.. ప్రసంగాన్ని వచనం(టెక్ట్స్‌)గా మార్చుతుందని, సారాంశ్‌ కీలక తీర్పుల సారాంశాన్ని వెల్లడిస్తుందని, పాణిని తెలుగులోకి అనువాదం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ-సేవ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఇల్లందు, వేములవాడ తదితర తాలూకాల పేర్లను విన్నప్పడు తాను అక్కడ వాదించిన కేసులు, స్మృతులు గుర్తుకొచ్చాయని పేర్కొన్నారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే మాట్లాడుతూ.. ఈ-సేవ కేంద్రాలు సాధారణ ప్రజల, న్యాయ వ్యవస్థ మధ్య దూరాన్ని తగ్గిస్తాయని తెలిపారు. జిల్లా కోర్టుల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన కేంద్రాలకు ఇవి అదనమని చెప్పారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులందరూ పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 03:18 AM