Telugu States: గాడిదలు కొనిపించి.. కోట్లు గుంజేశాడు
ABN, Publish Date - Oct 29 , 2024 | 04:04 AM
గాడిదల పెంపకంతో భారీ లాభాలుంటాయని, వాటి పాలను తానే కొనుగోలు చేస్తానంటూ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలకు మోసం చేశాడు.
భారీ ఆదాయం వస్తుందని ఆశపెట్టి తమిళనాడు వ్యక్తి కుచ్చుటోపీ
ఏపీ, తెలంగాణలో కోట్లు వసూలు
రెండు రాష్ట్రాల్లో 350 మంది బాధితులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): గాడిదల పెంపకంతో భారీ లాభాలుంటాయని, వాటి పాలను తానే కొనుగోలు చేస్తానంటూ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలకు మోసం చేశాడు. తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తిరునల్వేలి జిల్లా ముక్కుడల్‌లో డాంకీ ఫారమ్ పెట్టాడు. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ, లీటరు గాడిద పాలను రూ.1600 నుంచి రూ.1800కు కొంటానంటూ ఎర వేశాడు. తన యూట్యూబ్ చానల్ వీక్షకులకు ఫోన్లు చేసి మేలుజాతి గాడిదలు కొనుగోలు చేస్తే మంచి లాభాలు వస్తాయని గేలం వేశాడు. 2022, 2023లో విల్లుపురంలో డాంకీ సెమినార్లు పెట్టాడు. జాతి ఆధారంగా ఒక్కో గాడిదకు కనీస ధర 90 వేలు, మేలు రకమైతే లక్షన్నర వరకూ తీసుకుని విక్రయించాడు.
గాడిద పాలు గంటకు మించి నిల్వ ఉండవని, సేకరించేందుకు 24 గంటలకు పైగా పడుతుందని చెప్పి హై కెపాసిటీ ఫ్రీజర్లు కొనాలంటూ 75 వేల నుంచి లక్షన్నర వరకూ వసూలు చేశాడు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పదుల సంఖ్యలో తమిళనాడు వ్యక్తి వలలో పడ్డారు. మొదట్లో లీటరుకు 1600 నుంచి 1800 చెల్లించాడు. ఏపీతో పాటు తెలంగాణకూ ఈ వ్యాపారం పాకింది. దీంతో ఫ్రాంచైజీలు ఇస్తానంటూ ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షల చొప్పున తీసుకున్నాడు. ఇలా రెండు రాష్ట్రాల్లో సుమారు 350 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ధనికుల పిల్లలు ఫ్రాంచైజీలు తీసుకుని, గాడిదలు కొని పాల విక్రయాలు ప్రారంభించారు.
ఆ తర్వాతే అసలు కథ ప్రారంభమైంది. పాలను సేకరించిన తమిళనాడు వ్యక్తి తనకు పైనుంచి బిల్లులు రాలేదంటూ వారికి పెండింగ్ పెట్టాడు. పాల నిల్వలు పెరిగి పోవడంతో ఫ్రాంచైజీలు తీసుకున్నవారు ఫోన్లు చేస్తున్నా ఎత్తకుండా ముఖం చాటేశాడు. కొత్త నంబర్‌తో ఫోను చేస్తే ‘నేనూ నష్టపోయా.. నాతో అగ్రిమెంటు చేసుకున్న ఫార్మా పరిశ్రమ పాలు కొనట్లేదు’ అంటూ బాంబు పేల్చాడు. మోసపోయామని గుర్తించినవారు గాడిదలను మేపలేక, పనోళ్లకు జీతాలు ఇవ్వలేక వాటిని రోడ్డుపైకి వదిలేయడంతో ఎటో వెళ్లిపోయాయి. హై కెపాసిటీ ఫ్రీజర్లకు కరెంటు బిల్లులు ఎలా చెల్లించాలో దిక్కు తెలియక కొందరు వందల లీటర్ల పాలు పారబోశారు. ఏపీలో ఇప్పటి వరకూ 46 మంది బాధితులకు సుమారు 9 కోట్లు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - Oct 29 , 2024 | 04:04 AM