Heavy Rain: వణికించిన చినుకు..
ABN, Publish Date - Sep 01 , 2024 | 03:51 AM
తెలంగాణపై మబ్బు దుప్పటి కమ్ముకుంది. శనివారం పొద్దున మొదలైన వర్షం రాత్రి అయినా ఆగలేదు! బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల జల్లులుగా..
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం
నీట మునిగిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలు
ఉప్పొంగిన వాగులు... దిగ్బంధంలో పల్లెలు
వర్షాలకు ముగ్గురి మృతి.. వాగులో ఒకరి గల్లంతు
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 21.2 సెం.మీ..
నారాయణపేట జిల్లా మరికల్‌లో 13.8 సెం.మీ
కోదాడలో వరద బీభత్సం.. విద్యుత్తు నిలిపివేత
హైదరాబాద్-విజయవాడ రోడ్డుపై ట్రాఫిక్ జాం
నేడు, రేపు వర్షాలే.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
హైదరాబాద్‌లో సోమవారం బడులకు సెలవు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): తెలంగాణపై మబ్బు దుప్పటి కమ్ముకుంది. శనివారం పొద్దున మొదలైన వర్షం రాత్రి అయినా ఆగలేదు! బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల జల్లులుగా.. ఇంకొన్ని చోట్ల భారీగా.. మరికొన్ని చోట్ల అతిభారీగా వర్షం పడింది! రాజధాని హైదరాబాద్ సహా పలుచోట్ల జనజీవనం స్తంభించింది. పట్టణాలు, నగరాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమై ఇళ్లలోకి వరద పోటెత్తింది. పల్లెల్లో వరి పొలాలు, పత్తి, మొక్కజొన్న, కంది చేలు నీటమునిగాయి. రైతులు, వ్యవసాయ కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే నిండిన చెరువులు, కుంటలు అలుగు పోస్తుంటే.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఫలితంగా చాలాచోట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి రోడ్లు దెబ్బతిన్నాయి. అక్కడక్కడా పాత ఇళ్లు కూలిపోయాయి. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. ఒకరు గాయపడ్డారు. మరొకరు వరద నీటిలో గల్లంతయ్యారు! ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో 21.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా మరికల్‌లో 13.8 సెం.మీ, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 10.3 సెం.మీ, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 9.48 సెం.మీ, కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో 9.37 సెం.మీ, నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో 8.5 సెం.మీ, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 7.8 సెం.మీ, వికారాబాద్ జిల్లా చౌదాపూర్‌లో 7 సెం.మీ వర్షపాతం నమోదైంది. సింగరేణిలో భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. హైదరాబాద్‌లో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జాం నెలకొంది. వర్షాల కారణంగా హైదరాబాద్ పరిధిలోని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఇతర జిల్లాల్లో పరిస్థితులను బట్టి డీఈవోలు సెలవు ప్రకటించవచ్చునని ఆదేశాలు వెళ్లాయి.
ఖమ్మంలో భారీ వర్షం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. వందల ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలాన్ని వరద చుట్టుముట్టింది. మండలంలోని మొలుగుమాడు వద్ద ఏరు పొంగిపొర్లుతోంది. అక్కడ వాగు దాటే ప్రయత్నంలో వరద ఉధృతికి ఓ ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ట్రాక్టర్ నుంచి పడిపోయి.. నీళ్లలో చిక్కుకున్న ముగ్గురిని స్థానికులు తాళ్ల సాయంతో బయటకు తీశారు. మండలంలోని నర్సింహాపురం వద్ద వాగు పొంగడంతో బైక్‌పై వెళుతున్న యువకుడు వాగులో జారిపడ్డాడు. అతడిని గ్రామస్థులు రక్షించారు.
మధిర మండలం వంగవీడు చెరువు ప్రాంతంలో తోటపల్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చేపల చెరువులో వల సరిచేసేందుకు వెళ్లి వరదలో చిక్కుకొని సమీపంలోని ఓ చెట్టెక్కాడు. ఇదే మండలంలోని క్రిష్ణాపురం పాలవాగు సమీపంలోని రోడ్డుపై ప్రవహిస్తున్న వాగు నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. మామునూరు వద్ద వాగును దాటే ప్రయత్నంలో ముగ్గురు చిక్కుకుపోయారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో మద్దెలచెరువు వద్ద భారీ వృక్షం నేలకూలడంతో బిచ్కుంద, పిట్లం, బాన్సువాడకు గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి.
వికారాబాద్ జిల్లాలో దేవరాంపల్లి, తాళ్లపల్లి, ఫతేపూర్, వెంకటాపూర్ సహా తదితర చోట్ల వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతంలో జనసంచారాన్ని కట్టడి చేసేందుకు పోలీసు సిబ్బందిని మోహరించారు. బషీరాబాద్‌లో జెడ్పీ ఉన్నత పాఠశాలలో వర్షపునీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. వికారాబాద్ మండలం రాళ్లచిట్టంపల్లి గ్రామంలో పత్తి, కంది చేలల్లో వర్షపునీరు నిలిచింది. నల్లగొండ నేరేడుచెర్ల ప్రభుత్వ కాలేజీలోకి, చండూరులోని జెడ్పీ హైస్కూల్‌ను వరద నీరు చుట్టుముట్టింది. మహబూబాబాద్ జిల్లా గార్లలో పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మద్దివంచ, రాంపురం సహా 11 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూరు మండలం మల్లేపల్లి వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. కారును, వాహనంలోని వారిని స్థానికులు బయటకు తీశారు.
ముగ్గురి మృతి
కామారెడ్డి జిల్లా ననురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో పిడుగుపడి విద్యుత్తు వైర్లు తెగిపడ్డాయి. ఆ వైర్లను స్వాతి (18) అనే యువతి తాకడంతో విద్యుదాఘాతంతో మృతిచెందింది. జిల్లాలోని బొప్పన్‌పల్లిలో పిడుగుపాటుకు కేమ్యా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా నక్కలవాగులో భవానీపురానికి చెందిన మలిశెట్టి సాంబశివరావు అనే యువకుడు వాగులో పడి గల్లంతయ్యాడు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్‌లో పిడుగుపాటుకు మహేశ్ (30) అనే పశువుల కాపరి ప్రాణాలు కోల్పోయాడు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం తాటిపాములలో ఇంటి పైకప్పు కూలి వడ్డె చంద్రయ్య (55) అనే వ్యక్తి మృతిచెందాడు.
కోదాడ జలమయం
శనివారం రాత్రి 8గంటల నుంచి భారీ వర్షం పడటంతో సూర్యాపేట జిల్లా కోదాడ జలమయమైంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు.. ఖమ్మం నుంచి కోదాడ, సూర్యాపేట నుంచి కోదాడకు వచ్చే వాహనాలు భారీ వరదకు రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనాలు ముందుకు కదలక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. పట్టణంలోని శ్రీరంగాపురం వద్ద డివైడర్ నుంచి వరద పోటెత్తుతోంది. కాలనీల్లోని ఇళ్లలోకి భారీగా వరద చేరింది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పట్టణమంతా అంధకారం అలుముకుంది. ఇళ్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దంటూ పోలీసులు సూచించారు.
అలర్ట్.. అలర్ట్
రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆది, సోమవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ జిల్లాలకు అరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి , మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబరు 3 వరకు రాష్ట్రానికి యెల్లో అలెర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా మారి వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. కాగా మరో 2-3 రోజుల పాటు వర్షాలు పడితే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
బొగత.. నిలిపివేత
ములుగు జిల్లాలోని బొగత, లక్నవరం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని.. ఈ రెండు చోట్ల, అలాగే రామప్ప సందర్శనను కూడా 48గంటలపాటు నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేంతవరకు పర్యాటకులు రావొద్దని. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. సమక్క-సారలమ్మ దర్శనం కోసం మేడారం వచ్చే భక్తులు కూడా తమ ప్రయాణాన్ని ఒకరోజు వాయిదా వేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పెట్టే వరకూ బొగత సందర్శనను నిలిపివేస్తున్నట్లు ఎఫ్‌ఆర్‌వో రాజమౌళి చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కొమ్మలవంచ అటవీ ప్రాంతంలో భీమునిపాదం జలపాతం సందర్శకులను కునువిందు చేస్తోంది.
Updated Date - Sep 01 , 2024 | 03:51 AM