Hyderabad: డ్రగ్స్ కేసు.. వీఐపీలతో లింకులు..!
ABN, Publish Date - Aug 01 , 2024 | 04:37 AM
తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్) పోలీసులు ఇటీవల ఛేదించిన నైజీరియా డ్రగ్స్ ముఠా కేసులో తవ్విన కొద్దీ విస్తుబోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రకుల్ తమ్ముడికి, పాజిటివ్ వచ్చిన మరో 9 మందికి వీఐపీలతో పరిచయాలు
వాట్సాప్ చాటింగ్‌ల ద్వారా విశ్లేషణ
స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్న టీజీ న్యాబ్
హైదరాబాద్ సిటీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్) పోలీసులు ఇటీవల ఛేదించిన నైజీరియా డ్రగ్స్ ముఠా కేసులో తవ్విన కొద్దీ విస్తుబోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు నైజీరియన్లు సహా ఐదుగురు డ్రగ్స్ పెడ్లర్లను అరెస్టు పోలీసులు.. వారి నుంచి రూ.35 లక్షల విలువ చేసే 199 గ్రాము ల కొకైన్‌ను సీజ్ చేసిన విషయం తెలిసిందే..! ఈ ముఠాను పట్టుకునే సమయంలో సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్‌సింగ్, మరో 12 మంది డ్రగ్స్ వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. అమన్ సహా 10 మందికి పాజిటివ్ ఫలితం వచ్చింది.
తదుపరి దర్యాప్తులో భాగంగా పెడ్లర్లు అల్లం సత్యవెంకట గౌతమ్, సానబోయిన వరుణ్‌కుమార్, మహమ్మద్ మహబూబ్ షరీఫ్, వినియోగదారులు-- రకుల్ సోదరుడు, మరో తొమ్మిది మంది మొబైల్ ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌పై టీజీ న్యాబ్ పోలీసులు దృష్టి సారించారు. వీటిని విశ్లేషించిన పోలీసులు.. వీరికి వీఐపీలు, సినీ ఇండస్ట్రీకి చెందినవారు, బడా వ్యాపారుల పిల్లలతో లింకులున్నట్లు గుర్తించారు. వీఐపీలకు డ్రగ్స్‌తో సంబంధాలున్నాయా? అనే కోణంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ లింకుల తీగను కదిపితే.. డ్రగ్స్ నెట్‌వర్క్ డొంక కదులుతుందని టీజీ న్యాబ్ పోలీసులు భావిస్తున్నారు.
Updated Date - Aug 01 , 2024 | 04:37 AM