ERC: ఈఆర్సీ హడావుడి..
ABN, Publish Date - Oct 21 , 2024 | 04:10 AM
పదవీకాలం ముగింపునకు సరిగ్గా 10 రోజుల ముందు.. అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సిద్ధమైంది.
దిగిపోతూ కీలక నిర్ణయాలు!
విద్యుత్ సంస్థల 9 పిటిషన్లపై నేటి నుంచి 25 వరకు కీలక విచారణలు
హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): పదవీకాలం ముగింపునకు సరిగ్గా 10 రోజుల ముందు.. అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సిద్ధమైంది. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్య ఐదేళ్ల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. అయితే.. రాష్ట్ర ప్రజలపై భారం పడేలా తెలంగాణ విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన మొత్తం 9 పిటిషన్లపై.. ఆలోగానే ఈఆర్సీ కీలక నిర్ణయాలను తీసుకోబోతోంది.
నిజానికి ఈ పిటిషన్లను విద్యుత్ సంస్థలు నిరుడు నవంబరులోగా వేయాల్సి ఉండగా.. నిర్దేశిత గడువుకి చాలా ఆలస్యంగా గత నెలలో వేశాయి. ఒకేసారి పెద్ద సంఖ్యలో దాఖలైన ఈ పిటిషన్లను చదివి రాతపూర్వకంగా అభ్యంతరాలను సమర్పించడానికి కేటాయించిన సమయం సరిపోదని, కాబట్టి అభ్యంతరాల సమర్పణకు గడువు పొడించాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ), విద్యుత్ రంగ నిపుణులు ఎం.వేణుగోపాల్ రావు తదితరులు చేసిన విజ్ఞప్తులను ఇప్పటికే ఈఆర్సీ తోసిపుచ్చింది.
ఈ పిటిషన్లపై సోమవారం (20వ తేదీ) నుంచి శుక్రవారం (25వ తేదీ) వరకు వరుసగా ఐదు రోజుల పాటు హైదరాబాద్, నిజామాబాద్, సిరిసిల్లాలో బహిరంగ విచారణ జరపాలని నిర్ణయించింది. ఆ తర్వాత 4 రోజుల పదవీకాలమే మిగిలి ఉండనుండగా.. ఆలోపే హడావుడిగా 9 కీలక పిటిషన్లపై కమిషన్ ఉత్తర్వులను వెలువరించడానికి సిద్ధం కావడం చర్చనీయాంశమైంది. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో టారిఫ్, ఏఆర్‌ఆర్, ఎంవైటీ పిటిషన్లపై ఈఆర్సీ హడావుడిగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు లేవు. కాగా.. విద్యుత్ సంస్థల పిటిషన్లలోని ప్రతిపాదనలపై విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు నుంచి పెద్ద ఎత్తున రాతపూర్వక అభ్యంతరాలు ఈఆర్సీకి అందాయి.
విచారణలు ఇలా..
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.963.18 కోట్ల ట్రూ అప్ చార్జీల వసూలుకు అనుమతి కోరుతూ జెన్‌కో దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్ జీటీఎస్ కాలనీలోని విద్యుత్ నియంత్రణ భవన్‌లో ఉదయం 10.30 నుంచి ఈఆర్సీ బహిరంగ విచారణ ప్రారంభం కానుంది.
2024-29 మధ్యకాలానికిగాను తమ ట్రాన్స్‌మిషన్ బిజినెస్, ఎస్‌ఎల్‌డీసీ యాక్టివిటీకి సంబంధించి ట్రాన్స్‌కో దాఖలు చేసిన రెండు ఎంవైటీ పిటిషన్లపై రేపు ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.16,346.1 కోట్ల ఆదాయ అవసరాలున్నట్టు అంచనా వేస్తూ ఆ మేరకు ట్రాన్స్‌మిషన్ చార్జీల వసూళ్లను ట్రాన్స్‌కో ప్రతిపాదించింది. 2019-24 మధ్యకాలానికి సంబధించిన ట్రాన్స్‌కో ఆదాయ అంచనాలతో పోల్చితే ఇది రూ.584.59కోట్లు అధికం కావడం గమనార్హం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రాష్ట్రంలో రూ.1200కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ దాఖలు చేసిన రెండు వేర్వేరు ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్) పిటిషన్లతో పాటు 2024-29 మధ్యకాలానికి సంబంధించిన మరో రెండు ఎంవైటీ పిటిషన్లపై బుధవారం హైదరాబాద్‌లో, గురువారం నిజామాబాద్‌లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. హెచ్‌టీ కేటగిరీ విద్యుత్ చార్జీల పెంపు, ఎల్టీ కేటగిరీలో కూడా నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించే వారికిఫిక్స్‌డ్ చార్జీ (డిమాండ్ చార్జీ)ల పెంపును ఏఆర్‌ఆర్ పిటిషన్‌లో డిస్కంలు ప్రతిపాదించాయి. హెచ్‌టీ కేటగిరీకి చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్‌డ్ చార్జీల పెంపుతో రూ.100 కోట్ల భారం పడనుంది. నవంబరు 1నుంచి పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
సెస్‌లో చార్జీల పెంపుపై 25న..
సిరిసిల్లా జిల్లాకు విద్యుత్ సరఫరా చేసే కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై లిమిటెడ్(సెస్) పరిధిలో రూ.5కోట్ల విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన ఎంవైటీ పిటిషన్‌పై ఈ నెల 25న సిరిసిల్లాలో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది.
Updated Date - Oct 21 , 2024 | 04:10 AM