Caste Census: తెలంగాణలో 243 కులాలు
ABN, Publish Date - Nov 10 , 2024 | 02:38 AM
తెలంగాణ రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లో ఏ కేటగిరీలో ఎన్ని కులాలున్నాయో వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణనలో వివరాలను సేకరించేందుకుగాను ఆయా కులాలకు కోడ్‌లను కేటాయించింది.
బీసీల్లో 134 సామాజికవర్గాలు
ఎస్సీల్లో 59, ఎస్టీల్లో 32, ఓసీల్లో 18
కులగణనలో కోడ్‌ల కేటాయింపు
కులం, మతం లేదన్నవారికీ ఓ కోడ్
ఇతర రాష్ట్రాల వారికి ప్రత్యేక కోడ్‌లు
నమోదు చేస్తున్న ఎన్యుమరేటర్లు
భూ సమస్యలపైనా వివరాల సేకరణ
వ్యాపారవేత్తల వార్షిక టర్నోవర్ కూడా
సినీ హీరోలు, దర్శకులు, జ్యోతిష్కులు,
కాంట్రాక్టర్లు ‘స్వయం ఉపాధి’ కింద!
ప్రార్థనాలయాలకు వెళ్లేందుకు వివక్ష, బెదిరింపులున్నాయా అంటూ ఆరా
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లో ఏ కేటగిరీలో ఎన్ని కులాలున్నాయో వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణనలో వివరాలను సేకరించేందుకుగాను ఆయా కులాలకు కోడ్‌లను కేటాయించింది. తెలంగాణ వారే కాకుండా ఇక్కడ నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారికి కూడా ప్రత్యేక కోడ్‌లను కేటాయించి గణన చేపడుతోంది. కులం, మతం లేదని చెప్పేవారినీ ప్రత్యేక కోడ్ కింద నమోదు చేస్తోంది. మొత్తంగా కులగణన ప్రశ్నావళిలో కులాలకు సంబంధించి 249 కోడ్‌లను కేటాయించింది. ఈ సర్వేలో కులాల సమాచారంతోపాటు ఆయా కుటుంబాల భూముల వివరాలు, వారికి ఎదురవుతున్న భూ సమస్యలపైనా ఆరా తీస్తోంది. వ్యాపారవేత్తలైతే.. వారి వార్షిక టర్నోవర్ వివరాలు అడుగుతోంది.
ఇక ప్రార్థనాలయాలకు వెళ్లే విషయంలో కులపరమైన వివక్ష ఎదురవుతోందా? అని కూడా తెలుసుకుంటోంది. రాష్ట్రంలో శనివారం ప్రారంభమైన కులగణన ప్రశ్నావళిలో ఎన్యుమరేటర్లు ఈ వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. కులాల జాబితాకు సంబంధించి.. ఎస్సీల్లో ఆది ఆంధ్ర నుంచి వల్లూవాన్ వరకు మొత్తం 59 కులాలు ఉన్నట్లు, ఎస్టీల్లో అంధ్ నుంచి నక్కల కుర్వికరణ్ వరకు కలిపి 32 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది బీసీ జాబితాలో అన్ని కేటగిరీల్లో కలిపి 134 కులాలు ఉన్నట్లు తెలిపింది. వీటిలో.. బీసీ-ఏ కేటగిరీలో 57 కులాలు, బీసీ-బీలో 27 కులాలు, బీసీ-సీలో 01, బీసీ-డీలో 35, బీసీ-ఈలో 14 కులాల చొప్పున ఉన్నాయి. వీరితోపాటు అనాథలు, పదేళ్ల వయసు రాకముందే తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయులైన పిల్లలను బీసీ-ఏ కేటగిరీ కింద నమోదు చేయాలని పేర్కొంది. వీరి కోసం ప్రధాన కాలమ్‌లో కులం కోడ్ కింద 044ను కేటాయించింది. కాగా, క్రిస్టియన్ మతంలోకి మారిన షెడ్యూల్ కులాల (ఎస్సీలు) వారితోపాటు వారి సంతానాన్ని బీసీ-సీలో నమోదు చేస్తున్నారు.
ఓసీల్లో 18 కులాలు..
ఓపెన్ కేటగిరీ (ఓసీ)లో మొత్తం 18 కులాలున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీ-సీలో లేని క్రిస్టియన్లు, బీసీ-ఈలో లేని ముస్లింలను కూడా ఓసీ జాబితా కింద ఉంచారు. వీరికి ప్రత్యేక కోడ్‌లను కేటాయించారు. వీరీ కాకుండా.. జైనులు, బౌద్దులు, లింగాయత్, మార్వాడీ, పట్నాయక్, సిక్కులు, వర్మ లు కూడా ఓసీ జాబితాలోనే ఉన్నారు. ఇంకా ఎవరైనా ఇతరులుంటే వారి కోసం ‘000’ను కోడ్‌గా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లకు ప్రభుత్వం సూచించింది. వివరాల సేకరణకు వెళ్లిన ఎన్యురేటర్లు.. ఆయా కుటుంబసభ్యులు చెప్పిన కులాన్ని బట్టి సంబంధిత కోడ్‌ను నమోదు చేస్తున్నారు. తెలంగాణలో ఉంటున్న స్థానికేతరులైతే.. వారు ఏ రాష్ట్రానికి చెందిన వారనే వివరాలను నమోదు చేసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలకు కోడ్‌లను కేటాయించారు. ఇక రాష్ట్రంలోని కుటుంబాలు, ఆయా కుటుంబాల్లోని వ్యక్తులు ఏ భాష మాట్లాడుతారనే వివరాల కోసం తెలుగు సహా మొత్తం 18 భాషలకు కోడ్‌లను ప్రశ్నావళిలో కేటాయించారు. అంతేకాకుండా.. కులపరమైన వివక్ష, బెదిరింపులు, ఆయా మతాల ప్రార్థనాలయాలకు వెళ్లే అంశాలను కూడా కులగణనలో తెలుసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రశ్నావళిలో ప్రత్యేక ప్రశ్నలను పొందుపరిచారు. ప్రశ్నావళి షెడ్యూల్ కాలమ్ సంఖ్యలో 56వ ప్రశ్నలో ‘ఎలాంటి బెదిరింపులు, వివక్ష లేకుండా మీ కుటుంబంలోని సభ్యులు స్థానిక దేవాలయాలకు, మసీదులకు, చర్చిలు, ప్రార్థనా మందిరాలకు స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నారా?’అని ప్రశ్నిస్తున్నారు.
భూ సమస్యలపైనా వివరాల సేకరణ..
కుటుంబ సభ్యుల భూముల వివరాలను నమోదు చేసే క్రమంలో భూములకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. ఆయా సమస్యలను నమోదు చేసేందుకూ కోడ్‌లను కేటాయించారు. వీటిలో ‘‘వారసత్వం లేదా మ్యుటేషన్ సమస్యలు, పట్టా ఉంది కానీ దానిలో వివరాలు తప్పుగా వచ్చాయి, ధరణి వల్ల వచ్చిన పట్టా సమస్య, పట్టా ఉన్నా భూమి ఇతరుల అక్రమ ఆధీనంలో ఉంది, అసైన్డ్ భూమి ఇచ్చారు కానీ పట్టా ఇవ్వలేదు, ఇదే భూమిపై సర్వే జరిగినా అటవీ హక్కు పత్రంం(పట్టా) ఇవ్వలేదు, ప్రభుత్వ భూమి సాగు చేస్తున్నాం, అసైన్డ్ పట్టా కోరుతున్నాం, ఇతరములు’’ లాంటి ప్రశ్నలకు వివరాలను కోడ్‌ల వారీగా నమోదు చేస్తున్నారు. వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, పారిశ్రామికవేత్తల నుంచి వారి వార్షిక టర్నోవర్ వివరాలను తెలుసుకొని నమోదు చేస్తున్నారు. ఇక కాంట్రాక్టర్, బిల్డర్, సినిమా నిర్మాత, దర్శకులు, నటీనటులు, క్రీడాకారులు సహా వివిధ పనులు చేసే వారి వివరాలను ప్రశ్నావళిలోని స్వయం ఉపాధి అనే కాలమ్‌లో ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. సంగీత, వాయిద్య, నాటక, గానం, నృత్యం, చిత్రకారులను కళాకారుల కింద, వాస్తు, జ్యోతిష్యం, మతపరమైన సేవలు, పురోహితులు, మౌలానా, చర్చి పాస్టర్.. ఇలా అన్ని వివరాలకూ ప్రత్యేక కోడ్‌లను కేటాయించారు.
అప్పులు చెబుతున్నారు కానీ..!
రాష్ట్రంలో శనివారం ప్రారంభమైన కులగణనలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రశ్నావళిలో ఉన్న అన్ని ప్రశ్నలకు ఆయా కుటుంబ పెద్ద, సభ్యులు సమాధానం చెబుతున్నప్పటికీ.. ధరణి పాస్‌బుక్, ఆధార్ నంబర్లు చెప్పేందుకు కొంత వెనకాడుతున్నారు. అయితే తమ కుటుంబానికి ఎంత అప్పు ఉందనే ప్రశ్నకు మాత్రం వెంటనే సమాధానం చెబుతున్నట్టు తెలిసింది. ధరణి, ఆధార్ నంబర్లు చెబితే తమ ఆస్తుల వివరాలన్నీ ప్రభుత్వానికి తెలిసిపోతాయని, ప్రభుత్వ పథకాలేవీ తమకు దక్కవనే అపోహలో కొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని తొలగించేందుకు ప్రభుత్వం చేపట్టిన కులగణన ఎందుకు, దాని ఉపయోగాలు ఏంటనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - Nov 10 , 2024 | 02:38 AM