Group 2 Exams: అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్-2 పరీక్షలు వాయిదా..
ABN, Publish Date - Jul 19 , 2024 | 02:48 PM
గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ సర్కార్ వాయిదా వేసింది. ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని మెుదట నిర్ణయించగా నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో పరీక్షల తేదీలను మార్చింది.
హైదరాబాద్: గ్రూప్-2పరీక్షలను తెలంగాణ సర్కార్ వాయిదా వేసింది. ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని మెుదట నిర్ణయించగా నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో పరీక్షల తేదీలను మార్చింది. డీఎస్సీ పరీక్షలు జులై 18నుంచి ఆగస్టు 5వరకు ఉండటం వెంటనే గ్రూప్-2పరీక్షలు ఉండడంతో అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పలు ధర్నాల అనంతరం పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పరీక్షలు ఎందుకు వాయిదా వేశారంటే..
2022డిసెంబర్‌లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్‌పీఎస్సీ 783 గ్రూప్-2పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అప్పట్నుంచి పలు కారణాలతో పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పరీక్షలు నిర్వహిస్తారని అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. దీనికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు తేదీలు ప్రకటించింది. దీంతో పాటు ఖాళీగా ఉన్న డీఎస్సీ పోస్టుల్లో నియామకాలు చేసేందుకు సైతం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ రెండు పరీక్షల మధ్య వ్యవధి ఒక్క రోజు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల నుంచి ఒక్కసారిగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జులై 18నుంచి ఆగస్టు 5వరకు డీఎస్సీ పరీక్షలు ఉండగా.. ఆగస్టు 7, 8తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయని దీంతో తాము నష్టపోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వేలమంది నిరుగ్యోదులు తేదీలు మార్చాలంటూ రోడ్లపైకి ఎక్కారు. సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా పెద్దఎత్తున ధర్నాలు చేశారు.
నిరుద్యోగులతో చర్చలు..
ఈ అంశంపై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్ తదితరులు నిన్న(గురువారం) రోజున నిరుద్యోగులతో సమావేశం నిర్వహించారు. వారితో పలు అంశాలపై చర్చించారు. అభ్యర్థుల అభ్యర్థన సమంజసంగానే ఉందని, వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీకువెళ్తామని ఎంపీ, ఎమ్మెల్యే వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వారు చెప్పారు. అయితే గ్రూపు-1 ప్రిలిమనరీ పరీక్షలో 1:100ఎంపిక సాధ్యం కాదని తేల్చి తెలిపారు. దాని వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభ్యర్థులకు చెప్పారు. అనంతరం విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే గ్రూప్-2పరీక్షలు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పరీక్షలు వాయిదా పడడంతో డీఎస్సీ, గ్రూప్-2పరీక్షలు రాసేందుకు తగిన సమయం దొరికిందంటూ అభ్యర్థులు తెగ సంబరపడిపోతున్నారు.
Updated Date - Jul 19 , 2024 | 04:21 PM