KTR: కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ ఉచ్చు
ABN, Publish Date - Dec 17 , 2024 | 03:11 AM
ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారం పూర్తిస్థాయిలో మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకోనుంది. ఈ అంశంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించింది.
నేడో రేపో నోటీసులు.. అరెస్టూ?
విచారణకు ఇప్పటికే గవర్నర్ ఓకే
మంత్రి మండలిలో సుదీర్ఘ చర్చ
పత్రాలు సీఎస్ ద్వారా ఏసీబీకి
చట్టప్రకారమే ముందుకు ఐదు ఆర్డినెన్సులకు ఆమోదం
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారం పూర్తిస్థాయిలో మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకోనుంది. ఈ అంశంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించింది. ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించారు! నేడో రేపో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది! ఈ మేరకు క్యాబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది! సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం 4.10 గంటల నుంచి 8 గంటల వరకూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఇందులో జరిగిన అవినీతిపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయాన్ని మంత్రులకు తెలిపారు. అనంతరం ఈ అంశంపై మంత్రుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకున్నారు.
చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని మంత్రులంతా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కేటీఆర్‌పై విచారణకు సంబంధించి ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, ఈ విషయంలో జాప్యం జరిగితే ఉపయోగం ఉండదని మెజార్టీ మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాంతో, ఫార్ములా వన్ ఈ-కార్ రేసుకు సంబంధించి కేటీఆర్‌పై కేసు నమోదుకు అనుమతిస్తూ గవర్నర్ పంపిన పత్రాలను సోమవారం రాత్రే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని నిర్ణయించారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీకి పంపనున్నారు. ఆ తర్వాత చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుందని మంత్రులకు సీఎం వివరించినట్లు సమాచారం. కాగా, ఏసీబీ దర్యాప్తులో భాగంగా తొలుత ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్‌కు నోటీసులివ్వనున్నారు. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ-కారు రేసు పేరిట రెండు మూడు విడతలుగా దేశం నుంచి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్లాయని, అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్లాయో ఏసీబీ విచారణలో తేలుతుందని మంత్రిమండలి అభిప్రాయపడింది. అలా విదేశాలకు వెళ్లిన డబ్బులకు సంబంధించి ఆర్బీఐ అనుమతి ఉందా లేదా అనే అంశం కూడా విచారణలో తేలుతుందని క్యాబినెట్‌లో చర్చ జరిగింది.
50 కోట్లా!? 700 కోట్లా!? అనేది ఏసీబీ తేలుస్తుంది: మంత్రి పొంగులేటి
ఈ-కార్ రేసు విషయంలో చట్టప్రకారం ముందుకు వెళ్లాలని మంత్రిమండలి నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన పెట్టుబడుల లెక్కలను కూడా ఏసీబీ తేలుస్తుందని, అవి రూ.50 కోట్లా లేక రూ.700 కోట్లా అనేది ఏసీబీ విచారణలో తేలుతుందని వ్యాఖ్యానించారు. మంత్రి మండలి సమావేశం తర్వాత ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ-కార్ ఫార్ములా రేసు పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోపిడికి పాల్పడిందని ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్ అరెస్టు అవుతారో లేదో తనకు తెలియదని, చట్టం తన పని తాను చేస్తుందని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలు తుస్సు బాంబో.. ఏ బాంబో త్వరలోనే తేలుతుందన్నారు.
అరెస్టు భయంతో కేటీఆర్ రాత్రికి రాత్రే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెట్టారో, అక్కడ ఎవర్ని కలిశారో చెప్పాలని ప్రశ్నించారు. అరెస్టు భయంతోనే ఇంటి దగ్గర కాపలా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని మాట్లాడటం బీఆర్‌ఎస్ నేతల అహంకారానికి నిదర్శనమన్నారు. తాము ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలగా మిగులుతుందన్నారు. శాసన సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు గుండాలను తలపించిందని, మాట్లాడేందుకు అంశాలు లేకనే ప్ల కార్డులను పట్టి నినాదాలతో పదే పదే ఆటంకం కలిగించారని మండిపడ్డారు.
Updated Date - Dec 17 , 2024 | 03:11 AM