ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ‘అనర్హత’పై తగిన వ్యవధిలో తీర్పు ఇవ్వండి

ABN, Publish Date - Nov 23 , 2024 | 04:10 AM

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తగిన సమయం (రీజనబుల్‌ టైం)లో తప్పకుండా నిర్ణయం తీసుకొని, తుది తీర్పు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రీజనబుల్‌ టైం అంటే ఎప్పుడు అనే దానికి సంబంధించి మూడు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.

  • పిటిషన్లు ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి?

  • రాజ్యాంగంలో పదో షెడ్యూల్‌ను చేర్చిన ఉద్దేశమేంటి?

  • ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ఎంత ఉంది?

  • ఈ మూడింటినీ దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి

  • పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు ఆదేశాలు.. సింగిల్‌ జడ్జి ఆదేశాల కొట్టివేత

  • సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తాం బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తగిన సమయం (రీజనబుల్‌ టైం)లో తప్పకుండా నిర్ణయం తీసుకొని, తుది తీర్పు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రీజనబుల్‌ టైం అంటే ఎప్పుడు అనే దానికి సంబంధించి మూడు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. ‘తన ఎదుట దాఖలైన అనర్హత పిటిషన్లు ఎప్పటినుంచి పెండింగ్‌లో ఉన్నాయి? ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా స్పీకర్‌కు విశేషమైన అధికారాలను కట్టబెడుతూ పదో షెడ్యూల్‌ను రాజ్యాంగంలో ఏ ఉద్దేశంతో చేర్చారు? ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ఎంత? అనే అంశాలను దృష్టిలో ఉంచుకుని అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోండి’ అని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావు ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన మూడు అప్పీళ్లపై శుక్రవారం తుది తీర్పు జారీచేసింది. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌ ఎదుట అనర్హత పిటిషన్‌లు దాఖలు చేశారు. అయితే, వారి అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం లేదంటూ హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద రిట్‌ పిటిషన్‌లు దాఖలు చేశారు. వాటిపై సుదీర్ఘంగా విచారించిన ఏకసభ్య ధర్మాసనం.. నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ ఇవ్వాలని, ఎలాంటి చర్యలు తీసుకోకపోతే సుమోటోగా కేసు రీ ఓపెన్‌ చేస్తామంటూ సెప్టెంబరు 9న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో మూడు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది.


  • ఇప్పటికే నాలుగున్నర నెలలు గడిచిపోయాయి

అసెంబ్లీ కార్యదర్శి తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రవీంద్ర శ్రీవాస్తవ, పార్టీ మారిన ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాదులు పి.శ్రీరఘురాం, రవిశంకర్‌ జంధ్యాల, మయూర్‌రెడ్డి, దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదించారు. ‘స్పీకర్‌ తుది నిర్ణయం తీసుకోకముందు న్యాయసమీక్షకు అవకాశం లేదు. స్పీకర్‌ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటున్న ‘కైశం మేఘాచంద్రసింగ్‌ ’ సుప్రీంకోర్టు తీర్పు ఆ కేసుకు మాత్రమే పరిమితం. ఇటీవల మహారాష్ట్ర వ్యవహారంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ‘సుభాష్‌ దేశాయి’ కేసులో మూడు నెలలని ఎక్కడా చెప్పలేదు. స్పీకర్‌ అధికారాలపై న్యాయసమీక్షకు తొలిసారి అవకాశం కల్పించిన ‘కిహోటో హోలోహాన్‌’ తీర్పు సైతం స్పీకర్‌ తుది తీర్పు ఇచ్చిన తర్వాతే కోర్టులు జోక్యం చేసుకోవాలని స్పష్టంచేసింది. స్పీకర్‌ అధికారాల్లో జోక్యం చేసుకోలేమని ఈ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గతంలో తీర్పు ఇచ్చింది. కాబట్టి సింగిల్‌ జడ్జి తీర్పు కొట్టేయండి’ అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, జె.ప్రభాకర్‌ వాదించారు. ‘స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకముందు.. తీసుకున్న తర్వాత న్యాయసమీక్షకు అవకాశం ఉంది. ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా జరిగే పార్టీ ఫిరాయింపులను నిరోధించాలనే సదుద్దేశంతో 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పదో షెడ్యూల్‌ను చేర్చారు. దాని ప్రకారం స్పీకర్‌కు విస్తృత అధికారాలు కట్టబెట్టారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్‌ అసలు ఆ పిటిషన్లను స్వీకరించకపోవడం అంటే పదో షెడ్యూల్‌ ఉద్దేశం ఓడిపోయినట్లే. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.


నాలుగు వారాల్లో షెడ్యూల్‌ ఇవ్వాలని మాత్రమే సింగిల్‌ జడ్జి చెప్పారు. తుది నిర్ణయం తీసుకోమని చెప్పలేదు. నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్‌ తరఫున అసెంబ్లీ కార్యదర్శి అప్పీళ్లు దాఖలు చేయడం చెల్లదు. ఈ అప్పీళ్లు విచారణార్హం కాదు. స్పీకర్‌ స్పందించకపోవడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే’ అని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. కోర్టు అనుసరించాల్సిన, కట్టుబడాల్సిన పలు న్యాయసూత్రాలు, సుప్రీంకోర్టు తీర్పులపై చర్చించింది. స్పీకర్‌ అధికారాలపై సమయానుసారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను విస్తృతంగా పరిశీలించింది. అనర్హత పిటిషన్లను తప్పకుండా రీజనబుల్‌ టైంలో స్పీకర్‌ పరిష్కరించాలని సుప్రీంకోర్టు తెలిపిందని పేర్కొంది. గతంలో ఈ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు’ తీర్పు కంటే ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ‘సుభాష్‌ దేశాయి’ తీర్పే శిరోఽధార్యమని ప్రకటించింది. ‘రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను పరిష్కరించాల్సింది స్పీకరే. స్పీకర్‌ అంటే అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవి. చట్టబద్ధమైన పాలనలో ఉన్న మన సమాజంలో రాజ్యాంగమే సుప్రీం అని గుర్తుంచుకోవాలి. స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలపై న్యాయసమీక్ష ఉంటుంది. స్పీకర్‌ రీజనబుల్‌ టైంలో నిర్ణయం తీసుకోవాలి. రిజనబుల్‌ టైం అనేది ఆయా ప్రత్యేక కేసుల్లోని వాస్తవాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత కేసులో అనర్హత పిటిషన్లు ఈ ఏడాది జూలై 1న దాఖలయ్యాయి. ఇప్పటికే నాలుగున్నర నెలలు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో స్పీకర్‌ నిబంధనల ప్రకారం వ్యవహరించాలి’ అని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. నాలుగు వారాల్లో షెడ్యూల్‌ ఇవ్వాలన్న సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది.


  • సుప్రీంకోర్టుకు వెళ్తాం..

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోనున్నట్లు వెల్లడించాయి. నిపుణులతో సంప్రదింపుల అనంతరం ఈ తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నాయి.

Updated Date - Nov 23 , 2024 | 04:10 AM