Census: సమగ్ర ఇంటింటి సర్వే షురూ
ABN, Publish Date - Nov 10 , 2024 | 02:44 AM
రాష్ట్రవ్యాప్తంగా శనివారం సమగ్ర ఇంటింటి సర్వే ప్రారంభమైంది. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ తమ కుటుంబ సభ్యుల వివరాలను అందజేశారు. సమగ్ర ఇంటింటి సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రులు సూచించారు.
వివరాలిచ్చిన గవర్నర్ మంత్రులు దామోదర,
పొన్నం కూడా.. కొన్ని చోట్ల సర్వేలో
సిబ్బంది అడ్డగింత మంత్రులు, ఎమ్మెల్యేలూ
పాల్గొనండి: భట్టి సర్వేపై ప్రజలు నమ్మకం ఉంచాలి: మంత్రులు
పలు చోట్ల సర్వే బహిష్కరణ.. అధికారుల అడ్డగింత
కలెక్టర్లు ఎన్యుమరేటర్ల సందేహాలు నివృత్తి చేయాలి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): రాష్ట్రవ్యాప్తంగా శనివారం సమగ్ర ఇంటింటి సర్వే ప్రారంభమైంది. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ తమ కుటుంబ సభ్యుల వివరాలను అందజేశారు. సమగ్ర ఇంటింటి సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రులు సూచించారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. మరికొన్ని చోట్ల ప్రజలు సర్వేను బహిష్కరించారు. తమ సమస్యలను పరిష్కరిస్తేనే సర్వేకు సహకరిస్తామని ఎన్యుమరేటర్లకు స్పష్టం చేశారు. సమగ్ర ఇంటింటి సర్వే ప్రారంభమైనందున కలెక్టర్లు తమ జిల్లాల్లోని ఎన్యుమరేటర్లతో మాట్లాడుతూ సందేహాలను నివృత్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. కుటుంబ సర్వేపై శనివారం ఆయన జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటింటి సర్వేపై ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తుంటారని.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఎన్యుమరేటర్లతో మాట్లాడితే, ఆ సందేహాలను నివృత్తి చేయవచ్చని భట్టి చెప్పారు. అవసరమైతే ఉన్నతాధికారుల నుంచి కలెక్టర్లు స్పష్టత తీసుకోవాలన్నారు. ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయరాదని, ఎలాంటి సందేహాలనైనా నివృత్తి చేయడానికి ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సాధ్యమైనంత ఎక్కువ సార్లు సర్వేలో భాగస్వాములయ్యేలా చూడాలన్నారు.
గవర్నర్ కుటుంబ వివరాల సేకరణ
రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుటుంబ వివరాలను అధికారులు సేకరించారు. గవర్నర్ స్వయంగా తెలిపిన వివరాల్ని ఫాంలో నమోదు చేసుకున్నారు. ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమగ్ర ఇంటింటి సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహాలు పెట్టకోకూడదని, నమ్మకంతో వివరాలను ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదరరాజనర్సిహ చెప్పారు. సంగారెడ్డిలోని విద్యానగర్‌లో తన ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లకు కుటుంబ వివరాలు అందజేశారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బంజారాహిల్స్, మినిస్టర్స్ కాలనీలోని మంత్రి నివాసంలో ఆయన కుటుంబ వివరాలను సేకరించిన తర్వాత ఎన్యుమరేటర్లు స్టిక్కర్లు అతికించారు.
కరీంనగర్ జిల్లాలో పూర్తికాని స్టిక్కరింగ్
కరీంనగర్ నగర పాలక సంస్థతో పాటు సమీపంలోని కొన్ని గ్రామాల్లో శనివారం సాయంత్రం వరకూ స్టిక్కరింగే పూర్తి కాలేదు. దీంతో జిల్లాలో కుటుంబాల సంఖ్య తేలలేదు. అధికారులు ఈ విషయమై ఎలాంటి ప్రకటనా చేయలేదు. స్టిక్కరింగ్ చేసిన ప్రాంతాల్లో సర్వే సమాచారాన్ని సేకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంతటా సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది. సకాలంలో సర్వే పత్రాలు అందకపోవడంతో కొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటలకు, మరికొన్ని గ్రామాల్లో 3 గంటలకు సర్వే ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలో తొలి రోజు 2.58శాతం సర్వే పూర్తి చేశారు. పెద్దపల్లి జిల్లాలో 1,849మంది ఎన్యుమరేటర్లు 13,649కుటుంబాల సర్వే పూర్తి చేశారు. గ్రామ సరిహద్దులు మార్చే వరకు సర్వేను బహిష్కరిస్తున్నట్లు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి వచ్చిన అధికారులకు వినతిపత్రం అందించారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తాము సర్వేకు సహకరించబోమని తెలిపారు.
దండం పెట్టి.. ఇంటికి రప్పించి..
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అన్నవరంలో సర్వేను పరిశీలించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్పెషల్ ఆఫీసర్ (ఐఏఎస్) సురేంద్రమోహన్ వెళ్లారు. గ్రామానికి చెందిన వృద్ధుడు బత్తుల లక్ష్మయ్య ఆయనకు దండం పెట్టి తనకు ఇల్లు కావాలని వేడుకున్నాడు. ఆయన్ను తన గుడిసె వద్దకు తీసుకెళ్లాడు. తినడానికి తిండి లేదని, ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నాని, ఇల్లు మంజూరు చేయాలని కోరాడు. స్పందించిన అధికారి.. వృద్ధుడి ఆధార్‌ను సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీసుకున్నారు. సర్వేలో సమాచారం ఇస్తే నిబంధనల ప్రకారం ఇల్లు వస్తుందని భరోసా ఇచ్చారు.
ఇథనాల్ పరిశ్రమను తరలిస్తేనే..
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం గుండంపల్లిలో ప్రజలు సర్వేను బహిష్కరించారు. ఇథనాల్ పరిశ్రమను తరలిస్తేనే సర్వేకు సహకరిస్తామని తేల్చిచెప్పారు. స్పందించిన నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణి, డీపీవో శ్రీనివాస్, డీఆర్‌డీవో విజయలక్ష్మి, ఇతర అధికారులు గుండంపల్లి గ్రామానికి వచ్చారు. గ్రామస్థులు వారిని పొలిమేరల్లోనే అడ్డుకొని, నిరసన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా రాని అధికారులు ఇప్పుడెందుకు వచ్చారంటూ నిలదీశారు. ఇథనాల్ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాకే తమ గ్రామంలోకి రావాలని డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే సర్వేకు సహకరిస్తామని తేల్చిచెప్పారు. దీంతో అధికారులు చేసేదేమీ లేకవెనుదిరిగి వెళ్లిపోయారు.
రంగంలోకి ప్రత్యేక కమిషన్ రేపు, ఎల్లుండి అభిప్రాయ సేకరణ... త్వరలో జిల్లాల్లో
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక (డెడికేటెడ్) కమిషన్ రంగంలోకి దిగనుంది. ఈ మేరకు రేపు, ఎల్లుండి ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభిప్రాయ సేకరణ(పబ్లిక్ హియరింగ్) కార్యక్రమాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య తెలుగు సంక్షేమ భవన్‌లోని 4వ అంతస్తులో ఏర్పాటైన కమిషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే, సోమవారం ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాలను కమిషన్‌కు వెల్లడించేందుకు అవకాశం కల్పించగా.. మంగళవారం మాత్రం వివిధ ఎన్‌జీవోలు, పలు సంస్థలు, కుల సంఘాలకే అవకాశం కల్పిస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి బి.సైదులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, త్వరలోనే ఈ పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించనున్నట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో కులగణన సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే. వివరాల సేకరణ అనంతరం ప్రత్యేక కమిషన్ బీసీల రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది.
Updated Date - Nov 10 , 2024 | 02:44 AM