Tirumala VIP Darshan: తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలకు మా సిఫారసు లేఖలనూ అనుమతించండి
ABN, Publish Date - Aug 18 , 2024 | 04:46 AM
తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలకు తమ సిఫారసు లేఖలనూ అనుమతించాలంటూ తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి టీటీడీపై ఒత్తిడి పెరుగుతోంది.
టీటీడీపై తెలంగాణ ప్రజాప్రతినిధుల ఒత్తిడి
తిరుమల, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలకు తమ సిఫారసు లేఖలనూ అనుమతించాలంటూ తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి టీటీడీపై ఒత్తిడి పెరుగుతోంది. కొవిడ్ సమయంలో రద్దయిన కోటాను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. గతంలో ఏపీ ప్రజాప్రతినిధుల సిఫారసులతో 1,800-2,000 వరకు బ్రేక్ దర్శనం టికెట్లు, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసులపై 600-700 టికెట్లు ఇచ్చేవారు.
కానీ, కొవిడ్ తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనాల నియంత్రణలో భాగంగా తెలంగాణ నుంచి స్వయంగా వచ్చే ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రొటోకాల్ దర్శనాలు చేయించాలని, సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు ఇవ్వకూడదని టీటీడీ నిర్ణయించింది. నాలుగేళ్లుగా అదే విధానం కొనసాగుతోంది.
అయితే, తాజాగా తెలంగాణ, ఏపీలో కొత్త ప్రభుత్వాలు వచ్చాక తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి టీటీడీ అధికారులపై ఒత్తిడి పెరిగింది. తమ సిఫారసు లేఖలనూ అనుమతించాలని ఇటీవల తిరుమలకు వచ్చిన తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అయితే, ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, తుది నిర్ణయం నడుచుకోవాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
Updated Date - Aug 18 , 2024 | 04:46 AM