ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diabetes: మధుమేహ కేసుల్లో మూడో స్థానం

ABN, Publish Date - Dec 09 , 2024 | 03:02 AM

మధుమేహ రోగుల సంఖ్య విషయంలో తెలంగాణ.. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో మూడోస్థానంలో నిలిచింది. మన రాష్ట్రంలో మూడుపదుల పైబడిన వారిలో 14 శాతం మంది షుగర్‌ పేషంట్స్‌ ఉన్నారని.. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

  • తెలంగాణలో 30 దాటినవారిలో 14ు మంది వ్యాధిబాధితులు

  • పెద్ద రాష్ట్రాల్లో 32 శాతం కేసులతో అగ్ర స్థానంలో పంజాబ్‌

  • 16 శాతంతో 2వ స్థానంలో మహారాష్ట్ర.. జాతీయ సగటు 9.16ు

  • యూటీల్లో పుదుచ్చేరి టాప్‌.. ఈశాన్యంలోనూ భారీగా రోగులు

  • గణాంకాలను విడుదల చేసిన కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మధుమేహ రోగుల సంఖ్య విషయంలో తెలంగాణ.. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో మూడోస్థానంలో నిలిచింది. మన రాష్ట్రంలో మూడుపదుల పైబడిన వారిలో 14 శాతం మంది షుగర్‌ పేషంట్స్‌ ఉన్నారని.. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అసాంక్రామిక (ఒకరి నుంచి మరొకరికి సోకని) వ్యాధుల (ఎన్‌సీడీ) పోర్టల్‌ ప్రకారం ఈ ఏడాది నవంబర్‌ 30 వరకూ అన్ని రాష్ట్రాల్లో నమోదైన డయాబెటిస్‌ గణాంకాల వివరాలను అందులో వెల్లడించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎమ్‌)లో ఒక కార్యక్రమమైన ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌లో భాగంగా 30 ఏళ్లు దాటిన వారికి వైద్య, ఆరోగ్యశాఖ రక్తపోటు, మధుమేహానికి సంబంధించిన పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది అన్ని రాష్ట్రాల్లో కలిపి 32,33,32,732 మందికి పరీక్షలు చేయగా.. 2,96,26,225 మందికి (9.16 శాతం) చక్కెరవ్యాధి ఉన్నట్టు తేలింది. తెలంగాణలో 1.75 కోట్ల మందికి పరీక్షలు చేయగా.. అందులో 24.52 లక్షల మంది షుగర్‌ పేషెంట్లే కావడం గమనార్హం. అంటే పరీక్షలు చేయించుకున్న వారిలో 14 శాతం మంది. పెద్ద రాష్ట్రాల్లో పంజాబ్‌, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్‌లో 20.51 లక్షల మందికి పరీక్షలు చేయగా.. ఏకంగా 6.73 లక్షల మందికి (32.82 శాతం) మధుమేహం ఉన్నట్టు తేలింది. మహారాష్ట్రలో 2.49 కోట్లమందికి పరీక్షలు చేయగా.. 40.03 లక్షల మంది (16 శాతం)డయాబెటిస్‌ బాధితులున్నట్టు వెల్లడైంది. మూడో స్థానంలో తెలంగాణ ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్‌ (13 శాతం), కర్ణాటక (12 శాతం), మధ్యప్రదేశ్‌ (11 శాతం) ఉన్నాయి. ఇక, చిన్నవైన ఈశాన్యరాష్ట్రాల్లో నాగాలాండ్‌లో 32 శాతం, సిక్కింలో 25 శాతం షుగర్‌ వ్యాధిగ్రస్తులున్నట్టు ఎన్‌సీడీ లెక్కలు చెబుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55 శాతం కేసులతో పుదుచ్చేరి అగ్రస్థానంలో ఉంది. అక్కడ లక్ష మందికి పరీక్షలు చేయగా అందులో 55 వేలమందికి షుగర్‌ ఉన్నట్లు తేలింది. అండమాన్‌ నికోబార్‌లో 23 శాతం మంది మధుమేహులున్నారు.


  • దక్షిణాది కేసులు ఎక్కువే!

దేశంలో దక్షిణాది రాష్ట్రాలు డయాబెటిస్‌ కేంద్రాలుగా మారుతున్నట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది చేసిన పరీక్షల్లో మధుమేహ బాధితులుగా తేలినవారు దేశం మొత్తమ్మీదా కలిపి 2.96 కోట్ల మంది ఉండగా.. అందులో 1.36 కోట్ల మంది ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలవారేనని ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌లో తేలింది.


  • ఆహారపుటలవాట్లే సమస్య

మన దగ్గర పట్టణ, నగర జనాభా ఎక్కువ. తెలంగాణలో 42 శాతం మంది పట్టణాల్లో ఉంటున్నారు. ఉద్యోగులు, వైట్‌ కాలర్‌ జాబ్‌ చేసే వారి సంఖ్యా ఎక్కువే. మనది ధనిక రాష్ట్రం కావడంతో అలవాట్లు కూడా అలాగే మారాయి. చాలామంది ఇంట్లో తినడం మానేసి బయటే ఎక్కువగా తింటున్నారు. దేశంలో ఏ నగరంలోనూ లేని విధంగా మన హైదరాబాద్‌లోరెస్టారెంట్లు, హోటళ్లు అన్నీ కలిపి 72 వేలకు పైగా ఉన్నాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీవనశైలి చాలా మారింది. శారీరక శ్రమ తగ్గింది. వరి అన్నం ఎక్కువగా తినడం, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, ధూమపానం, మద్యపానం, కొద్ది దూరాలకు కూడా.. నడవడం మానేసి వాహనాలపై వెళ్లడం వంటి అలవాట్లతో మనదగ్గర షుగర్‌ పేషంట్స్‌ పెరుగుతున్నారు. 30ల్లోనే డయాబెటిస్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. 25 ఏళ్లకే ప్రీ-డయాబెటిస్‌ కేసులు వస్తున్నాయి. పిల్లల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి మారాలంటే.. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. శారీరక శ్రమ, వ్యాయాయం, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అలవర్చుకోవాలి.

- డాక్టర్‌ ఎంవీ రావు, కన్సల్టెంట్‌ ఫిజిషియన్‌, యశోదా ఆస్పత్రి, హైదరాబాద్‌


  • జీవనశైలి మార్పులతో మధుమేహానికి చెక్‌!

కూర్చుని చేసే ఉద్యోగాలు.. మూడుపూటలా అన్నం (లేదా) పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే అల్పాహారాలు తినడం.. శారీరక శ్రమ లేకపోవడం.. ఇలా జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి... మందుల వాడకంతో పాటు జీవనశైలిలో, ఆహారపుటలవాట్లలో మార్పుల ద్వారా దాన్ని బాగా నియంత్రించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు) ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను బాగా తగ్గించాలని సూచిస్తున్నారు. వారు చెబుతున్నదాని ప్రకారం.. పిండిపదార్థాల్లో రెండు రకాలుంటాయి. అవి.. సింపుల్‌ (సరళ) కార్బోహైడ్రేట్లు, కాంప్లెక్స్‌ (సంక్లిష్ట) కార్బోహైడ్రేట్లు. మొదటి రకం పిండిపదార్థాలు పంచదార, శీతలపానీయాల వంటివాటిలో ఉంటాయి. కాబట్టి వాటిని మానేయడం మంచిది. రెండో రకం (కాంప్లెక్స్‌) కార్బోహైడ్రేట్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అవి ఎక్కువసేపు శక్తినిస్తాయి. వీటిని తినొచ్చు. మాంసకృత్తులు (ప్రొటీన్‌) ఎక్కువగా ఉండే పదార్థాలు, ఆకు కూరలు, కూరగాయలు, పొట్టుతో ఉన్న తృణ ధాన్యాలను అధికంగా తీసుకోవాలి.


ఆఫీసులో పనిచేసేవారైతే.. ఎక్కువసేపు కదలకుండా కూర్చోకూడదు. కనీసం అరగంట - గంటకు ఒకసారి లేచి అటూ ఇటూ తిరగాలి. నిత్యం వ్యాయామం చేయడం లేదా వారానికి కనీసం మూడు రోజులైనా కసరత్తులు చేయడం మంచిది. కంటి నిండా నిద్ర కూడా ముఖ్యమే. రోజుకు ఎనిమిది గంటలపాటు.. అంతరాయం లేని నిద్ర ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. మధుమేహం బారిన పడ్డట్టు నిర్ధారణ అయిన వెంటనే.. బరువు తగ్గగలిగితే రక్తంలో చక్కెరస్థాయులను అదుపులో ఉంచవచ్చని ఒక అధ్యయనంలో వెల్లడైంది. వైద్యులు, పోషకాహార నిపుణుల సాయంతో ఆహారపుటలవాట్లను మార్చుకుని, రోజూ వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి. భారీ స్థూలకాయంతో బాధపడేవారు, బాడీ మాస్‌ ఇండెక్స్‌ 35 కంటే ఎక్కువగా ఉండేవారు.. షుగర్‌ వచ్చిన తొలినాళ్లలో.. వైద్య నిపుణులను సంప్రదించి, బేరియాట్రిక్‌ సర్జరీ వంటి ప్రత్యామ్నాయాలనూ పరిశీలించవచ్చు. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు చాలా పరిశోధనలే చేస్తున్నారు. సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, షుగర్‌ ఉన్నా లేనట్టే జీవించేలా చేసే ఇన్సులిన్‌ మాత్రల వంటి ప్రయోగాలు చాలా జరుగుతున్నాయి. అవి విజయవంతమై షుగర్‌ను నయం చేసే మందులు అందుబాటులోకి వచ్చే దాకా మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే.

Updated Date - Dec 09 , 2024 | 03:02 AM