ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Transfers: ఏళ్లుగా ఎక్కడి వాళ్లు అక్కడే!

ABN, Publish Date - Sep 30 , 2024 | 03:44 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు బదిలీలు జరగలేదు. చాలామంది ఉద్యోగులు ఏళ్లుగా ఒకే స్థానానికి పరిమితమైపోయారు.

  • తెలంగాణ ఏర్పాటు నుంచి సచివాలయ ఉద్యోగులకు జరగని బదిలీలు

  • గత ప్రభుత్వంలో అమలు కానీ సర్వీసు నిబంధనలు

  • కాంగ్రెస్‌ అధికారం చేపట్టినా మారని పరిస్థితి

  • తీవ్ర అసంతృప్తిలో ఉద్యోగులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు బదిలీలు జరగలేదు. చాలామంది ఉద్యోగులు ఏళ్లుగా ఒకే స్థానానికి పరిమితమైపోయారు. గత పదేళ్లలో తమ మొర ఆలకించిన వారే లేరని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయ నిబంధనలు, సర్వీస్‌ రూల్స్‌ అమలు చేస్తారని ఆశించినా నిరాశే మిగిలిందని ఉద్యోగులు వాపోతున్నారు. అంతేకాక, తమ సమస్యలను విన్నవించుకుందామంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమయం ఇవ్వడం లేదని సహాయ కార్యదర్శి స్థాయి అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న సచివాలయ నిబంధనల ప్రకారం ఓ ఉద్యోగి ఒక సెక్షన్‌లో మూడేళ్లకు మించి పని చేయకూడదు. అలాగే ఓ శాఖ పరిధిలో ఆరేళ్లకు మించి ఉంచకుండా బదిలీ చెయ్యాలి.


అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరగలేదు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒకట్రెండు సార్లు ఉద్యోగుల వివరాలు సేకరించినా బదిలీలు చేపట్టలేదు. ఇలా నిబంధనలు అమలు చేయకపోవడంతో 25 ఏళ్లుగా ఒకే శాఖలో కొనసాగుతున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రాధాన్యం కలిగిన రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, వైద్యం, విద్య వంటి శాఖల్లో పని చేసే ఉద్యోగులు ఆయా శాఖల్లో పాతుకుపోయారు. మరికొందరు అప్రాధాన్య శాఖల్లోనే ఉండిపోయారు. ఫోకల్‌, నాన్‌ఫోకల్‌ పోస్టుల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరించి దీర్ఘకాలంగా నాన్‌ఫోకల్‌లో ఉన్న ఉద్యోగులను బదిలీ చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.


సమర్ధులైన అధికారులు సచివాలయంలోనే ఉన్నా కొందరు ఉన్నతాధికారులు బయటి నుంచి అధికారులను తెచ్చి కీలక బాధ్యతలు అప్పగిస్తుండడంపైనా ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన ఓ ఉద్యోగిని కాలుష్య నియంత్రణ మండలిలో సభ్యుడిగా నియమించి అతన్ని డిప్యుటేషన్‌పై సెక్రటేరియట్‌కు తెచ్చి జీఏడీలో కీలక బాధ్యతలు అప్పగించడంపై ఉద్యోగుల్లో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - Sep 30 , 2024 | 03:44 AM