ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Musi River: మూసీకి ప్రపంచ బ్యాంకు 4 వేల కోట్ల రుణం

ABN, Publish Date - Nov 17 , 2024 | 03:38 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనుల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపింది.

  • కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ

  • తొలి దశలో 17 కి.మీ మేర పునరుజ్జీవ పనులు

  • ఆరేళ్ల వ్యవధిలో రూ.5,863 కోట్ల ఖర్చు

  • రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 1,763 కోట్ల వ్యయం

  • మిగతా పనులకు ఇతర మార్గాల ద్వారా నిధులు

  • రూ.4,100 కోట్ల రుణం పొందేందుకు ప్రతిపాదనలు

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనుల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపింది. విషతుల్యంగా మారిన మూసీ నీటిని శుద్ధి చేసి.. మూసీనదిని సుందరీకరించేందుకుగాను 55 కిలోమీటర్ల మేర నదీ పరివాహకాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి దశలో 17 కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం ఆరేళ్ల వ్యవధిలో రూ.5863 కోట్ల నిధులు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మొత్తంలో రూ.4,100 కోట్లను ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక (పీపీఆర్‌) ఆధారంగా నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖకు పంపిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.


మిగిలిన రూ.1763 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. తొలి విడతలో మూసీ ఎగువ ప్రాంతం నుంచి బాపుఘాట్‌ వరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే బాపుఘాట్‌ వద్ద అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను సింగపూర్‌ కన్సార్షియం మెయిన్‌ హార్ట్‌ సమర్పించినట్లు తెలిసింది. ఇక మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులోని ఇతర పనులకు అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర పథకాల నుంచి, సీఎ్‌సఆర్‌ నిధులతో, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో.. ఇలా వివిధ మార్గాల ద్వారా సమీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతేకాకుండా గ్రీన్‌ బాండ్లను కూడా జారీ చేసి ప్రకటనలు, పర్యాటక కార్యక్రమాల ద్వారా నిధులు సేకరించనున్నారు.


  • పునరుజ్జీవంలో ప్రాధాన్య అంశాలు ఇవే..

మూసీ ప్రక్షాళనలో ప్రధానంగా నీటి నిర్వహణపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీలో మురుగునీటికి అవకాశం లేకుండా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం 37 ఎస్టీపీల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచింది. మురుగునీటిని శుద్ధిచేసి మూసీలోకి వదిలేలా ప్రణాళికలు రూపొందించింది. ఎస్టీపీలతోపాటు మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి మూసీ నదిపై ఉన్న హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లలో మంచినీరు నింపి.. ఆ నీటిని నిరంతరం మూసీలో ప్రవహింపజేసేలా సన్నాహాలు చేస్తోంది. 2026 జూన్‌ నాటికి మంచినీటితో మూసీ కళకళలాడాలన్నది ప్రభుత్వ సంకల్పంగా చెబుతోంది. మూసీ ఆక్రమణల్ని తొలగించి వరదల నుంచి విపత్తులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు.. నదీ పరివాహకంలో నివాసముంటున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలు కూడా చేపట్టింది.


నిర్వాసితులకు మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది. వీటితోపాటు నదీ పరివాహకంలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడం కోసం ప్రత్యేక పార్కులను అభివృద్ధి చేయనుంది. నది సహజత్వాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన పనులు చేపట్టనుంది. నదీ పరివాహకంలోకి ప్రజల రాకపోకలు సాఫీగా సాగేందుకు అవసరమైన రహదారుల నిర్మాణం చేపట్టి రవాణా వ్యవస్థను బలోపేతం చేయనుంది. దీని ద్వారా పర్యాటకులను మూసీవైపు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. పర్యావరణ హిత వాణిజ్య కార్యకలాపాలు చేపట్టేందుకు వీలుగా మూసీ పరివాహకంలో అవసరమైన చోట హాకర్స్‌ జోన్లు, రిక్రియేషన్‌ జోన్ల నిర్మాణాలు, వాణిజ్య భవన సముదాయాలను చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.

Updated Date - Nov 17 , 2024 | 03:38 AM