Viral News: ఆ విషయంలో తెలంగాణ టాప్.. రెండో స్థానంలో ఏపీ
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:35 PM
ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) దేశంలో సగటున ఓ వ్యక్తి మద్యం కోసం చేసిన ఖర్చులకు సంబంధించిన జాబితా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మద్యం కోసం సగటున ఓ వ్యక్తి చేసిన ఖర్చులో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో..
తెలంగాణలో దావత్ ఉందంటే ముక్కతో పాటు చుక్క కూడా ఉండాల్సిందే. దేశంలోనే మద్యం అధికంగా సేవించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒకటి. అందుకే ఎక్సైజ్ రెవెన్యూ ఈ రాష్ట్రాల్లో అధికంగా ఉంటుంది. తాజాగా ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) దేశంలో సగటున ఓ వ్యక్తి మద్యం కోసం చేసిన ఖర్చులకు సంబంధించిన జాబితా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మద్యం కోసం సగటున ఓ వ్యక్తి చేసిన ఖర్చులో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. అత్యంత తక్కువ ఖర్చు చేసిన రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. మద్యపాన నిషేధం అమలుచేస్తున్న రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలకు సంబంధించి 2022-23 సంవత్సరంలో ఓ వ్యక్తి మద్యంపై చేస్తున్న ఖర్చులకు సంబంధించిన జాబితాను ఎన్‌ఐపిఎఫ్‌పి విడుదల చేసింది.
టాప్‌లో తెలంగాణ
2022-23 సంవత్సరంలో తెలంగాణలో సగటున ఓ వ్యక్తి మద్యంపై చేసిన ఖర్చు రూ.1623గా ఎన్‌ఐపిఎఫ్‌పి తెలిపింది. దేశవ్యాప్తంగా ఇదే అత్యధికంగా పేర్కొంది. ఆ తరువాత రూ.1306 ఖర్చుతో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. రూ.1245తో పంజాబ్ మూడోస్థానంలో, రూ.1227తో ఛత్తీస్‌గడ్ నాలుగోస్థానంలో ఉండగా, రూ.1156తో ఒడిస్సా ఐదో స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో ఏదైనా పార్టీలో మద్యం తీసుకోవడం సంప్రాదాయంగా వస్తోంది. దీంతో ఎవరైనా ఇంట్లో చిన్నపాటి పంక్షన్ అయినా ఫుడ్‌తో పాటు మద్యం తప్పకుండాఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో దీనిని ఓ సంప్రదాయంగా చూస్తారు. దీంతో మద్యంపై ఎక్కువ ఖర్చుచేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేశంలో ఎక్కువుగా మద్యంపై ఖర్చుచేసే రాష్ట్రాల్లో ఏపీ ఉండగా.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ మొదటి జాబితాలో ఉంది.
చివరి స్థానంలో వెస్ట్‌బెంగాల్
మద్యంపై ఓ వ్యక్తి అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో వెస్ట్ బెంగాల్ మొదటివరుసలో ఉంది. 2022-23 సంవత్సరంలో పశ్చిమబెంగాల్‌లో సగటున ఓ వ్యక్తి మద్యంపై కేవలం రూ.4మాత్రమే ఖర్చు చేశారు. దేశంలో జనాభా ఎక్కవ కలిగిన ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి సగటున మద్యంపై ఏడాదిలో చేసిన ఖర్చు రూ.49 మాత్రమే ఆ తరువాత రాజస్థాన్ రూ.140, త్రిపుర రూ.148 ఖర్చు చేశాయి. మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి మద్యంపై సగటున ఖర్చుచేసిన మొత్తం రూ.197 కాగా, మహారాష్ట్రలో ఈ ఖర్చు రూ.346గా ఉంది. హర్యానాలో రూ.812 కాగా తమిళనాడులో ఈ ఖర్చు రూ.841గా ఉంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Oct 30 , 2024 | 05:44 PM