ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana : వరి చేలను ముంచెత్తిన వరద

ABN, Publish Date - Jul 10 , 2024 | 06:10 AM

భారీ వర్షాలకు ఖమ్మం, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాగుల్లోకి వరద నీరు పోటెత్తడంతో వరి చేలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురవగా,

  • ఖమ్మం, అసిఫాబాద్‌ జిల్లాల్లో ఘటనలు.. ఖమ్మం జిల్లాలో 200 ఎకరాలకు పైగా పంట మునక

  • అరటి, పామాయిల్‌ తోటలు కూడా

  • ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటి మట్టాలు

  • మేడిగడ్డకు 35 వేల క్యూసెక్కుల వరద

  • ఆల్మట్టికి 78 వేలు, తుంగభద్రకు 30 వేలు

  • నేడు 6 జిల్లాలకు భారీ వర్ష సూచన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

భారీ వర్షాలకు ఖమ్మం, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాగుల్లోకి వరద నీరు పోటెత్తడంతో వరి చేలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురవగా, ఏపీలోని చింతంపల్లి, తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఏపీ వైపు నుంచి రాళ్లగండి వాగు ద్వారా సత్తుపల్లి మండలాన్ని వరద తాకి బేతుపల్లి- సత్యనారాయణపురం మధ్య వరద పోటెత్తింది. దీంతో 200 ఎకరాలకు పైగా వరి మడులతోపాటు అరటి, పామాయిల్‌ తోటలు నీట మునిగాయి.

ఇక, సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని లింగాపూర్‌, ఆసిఫాబాద్‌, కెరమెరి, రెబ్బెన మండలాల్లోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కెరమెరి మండలంలో వరద నీరు పంట చేలలోకి చేరింది. ఆసిఫాబాద్‌ మండలంలోని గుడిగుడి, అప్పపల్లి గ్రామాల వద్ద ఉన్న ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించడంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 44.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కరీంనగర్‌ జిల్లా కరీంనగర్‌ రూరల్‌ మండలంలో మంగళవారం అత్యధికంగా 21.6 మి.మీ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుపాటుకు చెన్నూరులో ఓ చింతచెట్టు ధ్వంసమవ్వగా దాని పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మంగళవారం సగటున 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


కృష్ణా-గోదావరి బేసిన్‌కు పెరుగుతున్న వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో కృష్ణా-గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి మంగళవారం 35 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. తుపాకులగూడెం(సమ్మక్కసాగర్‌) బ్యారేజీకి 53 వేలు, దుమ్ముగూడెం (సీతమ్మసాగర్‌) బ్యారేజీకి 54వేలు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 3275, కడెం ప్రాజెక్టుకు 2404, సుందిళ్లకు 956, అన్నారం బ్యారేజీకి 1250 క్యూసెక్కుల వరద వచ్చింది.

మేడిగడ్డలో 85గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం(సరస్వతి) బ్యారేజీ రెండో దశ జియో ఫిజికల్‌ పరీక్షలకు రెండో రోజు మంగళవారం వర్షం ఆటంకం కలిగించింది. ఇక కృష్ణా బేసిన్‌లో కీలకమైన ఆల్మట్టి ప్రాజెక్టుకు 78 వేల క్యూసెక్కుల వరద రాగా తుంగభద్ర ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల వరద రికార్డయింది.

ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 66.54 టీఎంసీల నిల్వ ఉంది. 100టీ ఎంసీలు దాటిన తర్వాతే నీటిని దిగువన ఉన్న నారాయణపూర్‌ జలాశయానికి వదిలిపెడతారు. తుంగభద్ర సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20.85 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. ఇక గోదావరి నదిపై దిగువన రాజమహేంద్రవరంలోని సర్‌ అర్థర్‌ కాటన్‌ బ్యారేజీకి 53 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 2650 క్యూసెక్కుల వరద రికార్డయింది.

ఆరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Updated Date - Jul 10 , 2024 | 06:10 AM

Advertising
Advertising
<