CM Revanth Reddy: బ్యాక్‌లాగ్‌కు చెక్
ABN, Publish Date - Oct 07 , 2024 | 04:07 AM
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో ‘బ్యాక్‌లాగ్’కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ముందు స్కూల్ అసిస్టెంట్.. తర్వాత ఎస్‌జీటీల జాబితా
రెండిటికీ ఎంపికైతే వారికి స్కూల్ అసిస్టెంట్ కొలువు
ఎస్జీటీ పోస్టుకు రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి చాన్స్
టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా నేడు
9న సీఎం రేవంత్ చేతులమీదుగా నియామక పత్రాలు
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో ‘బ్యాక్‌లాగ్’కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించి, ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. సర్టిఫికెట్ల పరిశీలనకు 1ః3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి.. ఆదివారంతో ఆ ప్రక్రియను దాదాపు పూర్తి చేశారు. అనంతరం 1ః1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. మొదట స్కూల్ అసిస్టెంట్, తర్వాత ఎస్‌జీటీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. దీనివల్ల ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక కాకుండా చూడవచ్చని భావిస్తున్నారు.
ఎవరైనా రెండు పోస్టులకూ ఎంపికైతే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఇచ్చి.. ఎస్‌జీటీ జాబితా నుంచి ఆ అభ్యర్థి పేరును తొలగిస్తారు. ఎస్‌జీటీ పోస్టుకు రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎంపిక చేస్తారు. దీనివల్ల బ్యాక్‌లాగ్ (పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోవడం) లేకుండా చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థుల జాబితా సిద్ధమైన తర్వాత వారికి ఈ నెల 8న ఈ-మెయిల్, ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. వారు ఈ నెల 9న ఎల్బీ స్టేడియంకు రావాల్సి ఉంటుంది. అక్కడ 33 జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లలో నియామక పత్రాలు అందించనున్నారు. 9న సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు పదివేలకు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేస్తామన్నారు.
ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఆయా జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారన్నారు. సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్ జిల్లా కలెక్టర్లకు అందజేస్తారన్నారు. ఎంపికైన అభ్యర్థులు 9న మధ్యాహ్నం 2 గంటల్లోపే ఎల్బీ స్టేడియంకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. వారిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, ప్రతి బస్సులో ఒక పోలీసు కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించాలని ఆదేశించారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులూ వచ్చే అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు చేయాలన్నారు. అభ్యర్థులను ఎల్బీ స్టేడియం సమీపంలోనే దించేందుకు, బస్సుల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 07 , 2024 | 04:07 AM