Hyderabad: రైతు భరోసా సంక్రాంతి నుంచి..
ABN, Publish Date - Nov 28 , 2024 | 03:53 AM
అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులకు సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయాన్ని అందించనుంది.
శాసనసభ సమావేశాల నాటికి ఉపసంఘం నివేదిక
సభలో చర్చించి విధివిధానాలు?
యాసంగి సీజన్ నుంచి ఎకరానికి రూ.7,500 చొప్పున
30న రైతు సదస్సు.. 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ
2 లక్షల్లోపు ఉండి, వివిధ కారణాలతో మాఫీ కాని వారికే
వీరికి రూ.2,800 కోట్లు.. తర్వాత రూ.2లక్షలకు పైగా ఉన్న వారికి
యాసంగిలోనూ సన్నాలకు 500 బోనస్ పథకం వర్తింపు?
ఇక నుంచి ఏటా రెండు పంటలకూ ఇవ్వాలని ఆలోచన!
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులకు సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయాన్ని అందించనుంది. రైతుబంధు పేరుతో బీఆర్‌ఎస్ హయాంలో ఎకరానికి రూ. 5 వేలు ఇవ్వగా రైతుభరోసా పేరుతో కాంగ్రెస్ సర్కారు జనవరిలో రెండో పంటకు (యాసంగి) ఎకరానికి రూ. 7,500 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబరు రెండో వారంలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని నిర్ణయించింది. ఆలోపే రైతుభరోసాపై భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించనుంది. ఉపసంఘం నివేదికను రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పాలమూరులో రైతుసదస్సు నిర్వహిస్తున్నారు. ఈనెల 30న నిర్వహించే ఈ సదస్సు సందర్భంగా 4లక్షల మంది రైతులకు రుణమాఫీ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.2లక్షల రుణమాఫీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు విడతలుగా రుణమాఫీ చేసింది. ఈ మూడు విడతల్లో తెల్ల రేషన్ కార్డులు లేనివారు, కుటుంబ నిర్ధారణ కానివాళ్లు.. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, పేర్ల పరంగా తప్పులు దొర్లిన వారు.. ఇలా సుమారు 3.50 లక్షల మందికి రుణమాఫీ జరగలేదు. ఈ మేరకు ‘క్రాప్ లోన్ వీవర్ (సీఎల్‌డబ్ల్యు)యాప్’ ను ప్రత్యేకంగా రూపొందించి సదరు రైతుల వివరాలు నమోదు చేయాలనిమండల వ్యవసాయ అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
ఆగస్టు 29వ తేదీ నుంచి సెప్టెంబరు నాలుగో తేదీ వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తర్వాత నుంచి ఏవోలు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు, కుటుంబసభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు సేకరించి, సెల్ఫీలు దిగి, రైతు నుంచి డిక్లరేషన్ తీసుకొని, ఆ ‘యాప్’లో నమోదు చేశారు. కుటుంబ నిర్ధారణ పూర్తిచేశారు. ఇతర తప్పులను కూడా సరిచేశారు. ఇక కెనరా బ్యాంకుతోపాటు కొన్ని బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు నిర్ణీత వ్యవధిలో ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది. ఈ మేరకు 50 వేల మంది రైతుల అప్పుల వివరాలను బ్యాంకర్లు సమర్పించారు. దీంతో మొత్తం కలిపి 4 లక్షల మంది రైతుల లెక్క తేలింది. ఈ రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేయటానికి రూ. 2,700 కోట్ల నుంచి రూ. 2,800 కోట్లు అవసరమవుతున్నాయి. రైతు సదస్సు రోజున లాంఛనంగా చెక్కులు పంపిణీచేసి... ఆ తర్వాత డిసెంబరు మొదటి వారంలో ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించిన తర్వాత... రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. దాంతో రూ. 2 లక్షల వరకు బకాయిలున్న రైతుల రుణ మాఫీ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత రూ. 2 లక్షలకు మించి బకాయిలున్న రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది.
‘భరోసా’పై పరిమితి?
రైతుభరోసాకు ప్రాతిపదికపై ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. వ్యవసాయ భూముల జాబితాలో భూములు ఉన్నా కూడా సాగుకు యోగ్యంగా లేని వాటిని ఈ రైతుభరోసా పథకం నుంచి తొలగించనున్నారు. అంటే.. బీడు భూములు, రాళ్లు రప్పలు, కొండలు, గుట్టలున్న భూములతో పాటు స్ధిరాస్తి వెంచర్లుగా మారినప్పటికీ వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నవాటికి పెట్టుబడి సాయం నిలిపివేయనున్నారు. ఆ మేరకు పంటలు సాగుచేసే భూములకు మాత్రమే ఇస్తారని, సాగు చేయకుండా ఖాళీగా పెట్టిన భూములకు భరోసా ఇవ్వరనే చర్చ కూడా సాగుతోంది. ఇక ప్రతి రైతుకు ఎంత విస్తీర్ణం ఉంటే అంత భూమికి రైతు భరోసా ఇవ్వాలా? వద్దా? అనే చర్చ కూడా ఉంది. అయితే ఎక్కడో ఒక చోట నియంత్రణ పెట్టాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఈ నియంత్రణ ఎన్ని ఎకరాలకు పెడతారు? పదెకరాల వరకు ఇస్తారా? ఏడున్నర ఎకరాల వరకు పరిమితం చేస్తారా? అనేది మంత్రివర్గ ఉపసంఘం నివేదిక, శాసనసభలో చర్చ నిర్వహించిన తర్వాత నిర్ణయించే అవకాశాలున్నాయి.
యాసంగిలోనూ సన్నాలకు బోనస్?
సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 చొప్పున ఇస్తున్న ప్రోత్సాహకాన్ని ఈ యాసంగి పంటకాలంలో కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ వానాకాలానికో, యాసంగికో పరిమితం కాకుండా యేటా, ప్రతి పంటకాలంలో కూడా సన్నాలకు రూ. 500 ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్న రైతులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. యాసంగిలో కూడా సన్నాలకు బోనస్ ఇస్తారా? అని వ్యవసాయశాఖ అధికారులను, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అడుగుతున్నారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికితీసుకెళ్లగా సన్నాలకిచ్చే బోనస్ పథకం కొనసాగుతుందని, ఈమేరకు రైతులకు కూడా సమాచారం, స్పష్టతనివ్వాలని ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
రైతు సదస్సుకు సర్వం సిద్ధం
తుమ్మల చేతుల మీదుగా నేడు ప్రారంభం
మహబూబ్‌నగర్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి రైతు సదస్సుకు సర్వం సిద్ధమైంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద ఏర్పాటు చేసిన రైతు సదస్సు వేదికను అధికారులు సిద్ధం చేశారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, యాంత్రీకరణపై అవగాహన కల్పించేందుకుగాను సదస్సు జరిగే ప్రాంగణంలో 155 స్టాళ్లతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ రైతు సదస్సును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. సదస్సులో తొలి రోజు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సుమారు 5 వేల మంది రైతులు పాల్గొంటారు. రెండో రోజు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన మరో 5 వేల మంది రైతులు పాల్గొంటారు. వీరిందరికి వివిధ అంశాలపై ఈ సదస్సులో అవగాహన కల్పిస్తారు. ఇక, చివరి రోజు, శనివారం జరిగే సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మంది రైతులను తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళిక చేస్తున్నారు.
Updated Date - Nov 28 , 2024 | 03:53 AM