IMD: ఈ నెల చలి తక్కువే!
ABN, Publish Date - Nov 02 , 2024 | 03:49 AM
గత శతాబ్దానికి పైగా కాలంలో ఈ ఏడాది అక్టోబరులో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901 నుంచి అక్టోబరు నెలలో నమోదైన గరిష్ఠ, కనిష్ఠ సగటు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... ఈ ఏడాది 1.23 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
ఎక్కువ ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చు.. భారత వాతావరణ శాఖ అంచనా
విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గత శతాబ్దానికి పైగా కాలంలో ఈ ఏడాది అక్టోబరులో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901 నుంచి అక్టోబరు నెలలో నమోదైన గరిష్ఠ, కనిష్ఠ సగటు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... ఈ ఏడాది 1.23 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నవంబరులో కూడా కూడా ఇదే విధంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని, రానున్న శీతాకాల ప్రారంభ సూచిక ఇచ్చే అవకాశం లేదని, చలి తక్కువగానే ఉంటుందని భారత వాతావరణ విభాగం శుక్రవారం వెల్లడించింది. వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్ బలహీనపడడం, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో లానినా ఏర్పడకపోవడం, బంగాళాఖాతంలో వరుసగా ఒక వాయుగుండం, ఒక తీవ్ర తుఫాన్ ఏర్పడడంతో సముద్రం మీదుగా భూమిపైకి రావాల్సిన గాలులు నిలిచిపోయాయి.
వీటన్నింటి ప్రభావంతో అక్టోబరులో అనేక ప్రాంతాల్లో వేసవి మాదిరి వాతావరణం నెలకొందని తెలిపింది. రానున్న రెండు వారాల పాటు వాయవ్య మైదాన ప్రాంతాల్లో 2-5 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని, ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర వెల్లడించారు. దీని వలన నవంబరును శీతాకాలం నెలగా పరిగణించడం లేదని చెప్పారు. ప్రపంచంలోని అన్ని వాతావరణ సంస్థల అంచనాలకు భిన్నంగా పసిఫిక్‌లో ఇంకా లానినా ఏర్పడలేదు. అందువల్ల ఈ నెలలో దేశంలో చలి ప్రభావం అంతంతమాత్రంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. డిసెంబరు నెలాఖరు నాటికి లానినా ఏర్పడే అవకాశం ఉంది. దాంతో డిసెంబరు, జనవరి నెలల్లో చలి గాలుల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
ఈనెల దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ వర్షపాతం
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. నవంబరులో దేశంలో ప్రధానంగా ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపించే దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. ఏపీ విషయానికి వస్తే దక్షిణ కోస్తా, రాయలసీమలకు ఈశాన్య రుతుపవనాలు అత్యంత కీలకం. అందువల్ల ఈ నెలలో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Updated Date - Nov 02 , 2024 | 03:49 AM