ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tenders: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి టెండర్లు జనవరిలో..

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:25 AM

రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణ పనుల కోసం జనవరిలో టెండర్లను ఆహ్వానించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

  • 2 ప్యాకేజీల్లో పనులు.. త్వరలో దక్షిణ డీపీఆర్‌ టెండర్లు

  • రైతులకు నష్టం జరగొద్దని సీఎం రేవంత్‌ చెప్పారు

  • ఆర్‌ఆర్‌ఆర్‌ బాధ్యతలు ఐఏఎస్‌ దాసరి హరిచందనకు

  • ఎనిమిది నెలల్లో మామునూరు విమానాశ్రయం పూర్తి

  • ఫిబ్రవరిలో విజయవాడ హైవే విస్తరణ పనులు

  • కేసీఆర్‌ వద్దంటే మూసీ ప్రాజెక్టు ఆపేస్తాం: కోమటిరెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణ పనుల కోసం జనవరిలో టెండర్లను ఆహ్వానించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆ లోపే పరిహారం సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. రెండు ప్యాకేజీల్లో పనులను చేపడతామని చెప్పారు. గత ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా వ్యవహరించక పోవడం వల్లనే ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం నిర్మాణం ఆలస్యమైందని కోమటిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉత్తరభాగంలో 94 శాతం భూ సేకరణ పూర్తయిందన్నారు. 80 శాతం భూసేకరణ పూర్తవ్వగానే టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉన్నా జాతీయ రహదారుల సంస్థ పిలవలేదని చెప్పారు. పరిహారం విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారన్నారు. ఉత్తరభాగం నిర్మాణం కోసం 1,895 హెక్టార్ల భూమి అవసరమవుతోందని, 1,862 హెక్టార్లకు సంబంధించి ఇప్పటికే 3డీ నోటిఫికేషన్‌(భూమిని సేకరించే ఉద్దేశ ప్రకటన) జారీ చేశామన్నారు. ఇందులో 1320 హెక్టార్ల భూమికి సంబంధించి ముసాయిదా అవార్డుల ప్రకటన, 427 హెక్టార్లకు సంబంధించి అవార్డు విచారణ జరుగుతోందని, మిగతాది వివిధ దశల్లో హైకోర్టులో విచారణలో ఉందని వివరించారు.


రీజినల్‌ రింగు రోడ్డులోని దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనుందని మంత్రి ప్రకటించారు. 2017లో ఆర్‌ఆర్‌ఆర్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్మాణ పనులను ఆశించినంత వేగంగా చేపట్టలేక పోయినందున దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టనుందని చెప్పారు. మొదట ఆరు లేన్లతో చేపడతామని, తర్వాత రద్దీ పెరిగాక ఎనిమిది లేన్లుగా విస్తరిస్తామని వెల్లడించారు. ఈ మార్గాన్ని ఫోర్త్‌ సిటీ మీదుగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానిస్తామని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ డీపీఆర్‌ తయారీకి సలహా సంస్థ ఎంపికకు టెండర్లను ఆహ్వానిస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశామని వెల్లడించారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రపంచ బ్యాంకు, జైకా, ఏసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంకు(ఏడీబీ) సహా వివిధ ఆర్ధిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. అలైన్‌మెంట్‌ అధ్యయనం కోసం ఆర్‌ అండ్‌ బీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇప్పటికే కమిటీని నియమించామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు డైరక్టర్‌గా ఆర్‌ అండ్‌ బీ స్పెషల్‌ సెక్రటరీ దాసరి హరిచందనను నియమించామని చెప్పారు. దక్షిణభాగం నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ముందే మార్కెట్‌ ధరలను, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం లభించే ధరలను పరిశీలించాలని ఆదేశించామన్నారు.


  • 8 నెలల్లో మామునూరు ఎయిర్‌పోర్టు

వరంగల్‌ జిల్లాలోని మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని వెంకటరెడ్డి తెలిపారు. డిసెంబర్‌లో తాను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిసి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడును కలుస్తామన్నారు. 8 నెలల్లో మామునూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. వరంగల్‌ నుంచి తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరులకు విమానయాన సౌకర్యం కలిస్తామన్నారు. కొత్తగూడెం, రామగుండాలలో కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తామని, ఇవి రెండూ పారిశ్రామిక, అధ్యాత్మిక కేంద్రాలు కావడంతో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమని చెప్పారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. శంషాబాద్‌కు 150 కిలోమీటర్ల లోపు దూరంలోనే ఉన్న మామునూరులో విమానాశ్రయ ఏర్పాటుకు అభ్యంతరం లేదని పత్రం అందించిన జీఎంఆర్‌ సంస్థకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌-65)ని ఆరు లేన్లుగా విస్తరించడానికి డీపీఆర్‌ సిద్ధమవుతోందని వెంకటరెడ్డి ప్రకటించారు. ఫిబ్రవరిలో పనులు మొదలవుతాయని చెప్పారు. ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను ఏడాదిన్నరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.7 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని మంత్రి చెప్పారు. ఏడాదిలోపు డీపీఆర్‌ పూర్తి చేసి, నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు.


  • దక్షిణ భాగానికి.. ప్రాజెక్టు అమలు విభాగం

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగానికి ప్రభుత్వం ‘ప్రాజెక్టు అమలు విభాగాన్ని’ ఏర్పాటు చేసింది. పర్యావరణ అంశాలను పరిశీలించేందుకు అటవీ శాఖలో జిల్లా స్థాయి అటవీ అధికారి ఒకరితో పాటు, ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ)గా ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజినీరును, ఇద్దరు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లను, ఒక అకౌంటెంట్‌ను కలిపి మొత్తం ఐదుగురితో విభాగాన్ని ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది.


  • కేసీఆర్‌ ఆపమంటే ఆపుతాం

కేటీఆర్‌, హరీ్‌షకు అరెస్టుల భయం పట్టుకుందని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. అందుకే, అభివృద్ధి పనులను అడ్డుకొనేందుకు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌ వచ్చి మూసీని శుద్ధి చేయొద్దని అంటే వెంటనే ప్రాజెక్టును నిలిపేస్తామని మంత్రి సవాల్‌ విసిరారు. బీజేపీ నేతలు నగరంలో ఒకరోజు మూసీ పక్కన నిద్ర చేయడం కాదని, దమ్ముంటే మూడు నెలలు నల్గొండలో నిద్ర చేయాలని అన్నారు. అప్పటికీ కాళ్లు, చేతులు వంకరలు తిరగకుండా హైదరాబాద్‌ వస్తారేమో చూద్దామని వ్యాఖ్యానించారు. కిషన్‌రెడ్డి ఢిల్లీలో దోమల బాధ తట్టుకోలేక అచ్చం హైదరాబాద్‌లో ఉంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. బషీర్‌బాగ్‌లో అప్పటి సీఎంతో కలిసి రైతులపై కాల్పులు జరిపించిన కేసీఆర్‌ ఇప్పుడు రైతులపై దొంగ ప్రేమను ఒలక బోస్తున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 19 , 2024 | 01:25 AM