Dubakka: కల్యాణలక్ష్మి చెక్‌ల పంపిణీలో రగడ
ABN, Publish Date - Sep 27 , 2024 | 02:45 AM
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్‌ల పంపిణీ సందర్భంగా దుబ్బాకలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రగడ నెలకొంది.
దుబ్బాకలో మంత్రి కొండా సురేఖ సమక్షంలోనే రచ్చ
వేదికపైకి కాంగ్రెస్ నేత రావడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యంతరం
మైక్ లాక్కోబోయిన కాంగ్రెస్ నేత..
వాగ్వాదానికి దిగిన ఇరు వర్గాలు..
దుబ్బాక, సెప్టెంబరు 26: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్‌ల పంపిణీ సందర్భంగా దుబ్బాకలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రగడ నెలకొంది. ఓడిపోయినా నియోజకవర్గ ఇన్‌చార్జే ఇక్కడ ఎమ్మెల్యే అం టూ కాంగ్రెస్ నాయకులు.. డిపాజిట్ కూడా దక్కించుకోని నాయకుడిని ప్రభుత్వ కార్యక్రమానికి ఎలా రానిస్తారంటూ బీఆర్‌ఎస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ సమక్షంలోనే గురువారం ఈ రచ్చ చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 518 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షత వహించగా, ఎంపీ ఎం.రఘునందర్‌రావు హాజరయ్యారు.
అయితే, ఈ వేదికపైకి కాంగ్రెస్ నియోజవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి రావడంతో ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా, చెరుకు శ్రీనివా్‌సరెడ్డి వేదికపైకి రావడమే కాకుండా.. ఎమ్మెల్యే చేతిలో ఉన్న మైక్ తీసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే మంత్రి కొండా సురేఖ ఆయన్ను వారించి పక్కన కూర్చోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేయడంతో సభావేదిక వద్ద గందరగోళం ఏర్పాడింది. మంత్రి పలు మార్లు జోక్యం చేసుకుని వారించినా.. ఎవరూ వినలేదు. చివరకు ఐదుగురు లబ్ధిదారులకు మంత్రి సురేఖ చెక్‌లు ఇచ్చి వెళ్లిపోగా.. మిగతా లబ్ధిదారులకు ప్రభాకర్‌రావు చెక్‌లు అందజేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ రోజు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు పిలువలేదని గుర్తు చేశారు.
Updated Date - Sep 27 , 2024 | 02:45 AM