Asifabad: ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం.. ఆసిఫాబాద్‌లో ఏజెన్సీ బంద్ ఉద్రిక్తం
ABN, Publish Date - Sep 05 , 2024 | 05:14 AM
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం, దాడి ఘటన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టించింది.
జైనూరు మండల కేంద్రానికి వేలాదిగా ఆదివాసీలు.. నిందితుడి ఇల్లు ధ్వంసం, నిప్పు
ఓ వర్గానికి చెందిన దుకాణ సముదాయంపై దాడి
బాధితురాలికి ప్రభుత్వం తరఫున న్యాయం: సీతక్క
నిందితుడిపై వెంటనే చర్యలెందుకు తీసుకోలేదు
డీజీపీని ఆరా తీసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
జైనూరు/అడ్డగుట్ట/ఆసిఫాబాద్/న్యూఢిల్లీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం, దాడి ఘటన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టించింది. ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్‌కు సంపూర్ణ మద్దతు లభించింది. నిందితుడిని ఉరి తీయాలంటూ వేలాది మంది ఆదివాసీలు జైనూరు మండల కేంద్రానికి తరలివచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిందితుడి ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఆ తర్వాత.. అతడిని వెంటనే శిక్షించాలంటూ ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత ఆదివాసీలు మండల కేంద్రంలోని ఓ వర్గానికి చెందిన దుకాణ సముదాయంలోని పాన్‌షాపులోని సామగ్రిని రోడ్డుపైకి తీసుకువచ్చి నిప్పంటించారు. దీంతో ఆ వర్గం వారు ఆందోళనకు దిగి కొంతమంది దుకాణాలను ధ్వంసం చేశారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులను అదుపు చేయడానికి ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించాల్సి వచ్చింది.
కఠిన శిక్ష పడేలా చేస్తాం: మంత్రి సీతక్క
బాధితురాలికి ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని సీతక్క బుధవారం పరామర్శించి వివరాలను తెలుసుకొన్నారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని, అతనికి కఠినశిక్ష పడేలా చేస్తామన్నారు. మరోవైపు, ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం అమానుషమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బుధవారం డీజీపీ జితేందర్‌కు సంజయ్ ఫోన్ చేసి జైనూర్‌లో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులపై ఆరా తీశారు. నిందితుడిపై చర్యలెందుకు తీసుకోలేదని నిలదీశారు.
అసలు ఏం జరిగిందంటే..!
జైనూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళ ఆగస్టు 31న సిర్పూర్(యూ) మండలంలోని తన తల్లిగారి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా సోనుపటేల్‌గూడకు చెందిన నిందితుడు ఆమెను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. రాఘాపూర్ దాటిన తర్వాత అత్యచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో చితకబాదాడు. దీంతో ఆ మహిళ స్పృహ కోల్పోయింది. ఆమె చనిపోయిందేమోనని భావించిన నిందితుడు.. యాక్సిడెంట్ జరిగినట్లుగా ఆ మహిళను రోడ్డుపై పడేసి పరారయ్యాడు.
ఆ రోడ్డుపై వెళ్లే వాళ్లు ఆమెను ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమెపై అత్యాచార యత్నం, దాడి జరిగిందన్న విషయం బాధిత మహిళ స్పృహలోకి వచ్చి చెప్పేవరకు పోలీసులకు తెలియదు. కాగా, బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సిర్పూర్(యూ) పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 1న కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ఆదివాసీ సంఘాలు మంగళవారమే జైనూరులో ఆందోళనకు దిగి.. బుధవారం ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చారు.
జైనూర్‌లో 144 సెక్షన్, ఇంటర్నెట్ బంద్
హైదరాబాద్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జైనూర్‌లో శాంతి, భద్రతలు అదుపులోకి వచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా జిల్లా యంత్రాంగం స్థానికంగా 144 సెక్షన్ విధించింది. సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేయకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పోలీస్ పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు. జైనూర్‌లో పరిస్థితుల్ని డీజీపీ జితేందర్, అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) మహేశ్ భగవత్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
Updated Date - Sep 05 , 2024 | 05:14 AM