Export Scam: బాస్మతి ముసుగులో పారాబాయిల్డ్ బియ్యం!
ABN, Publish Date - Sep 28 , 2024 | 04:43 AM
రాష్ట్రం నుంచి బాస్మతి ముసుగులో దొడ్డిదారిన దుబాయ్‌కి ఎగుమతి అవుతున్న పారాబాయిల్డ్ బియ్యాన్ని గుజరాత్ అధికారులు పట్టుకున్నారు.
గుజరాత్‌లో రూ.7 కోట్ల విలువైన
తెలంగాణ బియ్యం పట్టివేత
దుబాయ్‌కి తరలిస్తుండగా గాంధీధామ్ ఓడరేవులో సీజ్
ఎగుమతిదారుడు, బినామీ సుధాకర్ సహా ముగ్గురి అరెస్ట్
గుజరాత్‌లో రూ.7 కోట్ల విలువైన తెలంగాణ బియ్యం పట్టివేత
8 40 కంటైనర్ల బియ్యం సీజ్ చేసిన డీఆర్‌ఐ
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి బాస్మతి ముసుగులో దొడ్డిదారిన దుబాయ్‌కి ఎగుమతి అవుతున్న పారాబాయిల్డ్ బియ్యాన్ని గుజరాత్ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి వెళ్తున్న ఈ బియ్యం గాంధీధామ్ ఓడరేవులో పట్టుబడ్డాయి. రూ.7 కోట్ల విలువైన 40 కంటైనర్ల నాన్ బాస్మతి పారాబాయిల్డ్ బియ్యాన్ని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని, సీజ్ చేశారు. ఈ 40 కంటైనర్లను టర్మినల్ నుంచి సీఎ్‌ఫఎస్ (కంటైనర్ ఫ్రైట్ స్టేషన్)కు తరలించి, కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఒక కన్సల్టెన్సీ ఎగుమతిదారుడు, బినామీ సుధాకర్‌తో సహా ముగ్గురిపై డీఆర్‌ఐ అధికారులు కేసు నమోదుచేసి రిమాండ్‌కు పంపారు.
ఇటీవల జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర అధికారులకు సమాచారం రావడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం బాస్మతి బియ్యానికి ఎగుమతి సుంకం విధించడంలేదు. దేశీయ ఆహార ధాన్యాల ధరలను, ఎగుమతులను నియంత్రించడానికి పారా బాయిల్డ్ రైస్‌పై 20 శాతం ఎగుమతి సుంకాన్ని వసూలు చేస్తోంది. 2023 ఆగస్టు 25 నుంచి ఈ పన్ను వ్యవస్థ అమలులో ఉంది. అయితే పారా బాయిల్డ్ రైస్‌ను దుబాయ్, యూఏఈ తదితర గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు, దళారులు, మిల్లర్లు.. ప్రభుత్వానికి 20 శాతం అదనపు సుంకం ఎగ్గొట్టడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఎగుమతి సుంకం లేని బాస్మతి బియ్యం ముసుగులో పారా బాయిల్డ్ రైస్‌ను విదేశాలకు పంపిస్తున్నారు.
బియ్యం కంటైనర్లలో కింది భాగంలో పారాబాయిల్డ్ రైస్, పైభాగంలో బాస్మతి బియ్యం నింపి అధికారుల కళ్లుకప్పి ఎగుమతి చేస్తున్నారు. ఇదే పద్ధతిలో హైదరాబాద్‌కు చెందిన ఓ కన్సల్టెన్సీ.. 40 కంటైనర్ల పారాబాయిల్డ్ రైస్‌ను గుజరాత్‌లోని గాంధీధామ్ ఓడరేవు నుంచి దుబాయ్‌కి పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. రూ.7 కోట్ల విలువైన బియ్యానికి 20 శాతం ట్యాక్స్ ఎగ్గొట్టి లబ్ధిపొందేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. డీఆర్‌ఐ అధికారులు.. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి ఎగుమతి అవుతున్న బియ్యాన్ని ఓడరేవులో పట్టుకొని సీజ్ చేశారు. తక్షణ చర్యగా రూ.65 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. 20ు ఎగుమతి సుంకం కూడా వసూలు చేసినట్లు తెలిసింది. అదేక్రమంలో బ్యాంకు గ్యారెంటీ కూడా అడిగినట్లు సమాచారం.
కాగా, బియ్యం నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటారనేది తెలుస్తుంది. రిమాండ్ రిపోర్టులో కూడా తెలంగాణ నుంచి బియ్యం అక్రమ రవాణా ఎలా జరుగుతోంది? వ్యాపారులు, దళారులు, మిల్లర్లు ఎగుమతి సుంకం ఎగ్గొట్టడానికి ఎలాంటి వక్రమార్గాలను ఎంచుకుంటున్నారు? అనే అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రాష్ట్ర అధికారులు కూడా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా టెండర్లలో విక్రయించిన ధాన్యానికి, గుజరాత్‌లో పట్టుబడిన పారాబాయిల్డ్ రైస్‌కు లింకు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 35 లక్షల టన్నుల ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించి టెండర్లు పిలవగా.. అందులో ఒక (3.50 లక్షల టన్నుల) లాట్ దక్కించుకున్న ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచే పారాబాయిల్డ్ రైస్ ఎగుమతి అయినట్లు తెలుస్తోంది.
Updated Date - Sep 28 , 2024 | 04:43 AM