Uttam: ఎక్కువ ధాన్యం వస్తే.. కర్ణాటక, తమిళనాడుకు ఎగుమతి
ABN, Publish Date - Nov 09 , 2024 | 03:26 AM
రాష్ట్రంలో అవసరానికి మించి ధాన్యం సేకరణ జరిగితే.. మిగులు ధాన్యాన్ని పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలకు ఎగుమతి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
బ్యాంకు గ్యారెంటీ ఏపీ కంటే ఇక్కడే చాలా తక్కువ
రైస్‌మిల్లర్లు సహకరించనిచోట్ల
మధ్యంతర గోదాముల్లో ధాన్యం నిల్వ
మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అవసరానికి మించి ధాన్యం సేకరణ జరిగితే.. మిగులు ధాన్యాన్ని పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలకు ఎగుమతి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తయిన తర్వాత ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. తెలంగాణపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి పౌరసరఫరాల భవన్‌లో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్‌లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రైస్‌మిల్లర్లు సహకరించని చోట్ల ధాన్యాన్ని మధ్యంతర గోదాములకు తరలించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పరిధిలో 30 లక్షల టన్నుల స్థలాన్ని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. మధ్యంతర గోదాముల్లో నిల్వచేసి, ఆతర్వాత కస్టమ్ మిల్లింగ్ ఇవ్వటంకోసం అదనపు ఖర్చు ఎంతైన ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఈ సీజన్‌లో 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందన్నారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో రైస్‌మిల్ ఇండస్ట్రీకి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మిల్లర్ల నుంచి 100ు బ్యాంకు గ్యారెంటీ తీసుకొని.. ధాన్యం అప్పగిస్తున్నారని, ఇక్కడ కేవలం 10ు మాత్రమే బ్యాంకు గ్యారెంటీ సిస్టమ్ పెట్టినట్లు ఉత్తమ్ వెల్లడించారు. బ్యాంకు గ్యారెంటీలు, డిఫాల్టర్లకు జరిమానాలు.. ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణలో తక్కువే ఉన్నాయనే విషయాన్ని రైస్‌మిల్లర్లు గ్రహించాలన్నారు. మిల్లింగ్ చార్జీలు కూడా రూ.40 నుంచి రూ.50కి పెంచినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా మిల్లర్లు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
Updated Date - Nov 09 , 2024 | 03:26 AM